Previous Page Next Page 
అర్చన పేజి 47

    కోడలు ప్రారంభించింది.
    "మీరు ఇన్ని రోజులనుండీఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీవారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు?"
    అర్చన ఊహించిన సమయం వచ్చినందుకు ఏం చేయాలో, ఏం చెప్పాలో తెలియక గుడ్లప్పగించి చూడసాగింది.
    "కాఫీ తాగుదురుగాని..." అంటూ కుర్చీలోంచి లేవబోతుంటే పూర్ణమ్మ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అంది "కాఫీ వద్దు ఏం వద్దు కూర్చోమ్మా... నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి."
    అర్చన అయోమయంగా చూసింది.
    కోడలు మొదలుపెట్టింది. "మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేటు విషయం అడుగుతాను. నిజంగా మీవారున్నారా? లేక మీరిద్దరూ..."
    అర్చన షాకింగ్ గా చూసింది. "అదీ.... అదీ...." తడబడుతుంటే ఆవిడే అంది మళ్ళీ.
    "చూడండి అర్చనగారూ! ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ, ఇండివిడ్యువాలితీ డెవలప్ చేసుకావడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగాళ్ళ ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించవద్దు. ఇంతకాలం నుంచీ మీరంటున్నా ఎప్పుడూ ఒక్కనాడు కూడా మీవారు రావడం అత్తయ్య చూడలేదన్నారు" అంటూ పూర్ణమ్మవైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. "మా తమ్ముడు సాఫ్ట్ వేర్ ఇంజనీరు. నెలకి లక్ష రూపాయలపైనే సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం ఖర్మో వాడికి జోడీగా ఒక్కమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారనిపించిందిట అత్తయ్యకి. మీ వయసు ముఫ్ఫై ఉంటుందా?"
    అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. ముఫై ఏళ్ళా? పాతికేళ్ళకే అనుభవాల పుట్ట అయింది.
    "మా తమ్ముడికి ముఫై మూడు. అయినా పాతికేళ్ళ కుర్రాడిలా ఉంటాడు. మీకు అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఎప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముణ్ణి పిలుస్తాను."
    ఆవిడ ఆపింది. పూర్ణమ్మమ్మ మొదలుపెట్టింది. "పిచ్చిపిల్లలాగా మనసులో కొండంత బాధపెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాన్ని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్ధం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళింకా నలుగు రోజులుంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాడిని పిలిపిస్తాం. ఒకళ్ళనొకళ్ళు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణమాసం. తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అన్నట్టు నీకు లాయర్ కాగితాలున్నాయిగా ఉండే ఉంటాయిలే."
    ప్రశ్న, జవాబు అన్నీ తానే అయి ఆవిడ మాట్లాడుతుంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు. వివరించింది కోడలు. అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటం ఏం లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది! ఏవో సమస్యలు వచ్చిపోతుంటాయి. పిల్లలు లేకపోవడం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకి రెండో పెళ్ళి కావడం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వెళ్ళిపోయారు వాళ్ళు. తల్లి, భార్య మాట్లాడుతుంటే శిలావిగ్రహంలా కూర్చున్నాడు అతను.
    వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టు సుఖంగా అనిపించింది.
    ఇదేంటి భగవంతుడా! పరిస్థితి ఇలా ఎదురుతిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి. కాదంటే ఇల్లు ఖాళీ చేయమనదు కదా ఈవిడ.
    అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా, సుఖంగా ఉందిక్కడ. ఇక్కడనుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి, సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష?
    అన్యమనస్కంగా వంట చేస్తూనే ఆలోచించి, ఆలోచించి నళినికి ఫోన్ చేసి "భోజనానికిరా.... కలిసి భోంచేద్దాం" అంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్ గా అనిపించింది. నళిని వచ్చేటప్పటికి వంట పూర్తిచేసి, ఫ్రెష్ గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది అర్చన. లోపలికి అడుగుపెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరి బిక్కిరి చేసింది. "ఎక్కడివి మొగలిపూలు?" వికసించిన మొహంతో అడిగింది నళిని.
    "పూలు కాదు. అగరుబత్తీలు. రా కూర్చో" నవ్వుతూ ఆహ్వానించింది.
    "ఎంత బాగుందో వాసన" చేతిలో ఉన్న అరటిపండ్లు టేబిల్ మీద పెడుతూ అంది నళిని.
    "అబ్బా... వాసన అనకపోతే పరిమళం అనచ్చు కదా!"    
    "ఏం? వాసన అన్నా, పరిమళం అన్నా అర్ధం ఒకటే కదా!"
    "అమ్మ మొగుడన్నా, నాన్న అన్నా అర్ధం ఒకటే కదా! ఏది బాగుంది?"
    నళినికి అర్ధమైనట్టు నవ్వింది. "సరే... పరిమళం!" అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది.
    "నువ్వు చాలా బాగుంటావు అర్చనా! ఈ చీరలో ఎంత బాగున్నావో!"
    అర్చన నవ్వి "కాఫీ తాగుతావా?" అడిగింది.
    "వద్దు. ఇప్పటికే రెండుసార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రామ్ ఏంటి సడన్ గా!"
    "ఏం లేదు" అంటూ నళిని మొహంలోకి చూసి ఒకసారి నవ్వి మొహం తిప్పుకుంది.
    "నువ్వలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తోంది."
    అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తరువాత అంది "ప్రమాదం ముంచుకొచ్చింది."
    నళిని ఆదుర్దాగా చూసింది. "ఏం జరిగింది? ఏం ప్రమాదం?"
    "అంత కంగారుపడకు. ఏం లేదు. పూర్ణమ్మగారు వచ్చి వెళ్ళారు."
    "అదా?" ఊపిరి పీల్చుకుని అంది.
    "నాకు పెళ్ళి సంబంధం తెచ్చింది."
    "నీకా?" అయోమయంగా చూసింది నళిని. "ఆవిడకేమన్నా పిచ్చా?"
    "పిచ్చో, వెర్రో! వాళ్ళ కోడలి తమ్ముడున్నాట్ట. అతనికి పెళ్ళికాలేదుట. ముఫ్ఫై మూడేళ్ళట."
    "అదా సంగతి!?" తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది.
    "ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్ళిళ్ళవడం చాలా కష్టమైపోతోంది. ఇదివరకు రోజుల్లో ఆడపిల్ల పెళ్ళికోసం కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగే పరంధామయ్యలంతా ఇప్పుడు మగపిల్లల కోసం అలాగే తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్ళికోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయిత్తులు..."
    "నాకర్ధం కావడం లేదు. పరంధామయ్య, పార్వతమ్మ వీళ్ళంతా ఎవరు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS