ఆవిడ సన్నగా నిట్టూర్సుతూ అంది "నువ్వు తట్టుకోలేకపోయన ఇది నిజం నాన్నా..." అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చేయి చేతిలోకి తీసుకుని నిమురుతూ "వేణూ! ఆ అమ్మాయి నీనుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ వెళ్ళి తప్పు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని? చిన్నపిల్లేగా. తప్పు చేసిందని వదిలేస్తామా? పెద్దవాళ్ళం నయానో, భయానో దారికి తీసుకురావడం మా బాధ్యత."
"ఏం చేస్తాం చెప్పమ్మా! ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తాం?"
"ఆడపిల్లకి రెండే ఇళ్లుంటాయిరా. ఒకటి పుట్టిల్లు, రెండు మెట్టినిల్లు. ఇక్కడ లేదు నీ దగ్గర లేదు. మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండే ఉంటుంది."
"తల్లి దగ్గర ఉన్నావిడ బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసిందమ్మా?"
ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం తోచలేదు - అవును బాబుని ఇక్కడెందుకు వదిలేసింది?
అపుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు.
"ఏం నాన్నా వేణూ! నీ సెలవలు అయిపోయాయి అనుకుంటా."
"అవును నాన్నా..." వేణు స్వరమో వినిపించిన జీర అతని వేదన తెలియజేసింది ఆయనకి.
"బాబు గురించి ఏం నిర్ణయించావు?"
వేణు తల్లివైపు చూశాడు. ఆవిడ మంద్రంగా అంది. "వాడేం ఆలోచిస్తాడండి? బాబుని తీసుకెళ్ళాలని ఉబలాటపడుతున్నాడు. కానీ, ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు."
ఆయన తల పంకిస్తూ అన్నాడు. "అవును ఆడవాళ్ళ సంరక్షణ లేకుండా వాడినెలా చూసుకోగలవు?"
"ఏవండీ....!" తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది.
ఆయన ఆమెవైపు చూశాడు.
"ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం. కోడలికి నచ్చజెప్పి తీసుకొద్దాం."
లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపం వచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ అన్నాడు.
"వెళ్ళడం మన బాధ్యత. అయితే నేనూ, వేణూ వెళ్ళి వస్తే బాగుంటుందేమో!"
ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిందానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది. "అవును, నేను వస్తే బాబునెవరు చూసుకుంటారు? అందుకే మీరిద్దరూ వెళ్ళిరండి."
"నేను రాను నాన్నా....!"
సడన్ గా వేణు స్వరం వినిపించి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"ఏం? ఎంచేత?" ఆయన కొంచెం నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు.
"ఏం లేదు. నేను వద్దనుకుని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేబిరిస్తూ వెళ్ళాలి నాన్నా! నాకు బాబున్నాడు. చాలు వాడిని చూసుకుంటూ నేను బతికేయగలను."
"కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా?"
"దానికి నేను బాధ్యుడిని కాదు నాన్నా!"
"బాధ్యులెవరు? కారణాలేంటి? అవన్నీ తరువాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చేయాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసారజీవితం మీద విరక్తి పెంచుకుందా? మగవాళ్ళంటేనే అసహ్యించుకుంటోందా? లేక నువ్వన్నట్టు స్వేచ్చ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమైతే ఆమెని బతిమాలను. కానీ, బతుకు గురించి తెలియచేయడం మాత్రం నా ధర్మం, నా కర్తవ్యం." వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్ లైటు కింద పురుగుల కోసం తిరుగుతున్న బల్లిని చూస్తూ కూర్చున్నాడు.
"లైటార్పేస్తాను. బల్లులు చేరుతున్నాయి. వెన్నెల ఉందిగా..." అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది.
అప్పటిదాకా ట్యూబ్ లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపు దిద్దుకున్న అద్బుతమైన చిత్రంలా అందంగా ఉంది. పారిజాతం పూలపరిమళం గాలిలో తేలి వస్తోంది. పూలన్నీ నేలన రాలి తివాచీ పరిచినట్టున్నాయి. కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దోబూచులాడుతోంది. ఊరంతా మాటుమణిగింది. అంత నిశ్శబ్దంలో అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడడం వాళ్ళకే చిత్రంగా అనిపిస్తోంది. పది కాకుండానే లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధదంపతులు ఈ రోజు పదకొండు దాటుతున్నా కొడకు కాపురం పట్ల కలతతో నిద్రరాక చింతాక్రాంతులై కూర్చున్నారు.
ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి. ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన.
అయితే, తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించినా, వేణు మనసు మాత్రం ససేమిరా అంటోంది. వెళ్ళినా ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెపుతోంది. కానీ ఆ విషయం తల్లితండ్రులకి చెప్పడం ఇష్టం లేనివాడిలా మౌనంగా ఉండిపోయాడు.
కృష్ణస్వామి స్వరం మరోసారి గంభీరంగా మోగింది. "ఏం వేణూ, రేపు ఉదయం ఫస్ట్ బస్ కి విశాఖ వెడదామా?"
కాదనే శక్తి వేణుకి లేదు. అలాగని వెళ్ళాలన్న ఆసక్తీ లేదు. అందుకే తటస్థంగా తలూపాడు.
మర్నాడు వేణు, కృష్ణస్వామి విశాఖపట్టణం వెళ్ళటానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనలతో దాదాపు జాగారమే చేశారు.
* * * * *
అర్చనకి రోజులు చాలా హాయిగా గడిచిపోతున్నాయి.
స్కూల్లో పిల్లల మధ్య గడుపుతుంటే బాధలన్నీ మర్చిపోయి, ఉల్లాసంగా అనిపిస్తోంది.
స్కూల్లో టీచర్ గా ప్రస్థానం కొనసాగిస్తూ సివిల్స్ కి ప్రిపేర్ అవడం కోసం చాలా పుస్తకాలు కొనుక్కుని వచ్చింది.
