ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది.
"చూడు నాయనా! ఏనాటి ఋణానుబంధమో వరదల్లో కొట్టుకొచ్చి మన పంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మనింట్లో పనిమనిషిగా ఉంచేసుకోవడం భావ్యం కాదు కూడా. పెళ్ళి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది" అంది.
వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు.
"ఎలాంటి అబ్బయి కావాలో మనకేం తెలుసు?" అన్నాడు.
"దానికి మాత్రం ఏం తెలుసు? మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ళ కులంలో వాళ్ళు మీ ఆఫీసులో ఉండే ఉంటారు కదా!" అందావిడ.
"ఆవిడ కులం ఏంటో మనకేం తెలుసమ్మా. ఆ సంగతి తరవాత చూద్దాం. అందాకా అమ్మాయి పేరు మీద నేను ఒక లక్ష రూపాయలు ఫిక్స్ చేయాలనుకుంటున్నానమ్మా. సడెన్ గా పెళ్ళి కుదిరితే ఆ డబ్బు ఉపయోగ పడుతుంది" అన్నాడు.
ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదారహృదయం పట్ల హర్షం కనిపించింది.
"మంచిపని నాయన! ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్ళికాదు కూడా" అంది.
మరునాడే వేణు తన సేవింగ్స్ లోంచి లక్ష తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకు వెళ్ళి వేలిముద్రలేసిన నీలవేణి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రీ! వీళ్ళ మనసులు వెన్నముద్దలు" అనుకుంది.
అయితే వాళ్ళు తనకి పెళ్ళి చేయాలనుకుంటున్నారని.....వేణు సంబంధాలు వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇంక తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్ళి గురించిన ఆలోచనకే తావివ్వలేదు. బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది.
అన్నప్రాసన తరవాత నీలవేణి బాబుని ఎత్తుకుని పెరట్లో పిచ్చుకల్ని చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం వాడికి నీళ్ళు పోయడం, ప్రతి గంటకీ వాడి బట్టలు మార్చి నీటుగా ఉంచడం ఎంతో శ్రద్దగా సొంత కొడుక్కి చేస్తున్నట్టు సేవలు చేస్తోంటే తెలియనివాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకే అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవికి. ఈ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే ఎంత బాగుండేది అనుకునేది కూడా. మళ్ళీ తనలో తానే ఉలిక్కిపడి ఆ ఆలోచనలనుంచి బైటపడుతుండేది.
బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకుని, మంచం కోడు పట్టుకుని లేచి నిలబడడానికి ప్రయత్నించడం వెంటనే పడిపోయి ఏడుపు లంకించుకోడం, కాస్సేపు నీలవేణి భుజమ్మీద వేసుకుని అలా తిప్పి వచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం అలాగే పడిపోడం వేణుకి చూస్తున్నకొద్దీ ముచ్చటగా, మురిపెంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు.
నేరుగా ఆఫీసునుంచి ఇంటికి వచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టూ అయిపోయింది. తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించినా అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరానిదిగా ఉందావిడకి. మాధవితో చూఛాయగా రెండు మూడుసార్లు అంది కూడా. కాస్త చదువుకుని, సంసారపక్షంగా ఉండే అమ్మాయి ఉంటే చూడమని, వేణుకి మళ్ళీ పెళ్ళి చేయాలనుకుంటున్నానని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్దంగా ఉంది.
అర్చన చేసిన పనిని మాధవి ఎంత మాత్రం సమర్ధించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో? ఇంత బంగారంలాంటి బాబుని వదిలి వెళ్ళడానికి మనిషో, రాక్షసో అనుకునేది. అర్చన మీద పిచ్చికోపం, వేణుమీద, అతని కుటుంబసబ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబుని చూస్తుంటే అవ్యాజమైన మమతానురాగాలు ఆమెలో పెల్లుబుకుతున్నాయి. వాడు బాగా అలవాటైపోతున్నాడు. కానీ, అంత బంధం పెంచుకొడం ఇష్టం లేని మాధవి క్రమంగా అ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది.
బాబుని తీసుకుని తాయారమ్మ, నీలవేణి వచ్చిన దగ్గర్నించీ మాధవి రోజూ వస్తూ వాళ్ళకి తెలియని విషయాలు చెపుతూ, మెల్లిగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు, అలవాటయాక రోజు విడిచి రోజు, రెండు రోజులకొకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించడం ప్రారంభించింది.
నీలవేణికి మెల్లిగా చుట్టుపక్కల కిరాణాకొట్టూ, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోట్లు అన్నీ తెలిసిపోయాయి. ఏదన్నా కావాలంటే నీలవేణి ఉన్నపళంగా వెళ్ళి కొట్టునుంచి కొనుక్కురాగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికోసారి మారాయి.
కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద మాత్రం చక్రవర్తితో కలిసి రావడం తప్పడం లేదు. శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటిదగ్గరే ఏదో ఒకటి స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది. మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి తృప్తి ఉండదు. ఇంటికి వెళ్ళేటప్పుడు పేచీ పెడుతుంటాడు. అలాంటప్పుడు వచ్చినపుడు రాత్రి పొద్దుపోయిందాకా ఆ కుటుంబంతో గడిపి వెళ్తుంటారు ఆ దంపతులు.
మాధవి అంటే తాయారమ్మకి వెర్రి అభిమానం. ఇలాంటి అమ్మాయి వీడికెందుకు దొరకలేదో అనుకుంటుంటుంది అప్పుడప్పుడు కొడుకుని ఉద్దేశించి. ప్రతిరోజూ కృష్ణస్వామికి ఫోన్ లో బాబుకి సంబంధించిన కబుర్లు చెపుతూంటే ఆయనకి కూడా బాబుని చూడాలనిపిస్తుండేది. నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు.
ఒత్తుగా ఉన్నవాడి జుట్టు చూస్తూ "వేదికీ జుట్టెక్కువమ్మా చిరాగ్గా ఉందేమో క్రాఫ్ చేయించనా?" అనడిగాడు తల్లిని.
"బాబుకి ఏడాది లోపుగా పుట్టెంట్రుకలు తీయించాలి నాన్నా" చెప్పింది తాయారమ్మ.
"అలాగే తీయిద్దామమ్మా. సెలూన్ కి తీసుకెళతాలే" అన్నాడు వేణు.
"ఇంకా నయం..." మందలింపుగా అంది ఆవిడ. "మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్రకార్యం. తిరుపతికి తీసుకెళ్ళి తీయించడం మన ఆచారం."
"అయ్యో సారీ అమ్మా! నాకు తెలియదు కదా అలా అని. దానికేం ఎప్పుడు వెడదాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయించేస్తా" అన్నాడు.
"అలాగే. ఆయన ఇంకా గుడికి వెళ్ళి ఉండరు. రాత్రికి మాట్లాడి ఆయన్నే ముహూర్తం పెట్టమందాం."
