పట్టుచీర కట్టుకుని, తడి జుట్టుకి క్లిప్పు పెట్టి వదిలేసింది. సెల్ ఫోన్, చెప్పులు రూములోనే వదిలేసింది. దర్శనం అయాక మళ్ళీ చెప్పులు తీసుకోడానికి వెళ్ళడం ఇంకా పెద్ద పని అనిపించింది. ప్రసాదం వేసుకోవడానికి ఒక క్యారీబ్యాగు చక్కగా మడతపెట్టి పర్సులో పెట్టుకుంది. పర్సులో కొంచెం చిల్లర, మరికొంత కరెన్సీ పెట్టుకుని రూమ్ తాళం వేసి బైటికి వచ్చింది.
కౌంటర్ లో తాళంచెవి ఇచ్చి మెట్లు దిగి బైటికి వచ్చింది. టీ కుర్రాళ్ళు, కాఫీల వాళ్ళు,క్యారేజీలు, ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని కాఫీ, టీ అంటూ అరుస్తూ తిరుగుతున్నారు.
'ఏ ఏర్పాట్లూ లేకుండా దర్శనానికి వెళుతున్నాను. క్యూలో ఎంత టైమ్ పడుతుందో?' అనుకుంటూ ముందుకి వెళ్ళిపోయింది. నడిచినంత మేరా క్యూ కాంప్లెక్స్ లు జనంతో నిండి ఉన్నాయి. ఆదా, మగా, పిల్లా పెద్దా పిచ్చి జనం. ఏవిటో ఈ స్వామివారి మహిమ. దేవుడు లేడు అనేవాళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా తిరుమలకొండకి వచ్చి స్వామిని దర్శించుకోకుండా ఉండరు. ఎక్కడనుంచి ఎక్కడిదాకా ఉందో అర్ధంకానట్టు చాలా గజిబిజిగా అనిపించింది. ఏం చేయాలో తోచలేదు అర్చనకి. అలా అందరినీ చూస్తూ నడుస్తూ వెళ్ళసాగింది. ఎప్పుడో అమ్మానాన్నలతో కలిసి ఇంటర్ పాసయాక వచ్చింది. తఃనకసలు ఇక్కడ ఏమీ తెలియదు. ఎవరన్నా తోడుంటే బాగుండేది. నిట్టూర్చింది.
అమ్మానాన్న ఈ జీవితంలో ఇంక వాళ్ళని చూడలేనేమో! ఎక్కడికెళ్ళారో? అన్నయ్యకి, నాన్నకి తనమీద అభిమానం, జాలి లేకపోవచ్చు. అమ్మక్కూడా లేదా? తను చచ్చిందో, బతికిందో కూడా తెలుసుకోడానికి మనస్కరించలేదా వాళ్ళకి.
అర్చన కళ్ళు చెమర్చాయి. నీళ్ళు నిండిన కళ్ళకి పరిసరాలు మసగ్గా కనిపిస్తోంటే కళ్ళు తుడుచుకుంది.
"అర్చనా!" ఉలిక్కిపడింది అర్చన. చివ్వున వెనక్కి తిరిగింది.
నీలిమ....!
"నువ్వా?" ఆశ్చర్యంగా చూసింది.
"అంత ఆశ్చర్యపోతావేం అర్చనా! నేను తిరుపతి రాకూడదా?" చిరునవ్వుతో అడిగింది నీలిమ.
అర్చన మాట్లాడలేదు. ఈ నీలిమ ప్రాణస్నేహితురాలు ఒకప్పుడు. కనీ, ఈనాడు తన బద్ధశత్రువు. ఏ మొహం పెట్టుకుని పలకరిస్తోంది. పక్కనే ఆమె భర్త లాబోలు మూడేళ్ళ పాపనెత్తుకుని నిలబడి ఉన్నాడు. బానే ఉన్నాడు. ఎందుకు కనిపించింది ఈమె? తనకసలు మాట్లాడాలన్న ఆసక్తే లేదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆనాటి స్నేహితుల్ని కానీ, క్లాస్ మేట్స్ ని కానీ ఎవర్నీ కలవాలని లేదు. ఎందుకిలా జరిగింది? స్వామి దర్శనం కోసం వెళ్తోంటే ఏదో అపశృతిలా అనిపించింది అర్చనకి.
"మావారు అర్చనా, ఇది నా కూతురు" యువకుడిని పరిచయం చేసింది.
"హలో" పలకరింపుగా నవ్వాడు.
"హలో!"బలవంతంగా నవ్వింది అర్చన.
"ఒక్కదానివే వచ్చావా అర్చనా?"
అర్చన ఏం మాట్లాడలేదు. కదలకుండా క్యూలో ఉన్న జనాన్ని చూస్తూ ఉండిపోయింది.
"మా దర్శనం అయిపోయింది. ఎర్లీగా వెళ్ళి క్యూలో నిలబడ్డాం. పైగా ముందే కంకణాలు వేయించుకున్నాం కదా! ఇప్పుడే బైటికి వస్తున్నాం. నికేదన్నా స్పెషల్ టికెట్ ఉందా?"
లేదన్నట్టు తలూపింది అర్చన.
"అరే అలా ఎలా వచ్చావు? తిరుపతికి ఫ్రీ ప్లాన్ లేకుండా వస్తారా ఎవరైనా? నువ్వన్నీ ఇలాగే చేస్తావు. సర్లే మా దగ్గర ఒక అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది. రేపు ఉదయం మాతో వద్దువుగానిలే. ఇప్పుడు నీ వల్ల కాదు. ఆక్యూలో నువ్వు నిలబడలేవు." అంటూ భర్తతో నది "మీ అమ్మగారి టికెట్ వేస్ట్ గా ఉంది కదా తనని తీసుకెళదాం."
"ఓయస్. దానికేం?" జేబులోంచి టికెట్ తీసి చూపించాడు.
"ఎందుకులే నీలిమా! ఇప్పుడు ట్రై చేస్తాను. అంతగా దర్శనం అవకపోతే రేపు మీతో వస్తాను. అయినా మీరెక్కడో, నేనెక్కడో? రేపు కలవడం ఎలాగ?" అంది అర్చన మొహమాటంగా.
"టైం ఎందుకు వేస్ట్ చేయడం? రేపు హాయిగా దర్శనం చేసుకోవచ్చు, మేము రామ్ బగీచాలో దిగాం. నువ్వెక్కడ దిగావు?"
అర్చనకి పచ్చివెలక్కాయ గొంతులో దిగినట్టు అయింది. తనూ అక్కడే కదా! దేవుడా! ఏమిటీ పరీక్ష.
"నేనూ అక్కడే!" నీరసంగా అంది.
"అరే అలాగా! ఇంకేం ప్రాబ్లమేం లేదు. రేపు వెడదాంలే. బాగా నీరసంగా అనిపిస్తున్నావు. బ్రేక్ ఫాస్ట్ చేశావా? అయినా లంచ్ టైం అయింది. పద అమాతో కలిసి లంచ్ చేద్దువుగాని."
"వద్దొద్దు. నాకు ఆకలి లేదు. నేను ఊరికే అలా వెళ్ళి రూముకి వెళ్తాలే. మీరు వెళ్ళండి" గాభరాగా అంది అర్చన.
"ఏంటి దర్శనం తరువాత చేద్దామనా? తిరుపతిలో అలాంటి సెంటిమెంట్స్ ఓన్లీ సుప్రభాత సేవకో, పవళింపు సేవకో, తోమాల సేవకో. ఇలా మిట్టమధ్యాహ్నం దర్శనానికి వెళ్తూ భోజనం చేయకుండా వెడితే కళ్ళు తిరిగి పడిపోతావు. పద. కలిసి భోంచేద్దాం."
"వద్దులే నీలిమా! నేను వెళ్తాను."
నీలిమ భర్తను చూస్తూ "మీరు నడుస్తుండండి. మేం వస్తాం" అంది.
పాపనెత్తుకుని అతను ముందుకెళ్ళిపోయాఉద్.
నీలిమ అర్చన చేయి పట్టుకుని నడిపిస్తూ అంది. "నాకు తెలుసు అర్చనా! నామీద నీకు పీకల దాకా కోపంగా ఉంది. ఐ కెన్ అండర్ స్టాండ్. కానీ, అర్చనా! ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయికి నీకున్నంత ధైర్యం, సాహసం ఉంటాయా? ఇంట్లో వాళ్ళందర్నీ కాదని ఏమన్నా చేయగలమా?"
అర్చన మాట్లాడలేదు. నీలిమ చేతుల్లో ఉన్న తన చెయ్యి ఇబ్బందిగా కదిపింది.
"అర్చనా! నీకు నేను సారీ చెప్పాలనుకొడం లేదు. కానీ, నా పరిస్థితి అర్ధం చేసుకోమని మాత్రం కోరుతున్నాను."
"నిన్ను నేనేం అనలేదే!" అర్చన అంది.
"అవునులే! అది సరే నువ్వెక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఆ మధ్య మీ మావగారు, మీ ఆయనా నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చి వెళ్ళారు."
