Previous Page Next Page 
అర్చన పేజి 43

    రోజూ సాయంత్రం ఇంటికి రాగానే కాస్సేపు టీ తాగుతూ మొక్కల మధ్య గడపడం, కాస్సేపు పూర్ణమ్మగారితో కబుర్లు చెప్పడం, ఆ తరవాత రెండే రెండు పుల్కా తిని, చదువుకుంటూ కూర్చోడం, రాత్రి ఏ పన్నెండింటికో పడుకోడం వేరే ఆలోచనలకు సమయం సరిపోనంత బిజీగా దినచర్యని ప్లాన్ చేసుకుంది. అయితే తనను వెంటాడే కలనుంచి తప్పించుకోడానికి తప్పనిసరై నిద్రమాత్రలు రోజూ వేసుకోవాల్సి వస్తోంది. ఆ మాత్రల ప్రభావం మరునాడు మధ్యాహ్నం పూట కూడా పడుతుండడంతో బలవంతంగా నిద్రనుంచి తప్పించుకుంటూ నెట్టుకొస్తుందేమో రాత్రిపూట చదువు సరిగా సాగడం లేదు. అందుకే క్రమంగా రోజూ వేసుకునే మాత్రలు రోజు విడిచి రోజుకి మార్చింది. అలా నెమ్మదిగా పూర్తిగా మానేయాలని తన మనసులో మరే ఆలోచనకీ చోటివ్వకూడదని నిశ్చయం చేసుకుంది అర్చన.
    ఆమెకి ఒక దృఢమైన నమ్మకం పడిపోయింది. ఈ జీవితంలో ప్రేమా, పెళ్ళి, సంసారం, భర్త వీటికి చోటులేదు రాదు అనుకుంది. తనని ప్రేమించిన వ్యక్తిని తాను దూరం చేసుకుంది. తను ప్రేమిస్తున్నవాడు మొదటినుంచీ దూరంగానే ఉన్నాడు. భగవంతుడెందుకో అతడిని దగ్గరకు తీసుకొస్తున్నట్టే తీసుకొస్తూ దూరంగా తరిమేస్తున్నాడు. బహుశా తఃనకి ప్రేమ అచ్చిరాదేమో అనుకుని విరక్తిగా నవ్వుకుంది.
    ప్రేమ... ఎంత మధురమైనవీ అక్షరాలు. జీవితంలో ఒక్కసారన్నా ప్రేమించని, ప్రేమించబడని మనిషి ఎవరూ ఉండరేమో!
    ప్రేమ మనిషికి టానిక్ లాంటిది. అందులోనూ కోరుకున్నవాళ్ళ ప్రేమ లభించడం అదృష్టవంతులకే దక్కుతుందేమో. తను చాలా దురదృష్టవంతురాలు.
    భర్త, ప్రియుడు, అమ్మ, నాన్న, అన్నయ్య, ఆఖరికి రేపో, మాపో ప్రేమించే కొడుకు ప్రేమకు కూడా నోచుకోని ఈ బతుకు బతుకేనా?
    వేణు తనని ఖచ్చితంగా ఈపాటికి ద్వేషిస్తూ ఉంటాడు. అసహ్యించుకుంటాడు.
    పోనీలే కనీసం బాబుని చేరదీస్తే చాలు. వాడికి మంచి భవిష్యత్తునిస్తే చాలు. ఏనాటికైనా తను వాడిని కలుస్తుంది. యస్... కలుస్తుంది. తల్లిగా తనకాహక్కుంది. తన లక్ష్యం నెరవేర్చుకుని తన గమ్యం చేరుకుని వాడిని కలుస్తుంది. ఒక గౌరవనీయమైన స్థానం సంపాదించుకుని వాడిని కలుస్తుంది. వాడి ప్రేమని తాను పొందుతుంది.
    ప్రేమిస్తాడా? వాడు తనని ప్రేమిస్తాడా? పసివాడిని నిర్దయగా అలా వదిలి వచ్చిందని వాడికి తెలిస్తే తనని క్షమిస్తాడా?
    వేణు తనని రానిస్తాడా? బాబుని కలవనిస్తాడా? వాడిని చేరదీయనిస్తాడా? ఎప్పటికైనా వాడిని తన దగ్గరకు తెచ్చుకోవాలన్న తన కోరిక నెరవేరుతుందా?
    ఆ ఆలోచన రాగానే కలవరంతో పిచ్చెక్కినట్టు అయిపోయింది. కొద్దిసేపటికే తానలా చేసింది వాడి భవిష్యత్తు కోసమే, వాడిని తను చేరాల్సిన చోటికి చేర్చానని తనకి తాను సర్దిచెప్పుకుంటూ, నచ్చచెప్పుకుంటూ బాధ దరిచేరనీకుండా జాగ్రత్త పడసాగింది.
    ఇంక ఈ జీవితానికి పెళ్ళి అనేది లేదు కాబట్టి తను కేవలం అర్చనగా ఉండిపోతుంది. ఈ అర్చన ఎవరికీ ఏమీ కాదు. కానీ వాడికి మాత్రం తల్లి అవుతుంది. ఈ హక్కు ప్రకృతి అనే న్యాయస్థానం ఇచ్చింది. దీన్ని కాదనే హక్కు ఎవరికీ ఉండదు.
    ఎప్పటికైనా వాడు తన దగ్ఘరకు రావాల్సిందే. ఎందుకంటే వేణుకి తప్పకుండా అతని తల్లి, తండ్రి మళ్ళీ పెళ్ళి చేస్తారు. భార్యా పిల్లలు అతనికి విడిగా ఒక సంసారం జీవితం ఏర్పడుతుంది. అప్పుడు....అప్పుడు తన కొడుకు ఆ ఇంట్లో పరాయివాడు అవుతాడు. నొ... అలా కాకూడదు. మహా అంటే ఐదేళ్ళు. ఐదేళ్ళలో తన జీవితం ఒక గాడిన పడుతుంది. ఒక స్థానం, హోదా, డబ్బు సంపాదించుకున్నాక తన కొడుకుని తాను తెచ్చుకోవచ్చు.
    అలా అనుకున్నాక అర్చనకి మనసు ప్రశాంతంగా అనిపించింది.
    ఆమెకు ప్రస్తుతం మరో రిక్రియేషన్ నళిని. నళినితో కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే కొత్త కొత్త జీవిత సత్యాలేవో తెలుస్తున్న భావన కలుగుతోంది. నళినితో స్నేహం సాఫీగా, ప్రశాంతంగా సాగుతోంది. ఆమె ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్ముతుంది. 'నువ్వెందుకు పెళ్ళి చేసుకోలేదు నళినీ?' అనడిగితే 'ఇది భగవంతుడి ఆజ్ఞ. నన్నిలా కన్యగానే ఉండిపోయి ఈ పిల్లలకి నా సేవలందించమని ఆ దేవుడు ఆజ్ఞాపించాడు. దాన్ని కాదనే అధికారం, ధైర్యం నాకు లేవు' అంటుంది.
    అంతేకాదు, 'నీ కలలో కనిపించే రాజకుమారుడు నీకు వచ్చే జన్మలో తప్పకుండా భర్త అవుతాడు. కొందరికి పూర్వజన్మ స్మృతులు ఉంటాయి తెలుసు కదా! చాలాసార్లు పేపర్లలో చదివాం. అలాగే కొందరికి తరువాత జన్మకి సంబంధించిన విషయాలు ఇలా కలలుగా వస్తుంటాయి. కాబట్టి ఈ జన్మలో నువ్వు కోరుకునే వ్యక్తి నీకు భర్తగా వస్తాడన్న ఆశ ఏదన్నా ఉంటే మనసులోంచి తుడిచెయ్. నా మాట విని హాయిగా వేణు దగ్గరకు వెళ్ళిపోయి దర్జాగా బతుకు. లేదంటే పిల్లలతో ఇలా గడిపెయ్. అంతేగానీ ఆకాశంలో చంచమామని కొప్పున అలంకరించుకోవాలనుకోడం, నక్షత్రాలను నెక్లెసుగా అలంకరించుకోవాలనుకోడం తెలివి తక్కువ' అని అర్చనాకి బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది.
    నళిని మాటలు విని, పల్చగా నవ్వి ఊరుకుంటుంది అర్చన. 'నేనంత బలహీనురాల్ని కాను నళినీ...' అని మాత్రం మనసులో అనుకుంటుంది.
    అంతేకాక, నాగరాజు మీద పగ తీర్చుకోవాలన్న అర్చన ఆలోచన కూడా వ్యతిరేకించింది నళిని. 'అతనికి పెళ్ళయింది. నువ్వు అనవసరంగా మూసేసిన ఫైల్ ఓపెన్ చేశావంటే మరో అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. కాబట్టి జరిగిందేదో జరిగింది మర్చిపో. మనిషిలో రోజు గడుస్తున్నకొద్దీ ప్రవర్తన , ఆలోచన మారుతుంటుంది. రెండేళ్ళ నాటి సంఘటన తిరిగి తవ్వుకోడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరూ నీకు సపోర్ట్ కూడా రారు. నిన్నే ఇంకా దుమ్మెత్తిపోస్తారు. అంచేత నా మాట విని నీ భవిష్యత్తు నికే అనుకూలంగా, సుఖంగా ఉండేలా డిజైన్ చేసుకో అంతేగానీ, పంతాలకు పోకు' అంటూ సలహా ఇచ్చింది.
    నళిని మాటల ప్రభావం అర్చన మీద బాగానే పడింది. నాగరాజు గురించి ఆలోచిస్తూ కాలం వృధాగా గడిపేస్తున్నాననిపించింది. ఆమెకి తెలిసినంత మట్టుకు నాగరాజు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. చదువు పక్కన పెట్టి అతని తండ్రి అతనికి తన బిజినెస్ లో కొంత షేర్ ఇచ్చి మంచి కట్నంతో పెళ్ళి చేసి వాళ్ళని విడిగా పంపించేశాడు.
    నాగరాజు తండ్రికి అంతో ఇంతో విలువలున్నాయి. అర్చన అని తెలియకపోయినా తన కొడుకు ఒకమ్మాయికి ద్రోహం చేశాడని తెలుసుకున్నాడు. అంతేకాదు, కొడుకు చదువు నిర్లక్ష్యం చేయడం కూడా సహించలేకపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పదవి, అధికారం ఉన్నా, తన కొడుకు ఒక అప్రయోజకుడని నలుగురిలో చెప్పుకోడం ఆయనకి ఇష్టం లేదు. అలా అని కొడుక్కి శ్రద్ధ లేకున్నా, డబ్బుతో ఇంజనీరింగ్ సీటులు, సర్టిఫికెట్ లు కొనివ్వడం కూడా ఆయన సిద్దాంతాలకి విరుద్ధం. అందుకే డిగ్రీతో ఆపేసి బిజినెస్ లో దింపాడు. అదికూడా అతని మేధా స్థాయికి తగినట్టు రియల్ ఎస్టేట్ బిజినెస్. విశాఖపట్టణానికీ, భీమ్లీకి మధ్య ఉన్న ప్రాంతంలో విల్లాలు కడుతున్నాడని ఆమెకి తెలిసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS