అతని భార్యగా బతకాలి. తనకిష్టంలేని ఆ వ్యక్తికి ఈ శరీరాన్ని సమర్పించుకోవాలి. ప్రతిక్షణం అతని సమక్షంలో సంచరించాలి. అతనితో కలిసి భోంచేయాలి. అతనికి వండి పెట్టాలి. సేవలు చేయాలి. ఇవన్నీ తాను చేయలేదు. మనసు చంపుకుని అసలు చేయలేదు. జీవితంలో తను చాలా అసహ్యించుకునే పాదం రాజీ. ఆడదంటే ప్రతిక్షణం, ప్రతి విషయానికీ రాజీపడుతూ బతకడం అని చాలామంది అభిప్రాయం. కానీ, తనకలా ఎంతమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు వేణుతో రాజీపడి బతక్కపోతే ఏం జరుగుతుంది? బతికితే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. అర్చన చచ్చిపోతుంది. మరో అర్చన చీమూ, నెత్తురూ, మనసు, అనుభూతులు లేని అర్చన బతుకుతుంది. వేణు అనే అతని జీవితం అనే ప్రయోగశాలలో రకరకాల పరిశోధనలకు ఉపయోగపడే అస్థిపంజరంలా బతికి ఉంటుంది. ఆ బతుకంటే తనకి అసహ్యం. అలా బతకడం కన్నా చావడం తనకిష్టం. బతుకంటే అందంగా బతకాలి. ఆర్టిస్టిక్ గా బతకాలి. హాయిగా బతకాలి. ఆకాశంలో స్వేచ్చగా ఎగిరే పక్షిలా బతకాలి. నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుని, నచ్చేలా, అతను మెచ్చేలా బతకాలి. ఇంక ఈ జీవితానికి ఆ అవకాశం పోయినట్టేనా? శాశ్వతంగా తాను ప్రేమించే అర్హత కోల్పోయిందా? ఆమెకి తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి.
అతడెవరో, అతని పేరేంటో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని ఎంతో తపించింది. ప్రయత్నించింది కూడా పరీక్షలయాక. ఆ విషయంలో చాలా సీరియస్ గా వర్క్ చేద్దామనుకుంది. కానీ, కానీ మనసే లేని ఓ కసాయి వ్యక్తి ప్రేమించానంటూ వెంటాడి, వేటాడి తన జీవితానందాన్ని శాశ్వతంగా చిదిమేశాడు. అప్పటినుంచి మనసంతా గందరగోళం. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియని అయోమయం. అత్యంత స్వల్పకాలంలో ఎంత భయంకరమైన మార్పు చోటుచేసుకుంది ఈ జీవితంలో. ఇంక ఎప్పటికీ అతడిని కలవలేదు. అర్చనకి ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది.
'పేరైనా అడగలేదు. ఊరైనా అడగలేదు. మనసేమో అతని విడిచి మరలిరాదాయే. మరలి రాదాయే వెతలన్నీ అతనికే వినిపించానెందులకో' నిశ్శబ్దంగా ఏడవసాగింది. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆగని కన్నీళ్ళు జలపాతాలయాయి. చాలాసేపటికి తనని తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుని సన్నగా వెక్కిళ్ళు వస్తుంటే చీరచెంగు అడ్డం పెట్టుకుని ఆ రూపాన్ని కళ్ళముందు తెచ్చుకోడానికి ప్రయత్నించింది.
అతను కనిపించిన మొదటిరోజు గుర్తొచ్చింది.
ఆ రోజు అర్చన, అమల విశాఖపట్నంలో ఉన్న అత్యంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళారు. మర్నాడు అర్చన పుట్టినరోజు. అమల అర్చ్నకి మంచి బహుమతి కొనడానికి తీసుకెళ్ళింది. ఇద్దరూ కళ్ళు చెదిరే కొత్త కొత్త అందమైన రకరకాల బొమ్మల్ని, ఇంటీరియర్ డెకరేషన్ కి పనికివచ్చే అలంకార వస్తువులను చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు.
"అదిగో! ఆ వాటర్ ఫౌంటెన్ తీసుకోనా?" అమల ఆగిపోయి చేత్తో చూపించింది.
అందమైన అమ్మాయి తఃడిసిన ఏకవస్త్రంతో వయ్యారంగా నిలబడి ఉంది. ఆమె చంకలో నీటికుండ కొద్దిగా వంగి ఉంది. ఆ కుండలో నుంచి జారిపడుతున్న నీళ్ళు తిరిగి ఫౌంటెన్ లా చిమ్ముతూ రకరకాల కాంతుల్ని విరజిమ్ముతున్నాయి. ఆమె ఒక సరస్సులో నిలబడినట్టుగా ఎంతో సజీవంగా అందంగా ఉంది.
"చాలా బాగుంది కదా....!" మిల మిల మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆ బొమ్మవైపు నడిచింది.
"ఎంత ఈ ఫౌంటెన్?" సేల్స్ మాన్ ని అడిగింది.
"దానికి రేట్ ట్యాగ్ ఉంది. చూడండి. మీరు చూస్తారా? నేను చూడనా?"
చివ్వున వెనక్కి తిరిగింది అర్చన.
దాదాపు ఆమె భుజాన్ని అనుకుంటూ నిలబడి ఆ బొమ్మవైపే చూస్తున్నాడు ఓ ఆజానుబాహుడు. లేతరంగు నిలువు గీతల షర్టు, నల్లటి ప్యాంటులోకి టక్ చేశాడు. చామనచాయ, అందంగా ఉన్నాడు. అతని పెదాలపైన విరిసీ విర్యని లేత చిరునవ్వు మెరుస్తోంది. కళ్ళు ఎంతో విజ్ఞానదాయకంగా, తేజోవంతంగా ఉన్నాయి. చాలా మంచి హోదా, అంతస్థు ఉన్న వ్యక్తిలా కనిపించాడు.
రెప్ప వేయకుండా తనవైపే చూస్తున్న అర్చనవైపు హఠాత్తుగా చూపులు తిప్పాడు.
ఇద్దరి చూపులూ కలిశాయి. విశాలమైన అతని కళ్ళల్లో లిప్తపాటు మెరుపు కనిపించింది. చిన్నగా, పలకరింపుగా నవ్వాడు.
ఒక్కసారి గుండె ఝల్లుమంది అర్చనకి. చటుక్కున చూపులు తిప్పుకుంది. అప్పటికే అమల ఆ బొమ్మకి ఖరీదు బేరం చేసి, గిఫ్ట్ ప్యాక్ చేయిస్తోంది.
"అలాంటి బొమ్మ మరోటుందా?" అతను అడిగాడు.
"సారీ సార్! అన్నీ ఒక్కొక్క పీస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ కొత్త పీసులు. శాంపిల్ గా వస్తాయి. ఇదిగో ఈ బొమ్మ తీసుకోండి. కొంచెమే తేడా!" అంటూ మరో బొమ్మ చూపించాడు. అందులో అమ్మాయి బదులుగా దేవతా వస్త్రాల్లో ఉన్న స్త్రీమూర్తి ఉంది.
"ఊహూ.... వద్దు పోనీలే" తమాషాగా అర్చనవైపు చూసి అక్కడ్నించి ముందుకు నడిచి వెళ్ళిపోయాడతను.
అతను వెళ్ళినవైపు చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన అర్చన భుజంమ్మీద చేయెసి "పద వెడదాం" అంది అమల.
ఉలికిపడిన అర్చన అయిష్టంగా ఆమెని అనుసరించింది. మౌనంగా, స్వప్నావస్థలో ఉన్నట్టుగా నడుస్తున్న అర్చనని చిత్రంగా చూస్తూ అడిగింది అమల "ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా!"
"అబ్బే ఏ....ఏంలేదు" తడబాటుగా అంది అర్చన.
