"నీ తలకాయ ఏం మాటలురా? విడిగా ఉండడం ఏంటి? ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొగుడూ, పెళ్ళాలు ఒకళ్ళు అమెరికాలో, ఒకళ్ళు ఇండియాలో ఉంటున్నారట కదా! ఇంకా నయం కాదూ పాస్ పోర్టులు, వీసాలు, తెల్లవాడి అనుమతులు అక్కర్లేకుండానే మీ అమ్మ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు రాగలుగుతాను అందుకు సంతోషించు."
వేణు నవ్వలేదు. "ఈ వయసులో మిమ్మల్నిద్దరినీ ఇలా ఉంచడం ధర్మం కాదు నాన్నా! త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తాను. అమ్మని నీ దగ్గరికి పంపించేస్తాను."
కృష్ణస్వామి కొంచెం కలవరపడ్డాడు. వేణు అసలే సెన్సిటివ్. వాడిలా ఆలోచిస్తే ఏం నిర్ణయం తీసుకుంటాడో అనిపించిందాయనకి. వేణు మనసులో ఏ భావమైతే రాకూడదని ఇంతకాలం ప్రయత్నించాడో ఆ భావన రానే వచ్చింది.
కొంచెం కలవరంగా అన్నాడాయన. "నేను కూడా ఇక్కడికే వచ్చేస్తానురా. మా తాతను వదిలి ఇంక ఉండలేను. గుడి బాద్యతలు రామస్వామికి అప్పగిస్తున్నాను."
రామస్వామి కృష్ణస్వామికి దూరపు బంధువు. చిన్నప్పుడే అతనికి పోలియో వలన కాళ్ళు చచ్చుబడ్డాయి. కర్రలతో నడుస్తాడు. తండ్రి చిన్నప్పుడే పోవడంతో తల్లే నాలుగిళ్ళల్లో వంటలు చేస్తూ రామస్వామిని పెంచి పెద్దచేసి, సంస్కృతం వేదాలు నేర్పించింది. అతను బ్రహ్మచారి. తల్లి పోయాక్ తనే చేతనైనట్టు వండుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. అతని శితికి జాలిపడి కృష్ణస్వామి ఎక్కువగా గుడిలో వచ్చే ప్రసాదాలు ఇస్తూ వంట చేసుకునే అవసరం చాలావరకు తగిస్తుండేవాడు. ఆయన ఎప్పుడైతే తాను వేణు దగ్గరకు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడో మనసులో గుడి బాధ్యత రామస్వామికి అప్పగించాలన్న ఆలోచన అంకురించింది. అందుకుగాను రామస్వామికి గుడి నియమాలు, పద్ధతులు నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన్నే గుడిలో నిత్యపూజకు నియమించి వచ్చాడాయన.
సంభాషణ మారుస్తూ అన్నాడాయన వేణుతో "ఇంతకీ మనమిలా హఠాత్తుగా బయల్దేరుతున్నాం. దర్శనం అవుతుందా? అందుకోసం ఏదన్నా ఏర్పాటు చేశావా?"
వేణు కొంచెం భారంగా నిట్టూర్చాడు. అదే స్వరంతో అన్నాడు. "చేశాను నాన్నా! నా స్నేహితుడు ఎండోమెంట్స్ లో చేస్తున్నాడు. వాడి సాయంతో మనకి స్పెషల్ దర్శనం టిక్కెట్లు కూడా బుక్ చేశాను. అర్ధరాత్రి రెండింటికి మనం స్నానాలు చేసి వెళ్ళిపోతే సుప్రభాత సేవ చూడొచ్చు."
"మంచిపని చేశావు" అభినందించాడు కృష్ణస్వామి.
"వేణూ! టైం అవుతోంది. క్యాబ్ బుక్ చేశావా?" అడిగాడు చక్రవర్తి.
"ఆ... చేసేశాను. వచ్చేస్తాడు. నాలుగైందా? టైమెంత?" అడిగాడు.
"ఇంకా పదిహేను నిమిషాలుంది నాలుగు అవడానికి."
"అలాగా! నాలుగింటికి రమ్మన్నాలే. వచ్చేస్తాడు. ఇప్పుడే వస్తానం"టూ లోపలికి వెళ్ళాడు.
ఆ కబురూ, ఈ కబురూ చెప్పుకుంటూ, పనులు చేసుకుంటూ హడావిడిగా గడిపేటప్పటికి క్యాబ్ రానే వచ్చింది. వేణూ, చక్రవర్తి సామాను క్యాబ్ లోకి ఎక్కించారు. బాబునెత్తుకుని కృష్ణస్వామి, ఆయన వెనక తాయారమ్మ, మాధవి, నీలవేణి వచ్చి కారులో కూర్చున్నారు. వేణు తలుపులు తాళాలేసి చక్రవర్తితో వచ్చి వెనక సీటులోకి వెళ్ళిపోయారు. కారు కదిలింది.
