Previous Page Next Page 
అర్చన పేజి 50

    "ఓకే..." చేతుల్లో ఉన్న రిత్విక్ ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ, ముందుకు వంగి వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు. "తిరుపతి వెడదామా? జేజిని చూస్తావా? నా బంగారుకొండా.... తాతనడిగి టికెట్లు కొనుక్కుందాం. ఓకే?"
    కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ.
    "మాధవినీ, చక్రవర్తినీ, కౌశిక్ నీ కూడా తీసుకెడదాం. వాళ్ళకి కూడా టికెట్లు తీసుకో నాన్నా!" అంది తాయారమ్మ.
    "అలాగేనమ్మా దానికేం మొత్తం ఐదు టికెట్లు అంతేగా?"
    "ఐదేంటిరా? ఆరు. నీలవేణిని మర్చిపోయావా?"
    "నీలవేణా?" అదోరకంగా అడిగాడు. ఆమె అవసరమా అన్నట్టు.
    "అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్నా? పైగా పాపం అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా!"
    "అలాగేలేమ్మా చేయిస్తాను" అన్నాడు.
    నీలవేణి ఇంట్లో కుటుంబసభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెతుకోవాలి కాబోలు అనుకున్నాడు.
    ఆ రాత్రి కృష్ణస్వామికి ఫో చేసి మరో పదిరోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ముహూర్తం తెలుసుకున్నాడు.

                                                    * * * * *

    అర్చనకీ, నళినికీ దురదృష్టవశాత్తూ ఏర్పడిన అభిప్రాయభేదాలు చాలా తీవ్రరూపం దాల్చాయి. స్కూల్లో కూడా నళిని అర్చనని చూడగానే మొహం చిట్లించడం, మాట్లాడకుండా వెళ్ళిపోదాం అర్చన మనసుని గాయం చేసింది. తను ఆవేశపడి తనని అనకూడని మాట అంది, అది నళిని మనసుకి గాయం చేసింది. ఉన్న ఒకే ఒక్క స్నేహితురాలిని దూరం చేసుకుంది. ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పిన కాలు జారితే వెనక్కితీసుకోగలం. నోరు జారకూడదన్న అమృతవాక్కులు గుర్తొస్తూ అర్చనకి శాంతి లేకుండా అయిపోయింది.
    స్కూల్లో ఒకటీ, రెండుసార్లు నళినిని కలిసి సారీ చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. నళిని అర్చనని చూడగానే ఆమెకి దూరంగా వెళ్ళిపోవడం, ఆమె వెనక వెళ్ళబోయి తోటివాళ్ళు గమనిస్తున్నారన్న అవమానంతో వెనక్కి వెళ్ళిపోడం జరిగింది. మాట జారింది. అది వెనక్కి తీసుకునే విషయం కాదు. ఏం చేయాలి? మళ్ళీ నళిని స్నేహం లభిస్తుందా? అర్చన మనసంతా గందరగోళంగా అయిపోయింది. ఈ మధ్యలో పూర్ణమ్మ కోడలు ఒకటీ రెండుసార్లు అర్చన అభిప్రాయం కోసం కబురు చేసి, ఆమెనుంచి జవాబు రాకపోవడంతో కొంచెం కోపం తెచ్చుకుంది. ఆ విషయం పూర్ణమ్మగారి మాటల ద్వారా అర్ధమై భయపడింది. ఇల్లు ఖాళీ చేయమంటారేమో? ఎక్కడికి పోవాలో దేవుడా అనుకుంది. తను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేస్తే తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర పోస్టింగ్ వస్తుంది. ఆ తఃరువాత తను ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అందాకా ఈ గండం గడిచిపోతే ఎంత బాగుండు అనుకుంది.
    ఆమె మొర వృధా పోలేదు. అర్చన కల నెరవేరింది. ఆమెకి విజయవాడలో ఆర్.డి.ఓగా పోస్టింగ్ వచ్చింది. ఆమె ఆనందానికి హద్దుల్లేవు. తన ఆనందం పంచుకోడానికి ఒకే ఒక్కరున్నారు. అది నళిని. ఆమె తప్ప ప్రస్తుతం తనకంటూ ఎవరూ లేరు. తొందరపడి ఆమె మనసు గాయం చేసిన తను క్షమార్హురాలు కాదు. అడగాలి నళినిని క్షమార్పణ అడగాలి.
    ఆ రోజు ముందు ఇంటిదగ్గరలో ఉన గుడికి వెళ్ళి అక్కడినుంచి స్కూలుకి వెళ్ళింది. అప్పటికే ప్రేయర్ అయిపోయింది. పిల్లలంతా ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటి పీరియడ్ ఎలాగూ నళిని ఫ్రీ. అందుకే ఆమెని వెతుక్కుంటూ స్టాఫ్ రూమ్ కి వెళ్ళింది. నళిని ఒక్కతే కూర్చుని ఏదో రాసుకుంటోంది. వెనక నుంచి దగ్గరగా వెళ్ళి "నళినీ..." అని పిలిచింది అర్చన.
    నళిని వెనక్కి తిరిగి అర్చనని చూసి మొహం తిప్పుకుంది.
    అర్చనకి దుఃఖం వచ్చేసింది.
    కోపం, అభిమానం, సిగ్గు, మొహమాటం అన్నీ పక్కన పడేసి ఆమె ముందుకు వెళ్ళి చేయి పట్టుకుని బలవంతంగా కుర్చీలోంచి లేపి గట్టిగా కౌగలించుకుంది.
    నళిని కొంచెం ఇబ్బందిగా ఆమె నుంచి విడిపించుకుని ముభావంగా అడిగింది "ఏమైంది?"
    అర్చన మాట్లాడలేదు, కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళు చెంపలమీదికి జారాయి. రుద్ధమైన స్వరంతో అంది "అ.... అయామ్ సారీ..."  
    నళిని మట్లాడలేదు.
    "నళిని... ప్లీజ్ నన్ను క్షమించు" ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంది అర్చన.
    "వదులు. ఇప్పుడేమైంది? అందరూ చూస్తారు."
    "ఇక్కడెవరున్నారు? ఎవరూ లేరుగా? నళినీ! నేను ఫూల్ ని నన్ను క్షమించు. నాకెంతో సాయం చేసి నా జీవితం నిలబెట్టిన నిన్ను అనకూడని మాటన్నాను."
    "ఇట్స్ ఓకే. ఫర్వాలేదు. అయినా నేనేం చేశాను నీకు?"
    "అంతమాటనకు ప్లీజ్. నళినీ! నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు తప్ప ఎవరికీ షేర్ చేయగలను? నాకెవరున్నారు?"
    ఓహో అందుకా ఇప్పుడు ఈవిడకి తన అవసరం వచ్చింది. అవును ఎవరున్నారు? మరి ఎందుకు అంత అహంకారం? ఏ మాట పడితే ఆ మాట అనేముందు తనకెవరూ లేరని, చేతులారా అందర్నీ దూరం చేసుకుందన్న జ్ఞానం లేదా ఈమెకి నిరసనగా అనుకుంది నళిని.
    ఆమె హావభావాలు గమనించినదానిలా అంది అర్చన.
    "నాకు తెలుసు నళినీ! అవేముందు గుర్తురాలేదా ఈవిడకి అనుకుంటున్నావు కదూ! నళినీ! నేను చాలా సామన్యురాలీని, ఆవేశం అదుపులో పెట్టుకోడం చేతకానిదాన్ని. నాకెందుకో నువ్వలా నా భావాల్ని చులకన చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నిన్ను బాధపెట్టాను. తప్పు చేశాను. కానీ, చిన్న తప్పే కదా! క్షమించలేవా?" జాలిగా అడిగింది అర్చన.
    నళిని కళ్ళల్లో కొంచెం సానుభూతి కదిలింది. "నేనెవరినిలే క్షమించడానికి. అయినా నీకూ, నాకూ ఏం సంబంధం? ఉన్న నలుగు రోజులూ కలిసి ఉంటాం. ఎవరి జీవితాలు ఎలా సెటిల్ అవుతాయో ఎవరి గమ్యం ఏంటో ఎవరికి తెలుసు? రేపు నీకేదన్నా మంచి జాబ్ వస్తే నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు."
    "అవును. ఆ సమయం వచ్చింది. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా సంతోషం నీకు పంచాలని వచ్చాను."
    "ఏం? ఎందుకు అంత సంతోషం?" అడిగింది.
    "నేను.... నేను..... నాకు ఆర్.డి.ఓగా విజయవాడలో పోస్టింగ్ వచ్చింది. రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS