Previous Page Next Page 
అర్చన పేజి 44

    చాలాసార్లు అనుకుంది నాగరాజు తండ్రినే కలవాలని. కానీ, ఎందుకో ఈ ఒక్క విషయంలో సాహసం చేయలేకపోయింది. అందుక్కారణం ఆయన తప్పకుండా తననే నిందిస్తాడని ఆమెకు తెలుసు. అంతేకాక నళిని అనేకసార్లు ఆమె ధైర్యాన్ని దెబ్బతీయడం, అవమానాలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం, ఏదైనా, ఏనాటికైనా అతను కలుస్తాడని ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకోవాలని అనుకుంటోంది. కానీ, ఎలంటి కక్ష అనేదానికి ఆమెకే స్పష్టమైన ఆలోచన లేదు.
    అందుకే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి, భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంది. అందులో భాగమే తన ఆశయం నెరవేర్చుకునేవైపుగా వేసిన అడుగు. పుస్తకాల సేకరణ, పఠనం.
    ఆ రోజు నళిని ఒక ప్రపోజల్ చేసింది. పిల్లలని తీసుకుని అరకు టూర్ వెళ్ళాలని. సంతోషంగా ఒప్పుకుంది అర్చన. ముఫైమంది పిల్లలతో స్పెషల్ బస్సు మాట్లాడుకుని అరకు ప్రయణం అయారు. దారిలో ఎదురయే ప్రకృతి దృశ్యాలను మైమరచి చూస్తూ తనను తాను మర్చిపోయింది అర్చన. అరకులో గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేయడం, అందమైన ఉడ్ కాటేజ్ నుంచి గార్డెన్ చూడడం, అరకు ఎగ్జిబిషన్ లో మానవ జీవనపరిణామ క్రమం శిల్పాలు చూసి వాటి గురించి, తెలుగువారి జీవనశైలి గురించి పిల్లలకు తనకు తెలిసినంతవరకూ వివరిస్తూ ఆ శిల్పాల పక్కన నిల్చుని ఫోటోలు తీయించుకొడం అన్నీ మరపురాని మధురానుభూతులుగా మూట కట్టుకుంది.
    ఎంత బాగుంది అరకు! గిరిజనులతో ఆట, పాటానే కాక వాళ్ళతో కలిసి చాలా ఫోటోలు తీయించుకున్నారు. వాళ్ళిచ్చిన చిన్నచిన్న బహుమతులు పదిలంగా దాచుకుంది. వెదురుతో చేసిన విసనకర్రలు, బొమ్మలు ఎంతో బాగున్నాయి అంటూ వాళ్ళ పనితనం మెచ్చుకుంది. 'వీళ్ళల్లో ఎంత కళ ఉంది నళినీ! కానీ, ఎందుకు వీళ్ళు నాగరిక సమాజానికి దూరంగా ఉంటారు. అక్షరాస్యత వైపు ఎందుకు వీళ్ళ దృష్టి వెళ్ళదు?' అని కొద్దిగా బాధపడింది.
    'ఉండనీలే అర్చనా... ఈ ప్రపంచంలో నిష్కల్మషమైన, నిర్మలమైన మమతానురాగాలు మనకి కావాలన్నప్పుడు ఇక్కడికి వచ్చి సేదతీరాలంటే వీళ్ళిక్కడే, ఇలాగే ఉండనీ. నాగరిక సమాజంలోకి వస్తే వీళ్ళు మనలాగే పొల్యూట్ అవుతారు' అంది నళిని.
    'ఎంత స్వార్ధం?' అంటూ నవ్విందే కనీ, ఆ మాట నిజమే అని ఎక్కడో అంతరంగంలో చిన్న భావన అంకురించింది.
    అక్కడి నుంచి బొర్రాగుహలు వెళ్ళారు. కొందరు లొపలికీ వస్తే కొందరు పిల్లలు భయపడ్డారు. భయపడిన పిల్లలకి తోడుగా అర్చన బైటనే ఉండిపోయింది. నళిని, మరో టీచర్ ఆ పిల్లలతో పాటు లోపలికి వెళ్లారు.
    ఇలా అర్చన ఈ విహారయాత్రలో ఉన్నప్పుడే కృష్ణస్వామి, వేణు వైజాగ్ రావడం అర్చన జాడ తెలియక వెనక్కి వెళ్ళిపోదాం జరిగింది, కృష్ణస్వామి బాధగా తన ఊరు వెళ్ళిపోతే వేణు అక్కడినుంచి హైదరాబాదు వెళ్ళిపోయాడు. వెడుతూ, వెడుతూ బాబుని తఃన దగ్గరకు పంపించే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న కోరిక వెలిబుచ్చాడు.
    కానీ, ఏ విధంగానూ బాబుకి అక్కడ క్షేమకరంగా లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు తాయారమ్మకి. బాగా అలోచించిన మీదట ఒకటే ఆలోచన వచ్చింది. నీలవేణినీ, బాబునీ వేణు దగ్గరకు పంపేస్తే.... కానీ వయసులో ఉన్న పిల్ల నీలవేణి. పనిపిల్లే అయినా ఆడపిల్ల ఎలా పంపించగలదు? ఏం చేయాలో తోచలేదు ఆవిడకి. పైగా రోజు రోజుకీ ఊళ్ళో వాళ్ళ ప్రశ్నల పరంపర ఎక్కువ అయిపోతోంది. 'తాయారమ్మగారూ! ఇంతకీ ఈ బాబు ఎవరో తెలిసిందా? వీడి తల్లి ఎవరో, మన ఊరికీ, ఆమెకీ సంబంధం ఏమిటో వాకబు చేశారా? కులం, గోత్రం తెలియని పిల్లాడిని ఇంట్లో పెట్టుకున్నారు. తర్వాత, తర్వాత ఇబ్బంది పడతారేమో!?' అంటూ ఎవరికి తోచిన సలహా వాళ్ళివ్వడం ఎక్కువైపోతోంది. ఈ విషయాలన్నీ ఒకరోజు రాత్రి భర్తతో చర్చించింది ఆవిడ.
    ఆవిడ చర్చించడం వలన కాక, ఆయన కూడా పరోక్షంగా ఆ పశ్నలు ఎదుర్కొంటున్నవాడే అవడంతో ఆయన కూడా ఈ విషయం తీవ్రంగానే ఆలోచించసాగాడు. అలా ఆలోచించాక ఒక నిర్ణయానికి వచ్చాడు.
    వేణు కోరిక ప్రకరం బాబు వేణు దగ్గర ఉండాలంటే, అదీకాక, ఆ ఊళ్ళో బాబు తల్లి ఎవరో, ఆమె ఎందుకు ఆ బాబుని అక్కడ వదిలేసిందో ఊళ్ళో వాళ్ళకి తెలియకూడదంటే ఒకటే మార్గంగా బావించాడు కృష్ణస్వామి. నీలవేణినీ, బాబునీ వేణు దగ్గరకు పంపించడం, కాకపోతే వయసులో ఉన్న నీలవేణిని వేణు దగ్గర వదిలేసి రేపేదన్నా జరగరానిది జరిగాక మళ్ళీ మరో సమస్య మీద పడకుండా ఉండాలంటే తాయారమ్మగారు కూడా వాళ్ళతో వేణు దగ్గరకు వెళ్ళడం.
    ఆయన నిర్ణయం విన్న తాయారమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. "పెళ్ళయి మీ దగ్గరకు వచ్చాక పట్టుమని పదిరోజులు కూడా మిమ్మల్ని వదిలి పుట్టింట్లో కూడా ఉన్నాను కాదు. అలాంటిది ఈ వయసులో మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళనండీ మీ ఆరోగ్యం మాత్రం నాకు ముఖ్యం కాదా?" అంది.
    ఆయన సాలోచనగా అన్నాడు "తప్పదు తాయారూ! మనకి అన్నిటికన్నా మన అబ్బాయి క్షేమం, మనవడి భవిష్యత్తు ముఖ్యం. నేను ఎలాగైనా కోడలి ఆచూకీ సంపాదిస్తాను. త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ కాపురం బాగుచేస్తాను. ఆ తరువాత మళ్ళీ మన ఊరు, మనం.... కొంతకాలం తప్పదు."
    "పట్నం మొహం కూడా తెలియదు నాకు. ఎలా ఉండాలో? ఏంటో?" అందావిడ దిగులుగా.
    "ఫర్లేదు. నీలాంటి చాదస్తపు ఇల్లాళ్ళెందరో అమెరికా వెళ్ళి నాగరికత నేర్చుకుని వస్తున్నారు. నువ్వు వెళ్ళేది మనదేశం, మన రాష్ట్రం, మనవాళ్ళుండే చోటు. ఏం ఫర్వాలేదు. వేణు స్నేహితులున్నారు. అతని భార్య మాధవి లక్షణమైన పిల్ల. నీకు తోడుగా ఉంటుంది. కాకపోతే బాబుని నువ్వొక్కదానివీ చూసుకోలేవు కాబట్టి నీలవేణిని పంపిస్తున్నాను."
    "అది లేకుండా బాబుని నేను చూసుకోలేనన్నది నిజమేలెండి. సరే కానివ్వండి. తప్పదు కదా!" అందావిడ నిట్టూరుస్తూ.
    ఆయన భార్యని ఆప్యాయంగా, ఆధారంగా దగ్గరకు తీసుకున్నాడు. చాలాకాలం తరవాత భర్త గుండెలమీద పడుకుని ఆయన్ని చిన్నపిల్లలా హత్తుకుపోయిందావిడ.
    మర్నాడు ఉదయమే వేణుకి ఫోన్ చేసి తన నిర్ణయం తెలియచేశాడాయన.
    వేణు ఆనందంతో పొంగిపోయాడు.
    "థాంక్స్ నాన్నగారూ! థాంక్యూ వెరీమచ్" అంటూ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు తండ్రికి.

                                                                                                          * * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS