Previous Page Next Page 
అర్చన పేజి 37

    ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం... ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితంపైన వేణు ఆధిపత్యం సంపాదించడం...చాలా మామూలుగా జరిగిపోయింది.
    వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చనా, వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికల సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికీ కూడా పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ కారకురాలు కాని ఓ ఆడపిల్ల భవిష్యత్తు సంప్రదాయం అనే సంకెళ్ళతో సమాజం అనే బందిఖానాలో నిర్బంధించబడింది.
    ఎంత నిర్దయ! కన్నకూతురికన్నా, కూతురి భావాలకన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం, అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువైనాయి.
    సర్వం కోల్పోయినట్టు అర్చనా, సమస్త ప్రపంచాన్ని గెల్చినట్టు వేణూ అతని తల్లితండ్రుల దీవెనల కోసం అతని ఊరు వెళ్ళారు. కొడుకు ఎవరినో అమ్మాయిని తీసుకుని హఠాత్తుగా వచ్చి, ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్ళు ముందు నిర్ఘాంతపోయారు. తరువాత ఏం చేయాలో తెలియక మాటలు మర్చిపోయి మౌనవిగ్రహాలయ్యారు. తరవాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళనిండా చూసుకున్నారు. అందంగా, మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఇంటిగుమ్మంలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే వాళ్ళ గుండెల్లో పొదుపుకున్న వాళ్ళ ప్రేమా, ఆదరణ మర్చిపోలేనివిగా అనిపించాయి. వారం రోజల పాటు వాళ్ళ ఆప్యాయతా జల్లుల్లో తడిసి హైదరాబాదు బయలుదేరారు.
    గోదావరి ఎక్స్ ప్రెస్ లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడినుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్ధం కాలేదు. మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంతమాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోడం చూస్తుంటే అతన్ని కసిగా పొడిచేయాలనిపిస్తోంది. ఎంత తెలివైనవాడు చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితంపైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు. ఎట్టి పరిస్థిల్లోనూ తను అతని భార్య కాదు. కాలేదు. స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్రపట్టింది.
    
                                                                                                   * * * * *

    అదొక అందమైన పూలతోట. రంగు రంగుల గులాబీలు, నక్షత్రాల్లా రాలిపడుతున్న జాజులు, పూలమొక్కలతో దాగుడుమూతలాడుతున్న గాలికెరటాలు, మేఘాల మీద తేలుతున్న వెన్నెలరేడు. అప్పుడే ఓ అందమైన అమ్మాయి చేతిలో పూలసజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళను దాటి, అరచేతి మందాన ఉన్న పూలజడ, పట్టుపరికిణీ, ఓణీ, పట్టు జాకెట్టు. ఓణీకీ జాకెట్టుకీ మధ్య ఉన్న అందమైన సన్నని నడుము మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడనిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటిరంగు బంగారంతో పోటీ పడుతోంది. ఆ బంగారు బొమ్మ పూలసౌరభాలను గాఢంగా ఆఘ్రాణిస్తూ, పరుగు పరుగున మొక్కల దగ్గరికి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్ళతో నాజూగ్గా ఒక్కొక్క పూవే తెంపి, పూలసజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడినుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దానిమీంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి, ఆమెవైపే అడుగులు వేస్తూ, ఆమె దగ్గరగా వచ్చి, మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూసి, మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలావిగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చేయి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చేయి విరిగింది. తల ఎగిరిపడింది. ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి, మంటలుగా ఎగిసి, ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి.
    ఉలిక్కిపడింది అర్చన రైలు శబ్దం చాలా భయంకరంగా ఉంది. ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉన్నారు. వేణు కూడా ప్రశాంతంగా నిదా పోతున్నాడు. కిటికీలోంచి బైటికి చూసింది. కదిలిపోతున్న విశాలమైన మైదానాలు, చీకట్లో వికటాట్టహాసం చేస్తున్నట్టున్న వృక్షాలు. భయంతో ఒళ్ళంతా చెమట, దాహం గొంతు ఆరిపోయింది. మంచినీళ్ళ బాటిల్ కోసం చూసింది. వేణు తల దగ్గరగా ఉంది. ఆ బాటిల్ తీసుకుని గటగటా తాగేసింది. మూతపెట్టి బాటిల్ పక్కన పెట్టి మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని గువ్వలా ఒదిగి కూర్చుని బైటకి చూడసాగింది.
    ఈ కల ఇంతకు ముందు కూడా వచ్చింది. అతనెవరు? ఎందుకిలా కలలోకి వస్తున్నాడు? ఆ పక్షి ఎవరు? ఈ కల దేనికి సంకేతం? కలలు మనోభావాలకి ప్రతీకలని అంటారు మానసిక విశ్లేషకులు.
    తన మనసులో చాలాకాలంగా కలుగుతున్న భావపరంపరలకి ఇవి సంకేతాలా? అతను... అతను కేవలం కలలో వ్యక్తి కాదు. తనకి తారసపడ్డాడు. ఒకసారి కాదు, చాలాసార్లు, ప్రతిసారీ కళ్ళతోటే మాట్లాడి వెళ్ళిపోయాడు. కానీ, తన మనసులో మాత్రం అలజడి రేపాడు. ఆ అలజడే తనకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ అలజడే తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి రాకుండా చేసింది. ఆ అలజడే తనని పిచ్చిదాన్ని చేసింది. ఎందుకిలా జరుగుతోంది?
    ఏంటి ఆడదాని జీవితం? ఇప్పుడు తను మరొకరి భార్య, ఇష్టంగానో, అయిష్టంగానో తనకి వివాహం అయింది. వివాహితురాలైన తను పరాయి పురుషుడిని కలలో కూడా స్మరించుకోకూడదని కట్టుబాట్లలో ఉంది. కానీ, ఇలా తరచూ కలలో వచ్చి కలవరపెట్టే ఆ వ్యక్తిని ఎలా మర్చిపోవడం? ఇంతకాలం ఎవరికీ, ఆఖరికి ఎన్నోసార్లు తఃరచి తరచి అడిగిన అమలక్కూడా చెప్పని రహస్యం ఈ గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రహస్యం బట్టబయలవుతుందా? రేపట్నించీ తన పక్కన వేణు అనబడే ఒక పురుషుడు హక్కుగా పడుకుంటాడు. తనకిలాంటి కల వచ్చిందని అతనికి తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది. తప్పకుండా తెలుస్తుంది. తను ఊపిరి పీల్చినా అతనికి తెలుస్తుంది. ఇంతకాలం ఈ జీవితం తనది. ఒక్కదానికే స్వంతం. కానీ నేడూ... ఈ తాళి అనబడే ఈ రెండు బంగారు నాణాలు మెడలో పడిన క్షణం నుంచీ ఈ జీవితంతో మరో జీవితం ముడిపైడ్న్ది. తన స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఈ వివాహం అనే తంతుతో శాశ్వతంగా పోగొట్టుకుంది. ఏంటీ ఆడదాని జీవితం! వివాహం అనబడే ఈ తంతుతో తనమీద తనకి హక్కులేని జీవితమా ఆడది కోరుకునేది. ఆఖరికి తనకి వచ్చిన కలను తల్చుకునే స్వేచ్చ కూడా ఉండని ఈ వివాహవ్యవస్థని గౌరవించాల్సిన అవసరం ఉందా? అసలు ఈ పెళ్ళే వద్దనుకున్న తనకి ఈ పెళ్ళేంటి? ఇష్టం లేని వ్యక్తితో ఈ ప్రయాణం ఏంటి? ఇది కేవలం పది గంటల రైలు ప్రయాణం కాదు. జీవితమంతా ఈ వ్యక్తితో కలిసి ప్రయాణించాలి. లేదు లేదు. అలా జరక్కూడదు. తనకీ పెళ్ళి ఇష్టం లేదని, అసలు అతనంటే ఇష్టం లేదని వేణుకి చెప్పాలి. ఎంత చెప్పినా అతను అర్ధం చేసుకోలేదు. ఎందుకింత మొండిగా తనని ఇలా బంధించాడు? ఎలా ఈ బందిఖానాలో నుంచి బైటపడడం? అర్చన వేణువైపు చూసింది. ప్రశాంతంగా, ఒకింత గర్వంగా నిద్రపోతున్నాడు. నిశ్చింతగా నిద్రపోతున్నాడు. అనుకున్నది సాధించానన్న తృప్తితో నిద్రపోతున్నాడు. తన మనసులో జరిగే సంఘర్షణ అతనికి తెలియదు. తెలిసినా అర్ధం కాదు. అర్ధం చేసుకోడానికి ప్రయత్నించడు. అతనంటే ఇష్టం లేదని తెలుసు. కానీ, ఎందుకిష్టం లేదో తెలియదు. ఇప్పుడు తెలిస్తే, తన మనసు పరాధీనమైందని తెలిస్తే, తన మనసులో ఎంతో కాలంగా పేరూ, ఊరూ తెలియని ఒక వ్యక్తి వలపు ప్రభంజనం సృష్టించాడని, ఆ ప్రభంజనంలో పడి తను ఉక్కిరి బిక్కిరి అవుతోందని, పాపానికీ, నీతికీ, ధర్మానికీ నిర్వచనం వెతుక్కుంటూ తిరుగుతోందని వేణుకి తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? వదిలేస్తాడా? వదిలేస్తే ఎంత బాగుంటుంది? కోల్పోయిన స్వేచ్చ తిరిగి పొందచ్చు. కానీ? వేణు వదలడు. వదిలే వాడైతే అసలు పెళ్ళే చేసుకోడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS