Previous Page Next Page 
అర్చన పేజి 51

    "ఓ గుడ్! కంగ్రాచ్యులేషన్స్" అప్పటిదాకా ఉన్న తిరస్కారభావం మంత్రం వేసినట్టు మాయమైంది. హమ్మయ్య! ఈమె జీవితం ఒడ్డున పడింది అనుకుంది. అదే భావనతో, అదే నిజాయితీతో అంది "మొత్తానికి నీ కల నెరవేరింది. హార్ట్ లీ కంగ్రాచ్యులేషన్స్" మనస్ఫూర్తిగా అభినందించింది నళిని.
    "థాంక్యూ..... థాంక్యూ వేరేమచ్" కళ్ళల్లో ఆనందభాష్పాలతో చెప్పింది అర్చన.
    "అయితే నువ్వు విజయవాడ వెళ్ళిపోతావా?"
    "తప్పదుగా నళినీ! ఇంక నుంచీ నేనెక్కడ ఉంటానొ నాకే తెలియదేమో! ఎన్ని ఊళ్ళు తిప్పుతారో, ఏ ఏ పోస్టింగ్ లు ఉంటాయో? నాది చాలెంజింగ్ జాబ్. నేనికనుంచీ మానసికంగా అన్ని రకాల సమస్యలకు సిద్దపడాలి. సమస్యలే ఉంటాయొ, సహకారమే ఉంటుందో తెలియదు కదా! ఏదెలా ఉన్నా నేను త్వరలో కలెక్టర్ ని కావాలి. అవుతాను."
    "యస్. అవుతావు. బెస్టాఫ్ లక్."
    "ఎందుకోయ్? ఏంటి సంగతి? ఎవరికి బెస్ట్ ఆఫ్ లక్?" క్లాస్ అయిపోడంతో స్టాఫ్ రూముకి వచ్చిన మరో ఇద్దరు టీచర్లు అడిగారు. "మన అర్చనకి ఆర్.డి.ఓ.గా పోస్టింగ్ వచ్చింది."
    "ఓ.... కంగ్రాట్స్.... అయితే ఇవాళ మనందరికీ అర్చన లంచ్ ఇప్పిస్తుంధన్నమాట!" సరదాగా అందొక టీచర్.
    "ష్యూర్. ఎందుకిప్పించను? లంచ్ టైంలో బైటకి వెళదాం" అంది అర్చన.
    అందరూ అభినందనలతో ముంచెత్తారు. వాళ్ళతో కలిసి మంచి హోటల్లో భోంచేసి తన ఆనందాన్ని పంచుకుంది అర్చన. సాయంత్రం నళిని, అర్చనా కలిసి షాపింగ్ వెళ్ళారు. పూర్ణమ్మగారికి, నళినికి మంచి చీరలు చెరొకటీ కొంది అర్చన.
    "నేను తిరుపతి వెళ్ళాలి నళినీ! జాయినయే ముందు తిరుపతి వెళ్ళిరావాలి" చెప్పింది అర్చన.
    "అలాగే వెళ్ళు అర్చనా! దానికేంటి?"
    "నాతో తోడు వస్తావా?"
    "ఎలా అర్చనా? పిల్లల ఎగ్జామ్స్ టైం కదా!"
    "ఓ కరెక్ట్" అర్చనకి గుర్తొచ్చింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు మొదలు. చాలా బిజీగా ఉండే పరిస్థితి.
    "నేను రేపు రిజిగ్నేషన్ ఇచ్చేస్తాను నళినీ!"
    "ఇచ్చెయ్. ఇంకెందుకీ పిచ్చి ఉద్యోగం?"
    "అలా అనకు. ఇంతకాలం నాకు అన్నం పెట్టిన ఉద్యోగం. నాకు మనశ్శాంతినీ, ఆనందాన్నీ ఇచ్చిన ఉద్యోగం."
    "ఓకే...ఓకే.... ఎమోషనల్ అవకు."
    "సరే! ఇంకా రిజర్వేషన్ కి టైం ఉంది. స్టేషన్ కి వెడదామా?" అడిగింది అర్చన.
    "వెడదాం పద" ఇద్దరూ ఆటో చేసుకుని స్టేషన్ కి వెళ్ళి తిరుపతికి టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు.
    ఆ రాత్రి నళినిని వదల్లేదు అర్చన.
    ఇద్దరూ గుండె తలుపులు తెరిచి కష్టసుఖాలు, అభిరుచులు, అలవాట్లు కలబోసుకున్నారు. ఆ మాటల్లో తన కలల రాజకుమారుడి ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడింది అర్చన. రాత్రి బాగా పొద్దుపోయాక తేలికపడింది మనసుతో ఇద్దరూ హాయిగా నిద్రపోయారు.

                                                                      * * * * *

    పదో తారీఖు శుక్రవారం తిరుపతి వెళ్ళడానికి నారాయణాద్రిలో టికెట్లు బుక్ చేశాడు వేణు. ముందురోజే కృష్ణస్వామి హైదారాబాద్ వచ్చేశాడు. ముఫ్ఫై ఏళ్ల వాళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారిగా భర్తకి దూరంగా ఉంటున్న తాయారమ్మకి ఆయన్ని చూడగానే దుఃఖం వచ్చేసింది. మనిషి కొంచెం చిక్కాడు. మునపటంత ఆరోగ్యం కనిపించలేదు. ఆ మాట ఆయనతో అనడానికి కొడుకు ముందు ఆవిడ జంకింది. కాకపోతే కొంచెం జాలి ధ్వనించే స్వరంతో అడిగింది "ఆరోగ్యం బాగుందాండీ?"
    ఆయన నవ్వి "నా ఆరోగ్యానికేం భేషుగ్గా ఉంది. నా బంగారు సంగతేంటి?" అంటూ మనవడిని ఎత్తుకున్నాడు.
    "నిన్నే కలవరిస్తున్నాడు నాన్నా!" అన్నాడు వేణు నవ్వుతూ.
    "ఏరా తాతా! నిజమేనా నన్ను కలవరిస్తున్నావా?" అంటూ వాడిని ముద్దుపెట్టుకుని భార్య చేతికిస్తూ "నేను స్నానం చేసి వస్తాను" అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు.
    స్నానం చేసి వచ్చాక వదలకుండా మనవడితో ఆడుకుంటూ కాలం మర్చిపోయాడు ఆయన.
    నీలవేణి, తాయారమ్మ ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోయారు. జంతికలు, లడ్లు చేశారిద్దరూ కలిసి.
    మర్నాడు మధ్యాహ్నానికి మాధవి పులిహోరా, పూరీ కూరా చేసుకుని తీసుకొచ్చింది. కృష్ణస్వామిని చూడగానే మాధవికి ఫ్యాన్సీ వేషంలో ఉన్న పరమేశ్వరుడిలా అనిపించాడాయన. అసంకల్పితంగానే ఆయన పాదాలకు నమస్కరించింది.
    "దీర్ఘసుమంగళీభవ" అని దీవిస్తూ "ఈ అమ్మాయేనా మాధవి?" అనడిగాడు భార్యవైపు చూస్తూ.
    అవును అన్నట్టు తలూపి మాధవిని దగ్గరగా తీసుకుని అంది ఆవిడ. "లక్ష్మీదేవిలాంటి పిల్ల. చక్రవర్తి అదృష్టవంతుడు" మనస్ఫూర్తిగా అనుకుంటూ అర్చనని తల్చుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. ఇలాంటి ఆడపిల్లతో స్నేహం చేసి అలా ఎందుకైందో అనుకుంది ఆవిడ.
    "ఏం బాబూ కులాసానా? చాలాకాలమైంది నిన్ను చూసి" అంటూ చక్రవర్తిని పలకరించాడు కృష్ణస్వామి.
    "మీరెలా ఉన్నారు? జీవితంలో ఇన్నేళ్ళకి ఇప్పుడు స్వయంపాకం మీకు తప్పలేదా?" అన్నాడు చక్రవర్తి.
    "స్వయంపాకం కాబట్టే కడుపు నిండా తింటూ ఒళ్ళు చేశాను చూశావా?" అన్నాడాయన హాస్యంగా.
    "అన్యాయం బాబాయ్ గారూ! పాపం పిన్నిగారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఇంతకాలం. అది మర్చిపోతే ఎలా?" అంది మాధవి.
    "దానిదేం ఉంది తల్లీ! ఏరు దాటాక తెప్ప తగలేయడం ఈ మగవాళ్ళకి అలవాటేగా" అంది కినుకగా తాయారమ్మ.
    చక్రవర్తి నవ్వుతూ "ఆయన సరదాగా అన్నారులెండి" అన్నాడు.
    వేణు కొంచెం బాధగా "నా వలన మా అమ్మా, నాన్న జీవితంలో మొదటిసారి విడిగా ఉండాల్సి వచ్చింది" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS