Previous Page Next Page 
అర్చన పేజి 53

    అప్పుడే తిరుపతినుంచి బయలుదేరిన బస్సు కొండమీదికి చేరింది. భక్తులంతా గోవిందా గోవిందా అంటూ గోవిందనామాలు చదువుతున్నారు. కొండమీదకి రాగానే అందరి మనసుల్లో ఏదో ఉద్వేగం. మరేదో ఆనందం. ప్రతి వ్యక్తికి ఆ కొండమీదికి రాగానే "హమ్మయ్య! నా ఇంటికి నేను వచ్చాను. నా గమ్యం నేను చేరుకున్నాను. ఇదే నా గమ్యం. ఇక్కడే నా జీవితం. ఈ ఏడుకొండలవాడి చరణాలే నా సర్వస్వం" అనే భావన కలిగేలా చేయడమే ఆ తిరుమలలోని ప్రత్యేకత. అక్కడి వాతావరణం, ఆ గాలి, ఆ చెట్లు, పూలు ఎక్కడ చూసినా వినిపించే హరినామ సంకీర్తన, బోడిగుండ్లతో కనిపించే భక్తుల సందడి, టీలు, కాఫీలు పట్టుకుని తిరిగే కుర్రాళ్ళు, రాగి బాయిలర్లలో మరిగే పాలతో ఉండే టీకొట్లు, రకరకాల వస్తువులు అమ్మే అంగళ్ళు, ఎక్కడ పడితే అక్కడ మేనువాల్చి విశ్రాంతి తీసుకునే భక్తులు. వసుదైక కుటుంబం అనే మాటకి అసలైన నిర్వచనంలా ఉండే తిరుమల. అడుగడుగునా కనిపించే ఆద్యాత్మికత.
    అర్చన బ్యాగ్ భుజాన వేసుకుని బస్సు దిగింది.
    ఎంత కాలమైంది ఈ కొండకి వచ్చి. తండ్రీ! నన్నిలా వంటరిగా రప్పించావా? కుటుంబాలతో దిగుతున్న ప్రయాణీకులను చూసి కొంచెం మనసు కలతగా అనిపించింది. ఒక్కసారి పరిసరాలను చూసి, ముందుకు కదిలింది.
    
                                                                              * * * * *

    వేణు అందర్నీ హోటల్ వైపు తీసుకెళ్ళాడు. తండ్రి బైట ఏమీ తినడని తెలిసిన వేణు కృష్ణస్వామిని అడిగాడు "నాన్నా! మీరేం తింటారు?"
    "ఫరవాలేదురా. జీవితంలోనే మార్పులొచ్చాయి. అలవాట్లదేం ఉంది. మీతోటే నేనూ. మీ అమ్మ మారింది కదా! నేనూ మారతాను. పదండి."
    వేణు మనసు కలుక్కుమంది. తనని తాను తమాయించుకుని హోటల్లోకి నడిచాడు.
    అక్కడ బ్రేక్ ఫాస్ట్, కాఫీలు ముగించి అందరూ కలిసి కళ్యాణకట్ట దగ్గరకు బయలుదేరారు.
    అక్కడ కూడా జనం క్యూలో ఉన్నారు.
    "లైన్లో నుంచోవాలమ్మా. నేనూ, చక్రవర్తీ నిలబడతాం. మీరంతా కాటేజీకి వెళ్తారా?" అడిగాడు వేణు తల్లిని. ఆవిడ భర్తవైపు చూసింది.
    "ఎందుకులేరా కాస్సేపు నిలబడితే అయిపోతుంది. వెళ్ళి మాత్రం ఏం చేస్తాం? కానీ, అందరం నిలబడదాం" అన్నాడాయన.
    మగవాళ్ళు క్యూలో నిలబడితే, ఆడవాళ్ళు అక్కడే కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు. క్యూ త్వరగానే అయిపోయి వీళ్ళవంతు వచ్చింది. పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళారు అందరూ. రిత్విక్ కి మొదటి మూడు కత్తెర్లు చక్రవర్తి వేశాడు.
    "వీడికి భలే దొరికాడు మేనమావ" నవ్వుతూ బాబు బుగ్గ సున్నితంగా లాగి వదిలాడు వేణు.
    కౌశిక్ వచ్చీరాని మాటలతో వచ్చి తానూ బాబు జుట్టు కట్ చేస్తానని మారాం చేయసాగాడు. ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో వాడి చెయ్యి పట్టుకుని రెండు కత్తెర్లు వేయించాడు చక్రవర్తి. బాబు అసలు ఏడవకుండా పూర్తిగా గుండు చేయించుకోడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
    "బాబోయ్ వీడెంత గట్టివాడు!" అంది మాధవి.
    "వాడికి తమాషాగా, వింతగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాడు" నవ్వాడు చక్రవర్తి.
    వేణు ఒళ్ళో కూర్చుని బుద్ధిగా జుట్టు కట్ చేయించుకుంటున్న బాబుని చూస్తూ మురిసిపోతున్న వేణుని తాయారమ్మ, కృష్ణస్వామి చిరునవ్వుతో చూస్తుండిపోయారు.
    బోడిగుండుతో, బోసినవ్వుతో చొక్కా నిండా వెంట్రుకలతో వేణు చంకలో ఉన్న బాబుని చూస్తూంటే నీలవేణికి ఎలాగో అనిపించింది. 'అయ్యో! బాబు అందమంతా ఆ జుట్టులోనే ఉండేది. మళ్ళీ ఎప్పటికి అంత జుట్టు వస్తుందో దిగులుగా అనుకుంది.
    చక్రవర్తి కౌశిక్ ని కూడా తీసుకెళ్ళి గుండు చేయించేశాడు.
    అప్పటివరకూ ఒత్తైన జుట్టుతో ముద్దుగా కనిపించిన పిల్లలిద్దరూ గుండ్లతో కనిపించడంతో మాధవిక్కూడా దిగులుగా అనిపించింది. గట్టిగా ఆ మాట అంటే తాయారమ్మ, కృష్ణస్వామి తప్పకుండా కేకలేస్తారు. అందుకే నోరు మూసుకుని ఉండిపోయింది.
    "వీళ్ళిద్దరినీ తీసుకుని మీరిద్దరూ కోనేటిలో స్నానం చేసి రండి" అంది తాయారమ్మ కొడుకునీ, చక్రవర్తినీ ఉద్దేశించి.
    మాధవి కంగారుగా అంది "వద్దొద్దు. చాదస్తం పడకండి. ఈ కోనేట్లో చేయించకూడదు. పసిపిల్లలకి ఏవన్నా ఇన్ ఫెక్షన్ వచ్చేట్టయితే త్వరగా వచ్చేస్తుంది."
    "మరెలా? స్నానాలు చేయాలిగా" అందావిడ.
    "రూములో చేస్తారు లెండి. ఇవాళ మనకి దర్శనం ఎలాగు లేదు."
    "అవునమ్మా! ఇక్కడ వద్దు. రూముకి వెళ్ళి చేయిస్తాలే" అన్నాడు వేణు.
    ఆవిడకి అర్ధమైంది మాధవి ఎందుకు వద్ధంటోందో. అందుకే నెమ్మదిగా అంది "పదండి పిల్లల్ని తీసుకుని కాటేజ్ కి వెళ్ళి స్నానాలు చేయిద్దాం."
    "ఇవాళ్టికి మనం దర్శనానికి వెళ్ళలేం కాబట్టి స్నానాలు, భోజనాలు చేశాక అలా పాపనాశనం, ఆకాశగంగ అవీ చూసొద్దాం" అన్నాడు వేణు.
    అందరూ ఆ ప్రపోజల్ అంగీకరించారు.
    తరువాత అందరూ తిరిగి కాటేజ్ కి బయలుదేరారు.
    
                * * * * *

    అర్చన రూముకొచ్చింది. సింగిల్ కాట్. ఒక టేబుల్, కుర్చీ. నిత్యం వచ్చిపోయే యాత్రికులతో క్రిక్కిరిసి ఉండే పుణ్యస్థలాల్లో ఈమాత్రం బస దొరకడం అదృష్టమే అనిపించింది ఆమెకి. బ్యాగ్ లోంచి బ్రష్, పేస్ట్ తీసుకుని బాత్ రూం లోకి వెళ్ళిపోయింది.
    బ్రషింగ్ అయేటప్పటికి రూమ్ బైట కాఫీ కాఫీ అని అరుపు వినిపించింది. తలుపు తీసి బైటకొచ్చేటప్పటికి ఇద్దరు కుర్రాళ్ళు ఫ్లాస్కులో కాఫీ తీసుకుని రూములన్నీ తిరుగుతూ సప్లై చేస్తున్నారు. కాఫీ కుర్రాడిని పిలిచి రెండు ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ తీసుకుని అతనికి డబ్బులిచ్చి పంపించేసింది. కిటికీలోంచి బైటకి చూస్తూ కాఫీ తాగసాగింది.
    దేవుడి దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా దర్శనం అయిపోతే బాగుండు. రేపు ఉదయం కిందికెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రేపు రాత్రి బస్సుకి వెళ్ళిపోవచ్చు. లేదంటే రెండు రాత్రులు ఉండిపోవాల్సి వస్తుంది. తను కంకణం కూడా వేయించుకోలేదు. ఏదన్నా దర్శనానికి టికెట్టు తీసుకుంటే ఏం దర్శనాలుంటాయో కూడా తెలియదు. ఎప్పుడో వచ్చింది తిరుమలకి. అందరూ పెళ్ళి అవగానే స్వామి దీవెనల కోసం తిరుమల రావడం సంప్రదాయం. తన పెళ్ళికి ఓ సంప్రదాయం కూడానా? నిట్టూర్చింది అర్చన. కాఫీ తాగడం పూర్తిచేసి స్నానానికి వెళ్ళిపోయింది.

                                                                       * * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS