Previous Page Next Page 
అర్చన పేజి 41

    వేణు కూడా పదే పదే అడగసాగాడు. "ఏం అర్చనా! ఇవాళ ఆఫీసుకి వెళ్ళడం లేదా? ఏం ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరకు వెడదామా? ఏంటి ఇవాళ కూడా వెళ్ళవా? ఏమైంది? ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా?" ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం లేదు. చెప్పలేదు. పది రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలిగా కూడా ఉండలేని స్థితి, అసలా ఇంట్లో ఉండడమే కష్టంగా, భారంగా, వేణుకీ తనకీ మధ్య మళ్ళీ పెద్ద అగాధం. ఈ అగాధం ఇంక పూడ్చలేదు. అర్చన మానసిక స్థితి ఆమెకే అర్ధం కావడం లేదు.
    అలాంటి సమయంలోనే వేణు.... సహనం కోల్పోయిన వేణు, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికనూ ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే. కానీ, తన అంగీకారం లేకుండా, తన సహకారం లేకుండా, తన ష్టం లేకుండా తనమీద దౌర్జన్యం చేయడం సహించరానిది, భరించరానిది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైనది. కానీ అర్చన అదేం ఆలోచించలేదు. తనకక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకి స్థానం లేదని మనసులో ఏ మాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరికోసం విశాఖ మొత్తం జల్లెడ పట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా ఎంతో చేరువగా, ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కానీ తను తలెత్తి అతఃడిని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంక అక్కడ ఉండడం క్షేమం కాదు. ఉండలేదు కూడా. అందుకే అర్చన వేణునీ, వేణు ఇచ్చిన జీవితాన్నీ వదిలి బైటకి వచ్చేసింది.


                * * * * *

    అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా అంది "చాలా పొరపాటు చేశావు అర్చనా... చాలా పొరపాటు చేశావు. ఆ  విషయం వేణుతో పంచుకుని, అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది."
    అర్చన కన్నీళ్ళతో చూసింది. "నువ్వు కూడా ఇదే అంటున్నావా నళినీ!"
    "ఎవరైనా ఇలాగే అంటారు అర్చనా! మనదేశంలో కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నది ఆచరించడానికే. అవి ఆచరిస్తే మానవజీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది."
    "అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఓ కట్టెలా నా శరీరం నిత్యం రాత్రిళ్ళు వేణుకి అర్పిస్తూ, అసహ్యంగా కాపురం చేస్తూ, పిల్లల్ని కని వాళ్ళని పెంచి, పెద్దచేసి, చదువులు, పెళ్ళిళ్ళు ఇదేనా నా జీవితం!?"
    "నీదే కాదమ్మా ప్రతి ఆడదాని జీవితం, ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే! ఏం? ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మగవాళ్ళకుండవా? నీకు తెలుసా అర్చనా! మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి నలుగు, బైటకి నాలుగు మామూలు చీరలు కాక, రెండు పట్టుచీరలు ఉండేవి. నాన్నకి ఒక లుంగీ, రెండు ప్యాంట్లు, రెండు షర్టులు. అవి సుమారు ఐదేళ్ళు వాడారు. ఇలాంటివెన్నో నాకు తెలుసు. మా నాన్నలాంటి మధ్యతరగతి తండ్రులెందరో తమ పిల్లలకోసం, కుటుంబం కోసం త్యాగాలు చేశారు, రాజీలు పడ్డారు. ఆఫ్ట్రాల్ ఇది జీవితం అర్చనా! సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మలుపులు ఏర్పడుతుంటాయి. ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అంతా ఒక ప్రయ్నంలా సాగిపోవాలి. నీకు రైలు ప్రయాణంలో నీతోపాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళకోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా! అంతే! అతనెవరో నీకు తెలియదు ప్రేమించావు. ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంటు నుంచి వేణు నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపాల్సింది. ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదు అర్చనా. అయామ్ సారీ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే నీ జీవితం నీ ఇష్టం. కానీ, ఒక శ్రేయోభిలాషిగా చెబుతున్నా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు వచ్చి తీసికెళ్తాడు. తప్పకుండా తీసికెళ్తాడు."
    అర్చన అయోమయంగా చూసింది నళినివైపు. కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేంటి? ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? ఇదేనా జీవితం అంటే! వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటుందా?
    అప్పటికే చీకటి పడింది. బైట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్కులో జనం కూడా లేచి ఇంటిదారి పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియ చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. "అదిగో అర్చనా! నెలపొడుపు. దండం పెట్టుకో. ఈ నెల నుంచీ నీ జీవితంలో మార్పొస్తుంది."
    వింతగా చూసింది అర్చన నళినివైపు. ఆమె చూపులో భావం గమనించిన నళిని అంది. "నెలపొడుపు చూసి, దేవుడిని, నీకిష్టమైన వాళ్ళనీ చూడాలి. నీ చీర చెంగునుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడికిచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది" అంటూ తన చీర చెంగునుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడివైపు విసిరి రెండు చేతులూ జోడించి, దండం పెట్టుకుంది నళిని. అరచేతులు చూసుకుని, తన చేతులు తనే ముద్దుపెట్టుకుని "పద వెడదాం" అంది.
    మౌనంగా ఆమెని అనుసరిస్తూ అనుకుంది అర్చన 'ఎవరి నమ్మకాలు వారివి. ఎవరి జీవితం వారిది."

                                                                                                        * * * * *

    వేణు సెలవు అయిపోయింది. హైదరాబాదు తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి తల్లి దగ్గర చిన్నపిల్లాడిలా మారిపోయాడు.
    "అమ్మా! బాబుని నేను తీసుకెళ్ళిపోనా?" అడిగాడు.
    "నువ్వా?" ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ. "తీసుకెళ్ళి ఏం చేస్తావు? నువ్వు చూడగలవా? వాడి ఆలనా, పాలనా ఎవరు చూస్తారు?
    తన కొడుకుని తనతో తీసుకెళ్ళాలన్న కోరిక ఉండడంలో తప్పు లేకపోవచ్చు కానీ, వాడిని గాలికి వదిలేసి పెద్దవాడిని చేయాలనుకోడం ధర్మం కాదే! గాఢంగా నిట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మిణుకుమంటూ మెరిసినట్టు అనిపించి అన్నాడు "పనిమనిషిని పెట్టుకుంటానమ్మా".
    ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నిట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరవాత అంది "పనిమనిషి మన మనిషి అవుతుందా నాన్నా! వాడికి తఃల్లిలేదు. కానీ, నానమ్మని నేను బతికే ఉన్నాగా?"
    "అమ్మా...!" బాధగా పిలిచాడు. "అలా అనకమ్మా. నేను తట్టుకోలేను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS