తాయారమ్మగారితో కలిసి మొదటిసారిగా హైదరాబదు చేరిన నీలవేణికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది. ఏమిటీ జనం? ఎక్కడికి వీళ్ళ పరుగులు? ఎందుకింత హడావుడి? ఎవరి మొహాలు చూసినా ఏదో ఆందోళన ఎంచేత? ఆమెకి ఏమీ అర్ధం కాలేదు. "అమ్మగారూ! పాపం వీళ్ళంతా ఏటండి... ఇంత దిగాలుగా ఉన్నారు?" అనడిగింది తాయరమ్మని.
"నాకు మాత్రం ఏం తెలుసే. నీతోటే వచ్చాను. అడుగో అబ్బాయి వస్తున్నాడు. బాబునిలా ఇవ్వు. సామాను పట్టుకో" అంటూ నీలవేణి భుజమ్మీంచి బాబుని తీసుకుంది.
వేణు మొహం నిండా సంతోషంతో పరుగులాంటి నడకతో వచ్చాడు. "అమ్మా..." అంటూ ఆవిడ చేయి పట్టుకుని నొక్కి "ప్రయాణం బాగా జరిగిందమ్మా? భయం వేసిందా?" అనడిగాడు బాబుకోసం చేయి చాపుతూ.
"బాగానే జరిగింది నాన్నా! వాడు నిద్రపోతున్నాడు. పద ముందు. మమ్మల్ని ఇక్కడి నుంచి ఈ జనప్రవాహం నుంచి బైటికి తీసుకెళ్ళరా. నాకు ఊపిరాడడం లేదు" అందావిడ.
వేణు నవ్వాడు. నీలవేణి దగ్గరనుంచి రెండు బ్యాగులు అందుకున్నాడు. నీలవేణి మరో బ్యాగు పట్టుకుంది.ముగ్గురూ ఆటోవైపు నడిచారు.
ఒక ఆటోలో నీలవేణి, తాయారమ్మ కూర్చుంటే మరో ఆటోలో సామానుతో తను కూర్చున్నాడు. తన ఆటోని అనుసరించమని వాళ్ళు కూర్చున్న ఆటో అతనికి చెప్పాడు. ఆటోలు కదిలాయి.
నీలవేణి విశాలమైన కళ్ళతో దాటిపోతున్న పరిసరాలను, రోడ్లను, జనాన్ని వింతగా, ఆసక్తిగా గమనిస్తుంటే తాయారమ్మ రోడ్లమీద ఉన్న చెత్తా చెదారం, ఉమ్ములు, ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళు నిలబడి ఉచ్చాలు పోయడం చూస్తూ ముక్కుకి చీరచెంగు అడ్డం పెట్టుకుని నొసలు చిట్లించి విసుక్కోసాగింది.
"ఇదేం ఊరో, దిక్కుమాలిన ఊరు! శుచీ, శుభ్రం లేవు బొత్తిగా, ఈ పిచ్చ వెధవ ఇక్కడికెందుకు వచ్చిపడ్డాడో..." అంటూ చిరాకు పడసాగింది. నీలవేణి అదేం పట్టించుకోకుండా కలలో కూడా ఊహించని పట్నంని కుతూహలంగా గమనిస్తూ కూర్చుంది.
ఆటో ఇల్లు చేరేటప్పటికి మాధవి గుమ్మంలోనే ఎదురొచ్చింది. తాయారమ్మ దగ్గరగా నడిచి ఆవిడ భుజమ్మీద ఉన్న బాబుని అందుకుని "నాపేరు మాధవి పిన్నిగారూ!" అంటూ తనని తాను పరిచయం చేసుకుంది.
లక్ష్మీదేవిలా దర్శనమిచ్చిన మాధవిని చూడగానే ఆవిడ చికాకు మాయమై పోయింది.
లోపల అడుగు పెడుతుండగానే కమ్మటి ఉప్మా వాసన, కాఫీ వాసన ఆవిడ ముక్కుపుటాలకు సోకి, నేరుగా స్నానానికి వెళ్ళిపోయింది. బిక్కుబిక్కుమంటూ నిలబడిన నీలవేణిని చూస్తూ "అలా వెళ్ళు. పెరట్లో మరో బాత్ రూమ్ ఉంది. అక్కడే ఒక గది ఉంది. నీ సామాను అందులో పెట్టుకుని స్నానం చేసిరా" అంటూ దారి చూపించింది మాధవి.
నీలవేణి తన బ్యాగు తీసుకుని మాధవి చూపించినవైపు వెళ్ళిపోయింది.
మాధవి బాబుని రెండు అరచేతుల మీదకి తీసుకుంది. వాడు లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. వేణు వైపు చూస్తూ అంది మాధవి.
"అర్చన పోలికే.... నీ పోలికలు లేవు."
వేణు నవ్వాడు.
మాధవి బాబుని వేణు చేతికిచ్చి వంటగదివైపు వెళ్ళిపోయింది.
వేణు బాబుని ఎత్తుకుని కుర్చీలో కూర్చుని తదేకంగా వాడినే చూడసాగాడు.
"మీ అమ్మ నీ మొహం సరిగా చూసి ఉండదురా. చూసి ఉంటే నిన్నిలా వదిలేసేది కాద. పోనీలే నిన్ను నాకు వదిలి మంచిపని చేసింది. మీ అమ్మ చేసిన మంచి పని ఇదొక్కటే. ఈ విషయంలో కూడా మూర్ఖపు నిర్ణయం తీసుకుని ఉంటే నాన్నా, నిన్ను నేను ఈ జన్మలో చూడగలిగేవాడిని కాదురా" వేణు కళ్ళనుంచి రెండు కన్నీటి చుక్కలు బాబు చేతిమీద పడ్డాయి.
అప్పుడే స్నానం చేసి, తయారై వచ్చిన తాయారమ్మ వేణు దగ్గరగా వచ్చి చెంగుతో అతని చెంపలు తుడిచింది. బాబుని చేతుల్లోకి తీసుకుని "వెళ్ళు నాన్నా! స్నానం చేసిరా ఆఫీసుకి వెళ్ళవా?" అంది వేణు భుజమ్మీద ఆప్యాయంగా తడుతూ.
వేణు మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. మాధవి అందరికీ వేడి వేడి ఉప్మా ఇడ్లీ, కారప్పొడి, సాంబారు చేసిపెట్టింది.
నీలవేణి మాధవికి సాయం చేయడానికి లోపలికి వెళ్ళిపోతే, వేణు ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
మాధవి వంటగది క్లీనింగ్, గిన్నెలు తోమడం అన్నీ నీలవేణికి వదిలేసి వచ్చి తాయారమ్మ పక్కన కూర్చుంది.
ఆవిడ ఆప్యాయంగా మాధవిని చూస్తూ అంది "ఎందుకమ్మా ఇంత శ్రమ తీసుకున్నావు?"
మాధవి నవ్వింది. "శ్రమ ఏం లేదు పిన్నిగారూ! బాబుని తీసుకుని మొదటిసారి మీరు హైదరానాదు వచ్చారు. మీకిక్కడి పద్ధతులు, అలవాట్లు తెలిసిందాకా కొంచెం సాయంగా వచ్చానంతే!"
"నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదూ!?"
"చేసేదాన్నండి. బాబు పుట్టాక మానేశాను."
"నీకు మా అర్చన బాగా తెలుసా?"
"తెలుసు. కానీ, పర్సనల్ విషయాలు, అంటే వ్యక్తిగతమైన విషయాలు నాతో ఎప్పుడూ ఎక్కువ చర్చించలేదు. చాలా సరదాగా, సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకటే ఆఫీసులో ఉద్యోగం. తను ఉద్యోగం ఎందుకు మానేసిందో నాకసలు తెలియదు. మా బాస్ కూడా నన్ను ఒకటి, రెండుసార్లు అడిగారు. ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు. ఏమైందో నాకేం తెలియదు."
ఆవిడ నిట్టూర్చింది. ఎవరికీ ఏమీ చెప్పకుండా కడుపులో కుమిలిపోతే ఇలాగే ఉంటుంది. ఎవరికన్నా చెప్పుకుంటే తోచిన సలహా ఇస్తారు. నచ్చితే పాటించవచ్చు. లేకపోతే మరో నిర్ణయం తీసుకోవచ్చు. ఏవిటో! జీవితం ఇలా ఎందుకు చేసుకుందో నాకేం అర్ధం కావడం లేదమ్మా!"
మాధవి ఓదార్పుగా అంది "బాధ పడకండి. భర్తమీద ప్రేమ లేకపోయినా పేగు తెంచుకు పుట్టిన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఎంతకాలం దూరంగా ఉంటుంది? తప్పకుండా ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తుంది."
ఆవిడ విరక్తిగా నవ్వింది. "లేదమ్మా... అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియలేదు. వేణు, వాళ్ళ నాన్నగారు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి తల్లితండ్రులని కలవడానికి వెళ్ళారు. అక్కడ ఎవరూ లేరంట. ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఈ అమ్మాయి ఎక్కడుందో, ఏంటో, ఒంటరిగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని తంటాలు పడాలో..."
మాధవికి జాలేసింది. పెద్దావిడ ఎంత బాధపడుతోంది! అర్చన నిజంగా కఠినాత్మురాలు, మూర్ఖురాలు. ఇలాంటి అత్తగారిని, భర్తని, ముత్యంలాంటి కొడుకునీ, దేవుడు లాంటి మావగారిని ఇంత భద్రతగల జీవితాన్ని వదిలి వెళ్ళిందంటే ఏం ఆశించి వెళ్ళినట్టు? ఏం సాదించాలని వెళ్ళినట్టు? ఏం సాధిస్తుంది? ఛీ, అర్చన క్షమార్హురాలు కాదు. ఎంతమాత్రం కాదు!
