"నీకు తెలియదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరంధామయ్యలు."
"అబ్బా! నళిని ప్లీజ్! పజిల్స్ విప్పే శక్తి లేదు కానీ, సరిగా చెబుదూ."
నళిని పకపకా నవ్వుతూ అంది. "నువ్వు ఇదివరకటి రచయిత్రుల కథలు చదవలేదేమో! అందుకే నీకుతెలియదు. కానీ పార్వతమ్మలు, పరంధామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా..."
"ఓ మైగాడ్! అదా చంపేశావు" తనూ గట్టిగా నవ్వుతూ అంది అర్చన.
నళిని నవ్వాపి "అందుకే రెండో పెళ్ళి అమ్మాయైనా ఫరవాలేదు. పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఆ పరంపరలో వచ్చిందే ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు?"
"ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్ళే ప్రశ్నలు, వాళ్ళే జవాబులు అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పు అంటూ వెళ్ళిపోయారు."
"పోనీలే ఆలోచించి చెప్పమన్నారు కదా! ఆలోచిద్దాం!"
"ఏంటి నళినీ ఆలోచించేది. నేనసలే టెన్షన్ తో ఉంటే మధ్యలో వీళ్ళ గోలేంటి?" విసుగ్గా అంది అర్చన.
నళిని నవ్వాపి కొంచెం సీరియస్ గా అంది "అర్చనా! ఇది నీకు మొదటి పరీక్ష. అందుకే చెపుతున్నాను. నా మాట విని వేణు దగ్గరకు వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతోకాలం తప్పించుకుని బతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరకు వెళ్ళిపో."
"నళినీ ప్లీజ్! ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు."
"ఏం ఎందుకు? అర్చనా! నీకసలు ఏం కావాలి?" ఖచ్చితంగా అంది నళిని.
అర్చన మాట్లాడలేదు. ఆమెకేమీ అర్హం కాలేదు. అవును నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తన్ని తాను ప్రశ్నించుకుంది.
నళిని మళ్ళీ అంది. "అర్చనా! జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పులేదు. కానీ, ఆ లక్ష్యం, ఆదర్శంలో మిగతా విషయాలు ఏవీ కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అది ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవల్ల్లు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికీ నువ్వు దూరం అయావు. అంతేకాక, నీకు తెలుసా? ఎవరో చాలామంది కనిపిస్తుంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఒకటికి పదిసార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వంటే ఇష్టం ఉండచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులోంచి ఆ భావన తుడిచెయ్. నా మాట విని...."
నళిని పూర్తికాకుండానే అర్చన గట్టిగా అరిచింది. "స్టాపిట్ నళినీ! స్టాపిట్....థాంక్స్. ఏదో స్నేహితురాలివని నా కష్టం, సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్ధమైంది. థాంక్స్ నళినీ.... థాంక్స్ ఎ లాట్. నిన్ను భోజనానికి పిలిచాను. అందుకే ఏమీ అనడం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిన నిన్ను ఈ పాటికి గెట్ అవుట్ అని ఉండేదాన్ని..."
అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కైంది.
* * * * *
బాబు బోర్లాపడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మార్మోగుతోంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకుని మింగేయకుండా చూడాల్సి వస్తోంది.
ఏడో నెల్లో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీసులో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చనా, వేణుల గురించి, వాళ్ళ సంసారం గురించి చూచాయగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు.
అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకి మెడలో బంగారు గొలుసు, వేళ్ళకి ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రేస్ లెట్ కొన్నాడు.
మాధవి బౌన్సర్ కొనుక్కొచ్చింది.
చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చారు.
ఎవరిని చూసినా బోసినవ్వులు నవ్వడం, పలకరింపులకి ఊ కొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ చూసి కేరింతలు కొట్టడం, ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు. బాబు రాక, బాబు అల్లరి ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతుంటే వేణు ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా అయిపోతోంది. అదేరోజు బాబుకి మాధవి సెలక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి.
అన్నప్రాసన తరువాత తాయారమ్మ వాడికోసం బియ్యం వేయించి, కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసి పెట్టింది. అన్నం ఇప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సెరిలాక్ కూడా తెప్పించి నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారట్ జ్యూస్ లో కలిపి ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్ లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణి.
నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది. ఉదయాన్నే లేవడం, వాకిలి ఊడ్చి, నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండడం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోసగింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంటోంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది. మిగతా పని, బాబు పనితో సహా నీలవేణి ఒక అంకితభావంతో చేయడం మాధవిని ఆకర్షించింది. ఇంత మంచి పనిమనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంటుంది నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరితనం చూస్తూ. ఇంక బాబు నీలవేణికి ఆరోప్రాణం అయిపోయాడు. కొత్తల్లో వేణు దగ్గర భయంగా, బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా బాబుకి సంబంధించినంతవరకు.
ఇవాళ బాబు ఈ అల్లరి చేశాడు, అ అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకి వేణుకి చెప్పడం రోజువారీ కార్యక్రమం అయింది.
నీలవేణి మీద వేణుక్కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం కూడా ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో "ఈ అమ్మాయిని మనింట్లో ఎంతకాలం ఉంచుకుంటాం అమ్మా? ఆ అమ్మాయికి మనం చాలా ఋణపడిపోతున్నాం. ఏదన్నా చేయాలని ఉంది. ఏం చేయను?" అన్నాడు.
