ఇద్దరూ వాళ్ళ ఆలోచనల్లో ఉండగా నీలవేణి వచ్చి "అమ్మాయిగారూ! బాబుకి నెలలు పొయ్యాలి. ఎక్కడ పొయ్యమంటారు?" అనడిగింది.
మాధవి లేచి "పద నేనుకూడా సాయం చేస్తాను. పెరట్లో కొంచెం విశాలంగా ఉంటుంది. అక్కడ పోద్దాం" అంది లేస్తూ.
నీలవేణి, మాధవి లేచి వెళ్ళబోతుంటే "నాకా గ్యాస్ స్టవ్ వెలిగించడం నేర్పించమ్మా! వంట చేస్తాను" అంది తాయారమ్మ.
మాధవి వెనక్కి తిరిగి నవ్వి "ఇవాళ్టికి మీరు విశ్రాంతి తీసుకోండి. రేపట్నించీ నేర్పిస్తాను" అంది.
"ఫర్వాలేదమ్మా... ఏం పెద్ద అలసిపోయానని విశ్రాంతికి? నేను చేస్తాలే వంట."
"నేను మడి కట్టుకోకపోయినా స్నానం చేసి, శుభ్రమైన చీర కట్టుకుని చేస్తాను. మీరేం బాధపడకండి."
ఆవిడ గాఢంగా శ్వాస తీసుకుని అంది "మడి, తడి అన్నీ మర్చిపోయానమ్మా. ఆయన కోసం మది. నాకేం మడి!"
"ఫర్లేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. రండి.... మంచం మీద ఉతికిన దుప్పటి వేశాను" అంటూ ఆవిడ్ని చేయి అందించి లేపింది కుర్చీలోంచి. ఆవిడకి కూడా కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అనే అనిపించి మౌనంగా మాధవిని అనుసరించింది.
బెడ్ రూములోకి తీసుకెళ్ళి ఫ్యాన్ ఆన్ చేసి, మంచం చూపిస్తూ "మీరు పడుకోండి" అంది మాధవి.
ఆవిడ మౌనంగా మంచం మీద వాలింది.
మాధవి తలుపు జారేసి "పద...." అంటూ నీలవేణిని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. నీలవేణి బాబుని మాధవి చేతికిచ్చి తను కట్టుకున్న లంగా గోచీలాగా వెనక్కి దోపి, ఓణీ బొడ్లో దోపింది. బాయిలర్ లో కాగుతున్న నీళ్ళు బకెట్లోకి పట్టుకుని, సరిపడా చన్నీళ్ళు కలిపి, నూనేగిన్నే, శనగపిండి, జాన్సన్ షొప్ తీసుకొచ్చింది.
చుట్టూ చూస్తూ "నాకు కూర్చోడానికి పీటకావాలండీ..." అంది.
మాధవి ఒక్కక్షణం చుట్టూ చూసి ఓ మూల గోడకి ఆనించి పెట్టిన ఒక రాయి చూపించి "అది తెచ్చుకో. ఇక్కడ పీటలు ఉండవు."
నీలవేణి రాయి తెచ్చుకుని వేసుకుని కూర్చుంది. బాబుని తీసుకుని నేర్పుగా బాబు ఒంటికి నూనె రాసి మర్దన చేస్తుంటే మాధవి కుతూహలంగా చూస్తూ కూర్చుంది.
* * * * *
కాలం గడిచిపోతోంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తోంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నళిని సలహాతో గుడికి వెళ్ళి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకుని వచ్చి అప్లికేషన్ పంపించింది.
కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతి రోజూ ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగ్ జైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విసయాల గురించిన ఆలోచనలు కబుర్లు కాలక్షేపాలూ పక్కన పెట్టేసింది. చదువు.... చదువూ దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ, చదివింది పదే పదే గుర్తుచేసుకుంటోంది. ఆమెకి తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూటకట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురుచూసిన రోజు వచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తివంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం. రాకపోతే నో... రాదన్న ప్రసక్తే లేదు. తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుడిని వేడుకుంది. 'దేవుడా! నేను సెలక్ట్ అవాలి. నా లక్ష్యం నెరవేరాలి. ఈ సమాజంలో ఒక హోదాగల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరకు నేను వెళ్ళాలి. నా తండ్రిని నేను తెచ్సుకోవాలి. నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రీ...' అలా అనుకున్నాక ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 'నేనేనా ఇలా మొక్కుకున్నాను!?' అనుకుంది.
అర్చన భగవంతుడిని నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి, ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడటం ఆమెకు అలవాటు అయింది. కష్టపడి పొందే ఫలితంలో ఎంత ఆనందం ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకి అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది.
రోజులుప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బందీ లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు. అంచి మనసు. దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తోంది. అలా అని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరిమీదా రుద్ధదు. ఎదుటివారి నిస్సహాయస్థితిని, బలహీనతనీ అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ, బాధపెట్టాలని కానీ ఆమెకి ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లితండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాదాశ్రమాల్లో విరాళాలు ఇస్తుంటుంది.
ఇకపోతే పూర్ణమ్మగారు మాత్రం కొంతకాలం అడపా, దడపా ఆ తరువాత తరచూ అర్చనని 'మీవారు ఇంకా ఎప్పుడొస్తారు? నిన్ను తీసుకెళ్ళచ్చు కదా! ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు?' అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు అంది 'చెప్పేస్తాను, ఆవిడకి నిజం చెప్పేస్తాను' అని. కానీ నళిని పడనీయలేదు.
అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదేపనిగా ఈ విషయమై అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది.
"అమ్మా అర్చనా! ఏం చేస్తున్నావు?" అంటూ వచ్చింది ఆదివారం ఉదయాన్నే. ఆవిడ వెంట ఆవిడ కొడుకు, కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందురోజే హైదరాబాదు నుంచి వచ్చారు. వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయిపడింది.
'వీళ్ళేంటి ఇలా దాడిచేశారు?' అనుకుంటూ "రండి, రండి... కూర్చోండి" అంటూ ఆహ్వానించింది.
