నిర్మొహమాటంగా అంది అర్చన "సారీ వేణూ! జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కన వచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు. మనం స్నేహితులం."
వేణు ఉబికివస్తున్న కోపం అదుపు చేసుకుంటూ "నువ్వెప్పటికీ నన్ను భర్తలా చూడలేకపోతే?" అన్నాడు.
అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తరువాత అంది "నీ ఇష్టం వేణూ! నువ్వు వేరే పెళ్ళి చేసుకోడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు."
వేణు నిర్ఘాంతపోయాడు. "వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడడం దేనికి అర్చనా? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువు వదులుకుని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్ళి చేసుకోమని అనేందుకు నీకు నోరెలా వచ్చింది?"
అర్చన మాట్లాడలేదు. 'నేను నిన్ను బలవంతం చేశానా?' అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెబితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్కనుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది.
వేణు ఆవేశంతో వణికిపోయాడు. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. "ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా? ఈమెని బలవంతంగా పెళ్ళిచేసుకుని పొరపాటు చేశానా?" అని ఆలోచిస్తూ చాలసేపాటికి నిద్రపోయాడు.
కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ళ ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా తనదాన్ని చేసుకోవాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు.
అర్చన ఉద్యోగంలో చేరి మూడు నెలలయింది. మాధవి నెల తప్పిన దగ్గరనుంచీ వాళ్ళిద్దరి మద్యా రాకపోకలు ఎక్కువైనాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి "నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలి అర్చనా! నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి" అంటూ ఆట పట్టించేది.
అర్చన పల్చగా నవ్వి "అన్నీ మన చేతుల్లో ఉన్నాయా?" అంటూ దాటేసేది. అయితే ఒక రోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాసు తీసుకుంది. "పిచ్చి వేషాలేయకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో" అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. "వేణు మంచివాడు. అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం" అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నిటికీ చిరునవ్వే సమాదానంగా ఇచ్చింది.
మాధవికి ఏడోనెల వచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ "నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవాలి" అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది.
మాధవి మాటలు, వేణు తనకోసం పడుతున్న తపన, అర్చన ఆలోచనల్లో చిన్న మార్పుని తీసుకొచ్చాయి. అందరన్నట్టు వేణు తనకోసం త్యాగం చేశాడా? మంచివాడు. నిజంగానే మంచివాడు. ఏడాది కావస్తోంది పెళ్ళి అయి. ఇంతవరకూ సహనంతో తన అంగీకారం కోసం చూస్తున్నాడే కనీ, ఏనాడూ హద్దుమీరి ప్రవర్తించలేదు. ఇంక ఎలాగు ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుటపడుతోంది. కళ కలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డామేజీనే ముల్లులా పొడుస్తూనే ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయిన తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తోంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణు మీద అంతులేని కోపం వస్తోంది. కానీ, ఆ కోపాన్ని అణచుకుని శాంతంగా, ప్రశాంతంగా ప్రాక్టికల్ గా ఆలోచించడానికి ప్రయత్నించింది.
ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇకనుంచీ వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ.... ఎంతమాత్రం ఇష్టంలేని పదం. రాజీ.... ఆడదానికి జీవితం అంటే రాజీ... ఈ రాజీ అనేది లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బతికే స్వేచ్చ వచ్చిందాకా ఆడదానికి స్వేచ్చ లేనట్టే! నిట్టూర్చింది.
28వ తారీఖు. రెండు రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి, చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురా ప్రారంభించాలని దారీ తెన్నూ లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీసుకి వెళ్ళిన అర్చన జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీసుకి వెళ్ళేటప్పటికి అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నాట్ట. పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాట్ట అంటూ కొలీగ్స్ చెబుతుంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తానూ కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురుచూసింది.
అతను వచ్చాడు. పొడుగ్గా, చామనఛాయగా, సూదుల్లాంటి చూపులతో గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ పెదాల చాటున అస్పష్టంగా కదుల్తున చిరునవ్వుతో వచ్చాడు. అతడే... అతడే. మొదటి రోజు మాల్ లో. మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్ లో తరచూ కలలో కనిపిస్తూ తన హృదయంలో కల్లోలం సృష్టించిన వ్యక్తి, ఇతనా బాస్! ఆమె కళ్ళ ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు. సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు, ఆకాశం ఫెళఫెళా రావాలతో గర్జిస్తూ పిడుగులు తనమీదే పడుతున్నట్టు, తన సుదీర్ఘమైన జీవితం చిన్న చాపచుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్టురాలై, శిలయై నిలబడిపోయింది.
ఎవరో పరిచయం చేస్తున్నారు. "ఈమె అర్చన. మీ సెక్రటరీ."
అతను కళ్ళల్లో నవ్వుతో, పెదాల మీద హలో అనే రెండక్షరాలతో సూటిగా చూశాడు.
అర్చన ఏమీ మాట్లాడలేదు. నవ్వుదామంటే పెదాలు బిగించుకున్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి. మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లాచెదురైనట్టుగా అయాయి. అదే ఆఖరు ఆఫీసుకి వెళ్ళడం. రిజిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు? కారణం ఏంటి? అంటూ అతను కబురు పంపించాడు. కానీ, ఏం చెప్పలేదు. ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా!