కొందమీదికి వెళ్ళేసరికి పధైంది. అప్పటికే బుక్ చేసిన కాటేజ్ కి తీసుకెళ్ళాడు వేణు అందరినీ. రెండు బెడ్ రూమ్స్ ఉన్న స్పెషల్ కాటేజీ. ఒక రూములో ఆడవాళ్ళు, ఒక రూములో మగవాళ్ళు చకచకా తెమిలి రెడీ అయిపోయి రూముల్లోంచి బైటికి వచ్చేశారు.
కాఫీలు తాగుదాం అంది తాయారమ్మ. ఆవిడకి తెల్లవారుఝామునే కాఫీ తాగటం అలవాటు. ఐదింటికే లేచి మొహం కడుక్కుని చిక్కటి పాలతో స్ట్రాంగ్ డికాషన్ తో కాఫీ కలుపుకుని భర్తకిచ్చి, తానూ తాగాక కానీ, స్నానానికి వెళ్ళదావిడ. ఆ అలవాటు పట్నం వచ్చినా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఆవిడ ప్రాణం కాఫీ కాఫీ అని కొట్టుకుంటోంది.
"పది దాటింది కదమ్మా బ్రేక్ ఫాస్ట్ చేసి ఒకేసారి కాఫీ తాగేద్దాం" అన్నాడు వేణు.
"కాఫీ తాగితే కానీ నేనేం తినలేదురా" అందావిడ.
"సరే రండి" అంటూ కొంచెం దూరంలో ఉన్న కాఫీ కొట్టు దగ్గరకి నడిచాడు. అందరూ వేణుని అనుసరించారు.
బాయిలర్ లో మరుగుతున్న డికాషన్, మరుగుతున్న పాలు, చక్కగా కడిగి ముగ్గేసిన పరిసరాలు, వెంకటేశ్వరస్వామి పటం ముందు వెలుగుతున్న అగరు బత్తీలు చక్కటి పరిమళాలు వెదజల్లుతుంటే ఆ వాతావరణం ఎంతో పవిత్రంగా, మరెంతో ఆహ్లాదంగా అనిపించి వివశురాలై చూసింది నీలవేణి. ఎన్నడూ కలలో కూడా ఊహించనిది జరిగింది. ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోబోతొంది అతిత్వరలో. అదంతా బాబు వల్లనే, వాడి పట్ల మమతతో నిండిపోయిందామె మనసు.
'ఎక్కడనుంచి ఎక్కడికి పడేశావు తండ్రీ నన్ను. ఆ అమ్మానాన్నలను దూరం చేసి, ఈ అమ్మానాన్నలను ఇచ్చావు. ఏమిటో నీ లీల! పెళ్ళికాని తల్లిగా బతకమని ఈ బాబునిచ్చావు. ఏ తల్లి కని నాకు వరంగా ఇచ్చిందో ఆ తల్లికి నేను బతుకంతా కృతజ్ఞురాల్ని నాయనా! నన్నిలాగే ఈ వృద్ధదంపతుల చల్లని నీడలో, ఈ బాబు సేవలు చేసుకుంటూ బతకనీ. నాకింకేం వద్దు. వేణుబాబుగారు వేరే పెళ్ళి చేసుకుంటే కూడా నేనీ బాబునివ్వను. నేనే పెంచుకుంటాను' అనుకుంటూ చేతుల్లో ఉన్న బాబుని గుండెలకి హత్తుకుంది నీలవేణి.
"కాఫీ తాగు నీలవేణి..." వేడి వేడి కాఫీ గాజుగ్లాసు అందించింది మాధవి. బాబుని ఎడం చేత్తో గట్టిగా పొడుపుకుని కుడిచేత్తో గ్లాసు అందుకుంది.
"వాడినిలా ఇవ్వు. నేను తాగేశాను. నేనెత్తుకుంటాలే" మాధవి నీలవేణి చేతుల్లోంచి బాబుని అందుకుంది.
మాధవి వాదినేత్తుకుని అక్కడే ఉన్న రావిచెట్టు గట్టు మీద కూర్చుంది. చెట్టు మీద వాలిన పిట్టల్ని చూపిస్తూ "అదిగో చూశావా బర్డ్. అరరే ఎగిరిపోతోంది నాన్నా! పిలువు హాయ్ బర్డ్. అయామ్ రిత్విక్ చెప్పు. నేను జేజిని చూడ్డానికి వచ్చాను. నా హెయిర్ జేజికిచ్చి వెళ్తాను తెలుసా! చెప్పు నాన్నా!" అంటూ కబుర్లు చెపుతోన్న మాధవి దగ్గరికి "ఏంటి తెగ కబుర్లు చెప్పేస్తున్నావు వాడికి?" అంటూ వచ్చాడు చక్రవర్తి.
మాధవి నవ్వుతూ "కౌశిక్ ఏడీ?" అడిగింది.
"అడుగో! నానమ్మ పాలు తాగిస్తోంది" తాయారమ్మ చేత్తో బుద్ధిగా పాలు తాగుతున్న కౌశిక్ ని చూపించాడు.
"బాగుంది. ఆవిడకి అనుకోకుండా ఇద్దరు మనవళ్ళు దొరికారు. చెప్పలేనంత ఆనందంగా ఉన్నారావిడ" అంది మాధవి. చక్రవర్తి అవునన్నట్టుగా తలూపాడు.
