అర్చన ఉలిక్కిపడి చూసింది.
"అవునా?" అన్నట్టున్న ఆమె చూపు అర్ధం చేసుకున్న నీలిమ అంది. "అవును నీకోసం వచ్చారు. మీ ఇల్లు అమ్మేశారని తెలిసి చాలా ఎంక్వైరీ చేశారు. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు."
అర్చనకి అరికాళ్ళల్లో, అరిచేతుల్లో చెమటలు పట్టేశాయి. నోట్లోంచి మాట రానంత నీరసం ఆవహించింది.
నీలిమ సన్నని స్వరంతో అంది "అర్చనా! చిన్నప్పటినుంచీ నీలో ఉన్న విప్లవాత్మక భావాలు, నీ యాటిట్యూడ్ నాకు బాగా తెలుసు. నిన్ను అన్యాయంగా ఎవరు ఒక్కమాట అన్నా సహించేదానివి కాదు. అలాంటిది నాగరాజు చేసిన నమ్మకద్రోహం నీ మనసు మీద ఎంతటి గాయం చేసి ఉంటుందో నేను ఊహించగలను. కానీ, ఒక తుచ్చుడి కోసం విలువైన నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావనిపిస్తుంది నాకు. ఎనీవే ఈ సమయమో, ఇక్కడ ఈ పవిత్రక్షేత్రంలో నీ తప్పొప్పుల గురించి మాట్లాడి నీ మనసు కష్టపెట్టడం నాకిష్టం లేదు. నువ్వు తిరుపతి ఒక్కదానివే వచ్చావు. నా స్నేహితురాలివి. అనుకోకుండా కలిశాం. సరదాగా గడిపి స్వామి దీవెనలు తీసుకుని వెళ్ళిపోదాం. సరేనా?"
నీలిమ స్వరంలోని మార్దవం అర్చన మనసులో ఉన్న కోపం మీద మెల్లగా పన్నీరు చిలకరిస్తున్నట్టు అయింది. నెమ్మదిగా తనెందుకు దర్శనానికి వచ్చిందో చెప్పింది. తన పోస్టింగ్ సంగతి. ఇంతకాలం తను వైజాగ్ లోనే ఉన్న విషయం అన్నీ చెప్పింది.
"ఎంత చిత్రం! ఇంతకాలం నుంచీ ఒకే ఊళ్ళో ఉంటూమనం కలుసుకోలేకపోయామా? పోనీలే. ఇప్పుడైనా కలుసుకున్నాం. ఏదెలా ఉన్నా నీ లక్ష్యం చేరుకోబోతున్న నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అర్చనా! విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్" అంది నీలిమ.
"థాంక్యూ..."
ఆ తరువాత ఆ దంపతులతో కలిసి లంచ్ చేసింది. నీలిమ భర్త పాపను తీసుకుని వెళ్ళిపోయాడు. కాస్సేపు నీలిమా, అర్చన కలిసి షాపింగ్ చేశారు. దేవుడి బొమ్మలు, గాజులు కొనుక్కున్నారు, ఇద్దరూ కలిసి రూమ్ కెళ్ళిపోయారు.
"కాస్సేపు రెస్ట్ తీసుకుంటాను అర్చనా! మళ్ళీ కలుద్దాం. రేపు ఉదయం నాలుగింటికల్లా రెడీగా ఉండు" అంటూ నీలిమ తన రూమ్ కి వెళ్ళిపోయింది. అర్చన కొన్న వస్తువులన్నీ బ్యాగ్ లో సర్దేసి, చీర మార్చుకుని తానూ విశ్రాంతిగా మంచం మీద వాలింది. కాస్సేపటికే ఆమెకి నిద్రపట్టింది.
* * * * *
వేణు, కృష్ణస్వామి దంపతులు, చక్రవర్తి దంపతులు, నీలవేణి, పిల్లలు అందరూ సుప్రభాత సేవ చూసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని బయటకొచ్చారు.
అర్చనానంతర దర్శనం కోసం, ధర్మదర్శనం కోసం జనం క్యూల్లో ఉన్నారు. వాళ్ళందరినీ లోపలికి వదులుతున్నట్టున్నారు. గోవిందనామాలతో పరిసరాలు మార్మోగిపోతున్నాయి. జనం స్వామిని దర్శించుకోడానికి హాహాకారాలు చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు.
ఆ జనాన్ని చూస్తుంటే మాధవికి కళ్ళు తిరుగుతున్నట్టు అయింది.
"అక్కా.... స్వామిని కళ్ళారా చూశాను. వైకుంఠానికొచ్చినట్టు అనిపిస్తోంది. చాలా బాగుంధక్కా" అంది నీలవేణి మాధవి పక్కగా నడుస్తూ.
మాధవి సన్నగా నవ్వి ఊరుకుంది.
"రండి. విమానం స్వామిని చూద్దాం" అన్తూజ్నం మధ్యలో దూరారు తాయారమ్మ, కృష్ణస్వామి. రిత్విక్ ని ఎత్తుకుని నీలవేణి వాళ్ళని అనుసరించింది. చక్రవర్తి చేతుల్లోంచి కౌశిక్ ని తనెత్తుకుని వేణు కూడా అరుగు ఎక్కాడు. మాధవి చెదిరిన జుట్టు సవరించుకుంటూ ముందుకు నడుస్తుండగా చక్రవర్తి ఆమె పక్కగా వచ్చి రహస్యంగా అన్నాడు.
"మధూ!"
మాధవి చక్రవర్తి వైపు చూసింది.
"నేను.... నేను అర్చనని చూశాను."
"వాట్?" అదిరిపడింది మాధవి. "అ... అర్చనా? ఎక్కడ? ఎక్కడ?" ఉద్వేగంగా చూపులు తిప్పింది. ఆమె కళ్ళు జనప్రవాహంలో అర్చన కోసం చంచలంగా తిరిగాయి.
"లోపలికి దర్శనానికి వెళ్తున్నవాళ్ళని చూశాను. ఒకమ్మాయి నేరేడుపండు రంగు పట్టుచీర కట్టుకుంది. అచ్చు అర్చనలాగే అనిపించింది."
"మీరు సరిగా చూశారా? మీ భ్రమ ఏమో! ఇంత జనంలో అర్చన ఎలా కనిపించింది మీకు?"
"ఏమో! సడన్ గా నా కళ్ళు అటు తిరిగాయి. బైటికొస్తూ జనం వైపు చూస్తున్నాను. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ఏదో చదువుతూ నెమ్మదిగా నడుస్తోంది. నా కళ్ళు అబద్ధం చెప్పవనే నేననుకుంటున్నాను."
చాలా క్లియర్ గా అంటున్నాడంటే నిజంగానే చక్రవర్తి అర్చనని చూశాడు అనిపించింది మాధవికి. చక్రవర్తి చూపులు చాలా పదును. ఎంతమందిలో ఉన్నా ఎవరినైనా ఇట్టే గుర్తిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అర్చన కనిపించి ఉంటుంది. మాధవి మనసులో అప్పటికప్పుడే అనేక ఆలోచనలు. అర్చన తిరుమల వచ్చిందా? స్వామి దర్శనం కోసం అర్చన ఎందుకు వచ్చి ఉంటుంది? అంత భక్తి ప్రపత్తులున్నాయా? నిజానికి తమ పరిచయంలో అర్చన పూజలు చేయగా ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఒక్కతే వచ్చి ఉంటుందా? చక్రవర్తిలాగే తనూ అందర్నీ చూసి ఉంటుందా? ఎందుకు అందర్నీ తప్పించుకుని తిరగాలనుకుంటోంది? ఎందుకు కుటుంబాన్ని కాదనుకుంటోంది? నిజంగా అర్చనేనా? అర్చన అయితే ఎక్కడున్నా, ఎలాగైనా పట్టుకోవాలి. వేణుని, బాబుని చూసిందా? అరే బాబు వేణు చేతుల్లో లేడు. నీలవేణి ఎవరో తెలియదు అర్చనకి. అయితే బాబుని చూసి ఉండకపోవచ్చు. వేణుని మాత్రం తప్పకుండా చూసే ఉంటుంది.
"పద వెడదాం. నువ్వట్లా నిలబడితే బాగుండదు. పద పద" చక్రవర్తి హడావుడి చేయడంతో అందరినీ అనుసరించింది.
నడుస్తోందే కానీ ఆమెని అర్చన గురించిన ఆలోచనలు ముప్పిరిగోన్నాయి. నిజంగా అర్చనేనా? తిరుపతి ఎందుకొస్తుంది? పైగా ఒక్కతి! నో.... చక్రవర్తి పొరపాటు పడి ఉంటాడు. అర్చన నిజంగా వచ్చి ఉంటుందా? అయితే తనెక్కడున్నట్టు? ఒక్కతే వచ్చిందా? ఎందుకొచ్చినట్టు? కేవలం దర్శనం కోసమా? లేక ఎవరినన్నా కొంపతీసి పెళ్ళికానీ.... ఛ, ఛ నోరుమూసుకో తనని తను తిట్టుకుని ముందు నడుస్తున్నవాళ్ళని కలుసుకుంది. ప్రసాదం కౌంటర్ దగ్గరా, అక్కడా, ఇక్కడా ఎటు చూసినా అర్చన కోసమే మాధవి కళ్ళు అన్వేషించసాగాయి. మాటిమాటికీ వెనకపడుతోన్న మాధవిని వెనక్కి తిరిగి చూస్తూ అంది తాయారమ్మ.
"అమ్మాయ్! కాళ్ళుగానీ లాగేస్తున్నాయా ఏంటి? నెమ్మదిగా నడుస్తున్నావు?" అడిగింది.
