Previous Page Next Page 
అర్చన పేజి 36

   అర్చన మ్రాన్పడిపోయింది. ఆమె కాళ్ళకింద నెల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళుతున్నట్టుగా అనిపించసాగింది.
    ఆనందరావు సీరియస్ గా వేణుని అడిగాడు. "వేణూ! అర యూ సీరియస్? మీ వాళ్ళతో మాట్లాడావా?"
    వేణు ఉబికివస్తున్న సంతోషంతో అన్నాడు. "మావాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చనంటే ఇష్టం. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తన కోసమే నేనీ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చనంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే అర్చనకి తోడుగా నేనుంటాను."
    వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ "విన్నావుగా! నీ కూతుర్ని ఒప్పించే భారం నీది" అన్తూవేను చెయ్యి పట్టుకుని బైటకు తీసుకుని వెళ్ళిపోయాడు.
    అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలావిగ్రహంలా నిలబడిపోయింది.
    సావిత్రి ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. "నా మాట వినమ్మా! పరిస్థితి అర్ధమైంది కదా! ఈ పరిస్థితిలోంచి నువ్వు బైటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్దమనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు ఒప్పుకో."
    అర్చన మండిపడుతూ అంది. "చ. ఇడియట్స్ ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోడానికి చూస్తారు ఎంతసేపటికీ. వీడి మొహానికి నేను కావాల్ట చస్తే చేసుకోను."
    "ఏం ఎందుకని?" ఉగ్రురాలైంది సావిత్రమ్మ. "ఎందుకు చేసుకోవు? పెళ్ళి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన పడి ఉంటావు? ఎంతకాలం మా నెత్తిన కూచుంటావు?"
    "అదేంటమ్మా! నేను మీ కూతుర్ని నేను ఎక్కడికి వెళతాను?" ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత అఘాయిత్యం చేస్తోందో అర్ధం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒకటే ఏడుపు... గోల... "అయిపోయింది. పూర్తిగా నాశనం అయింది. దీనికింక పెళ్ళి కాదు. పెళ్ళి కాకపోతే పోనీ కనీసం బాగా చదివించి తన కాళ్ళమీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చట్టుబండలైంది. దేవుడా! ఈ పిల్ల ఏ నక్షత్రాన పుట్టిందిరా నాయనా? దీనివలన నాకిన్ని  కష్టాలెందుకురా?" అంటూ శోకాలు పెడుతోంది....ఇప్పుడిలా అంటూంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది.
    "ఏంటమ్మా? ఏం జరిగిందని? ఏదో జరిగింది. నా శీలం పోయింది. నా పాతివ్రత్యం పోయింది. నేను చెడిపోయాను అనుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లను కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి, వాళ్ళకి శిక్షపడేదాకా పోరాడి, ఆ తరువాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మీమీద తిండికీ, బట్టకీ ఆధారపడి బతుకుతానని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్షపడేలా చేయాలన్నదే నా లక్ష్యం. ఇది అయాక భవిష్యత్తు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను."    
    "ఆ చేశావులే? ఏంటే చేసేది? ఇంకా నువ్వు ఏమీ చేయలేవు. నీకు ఈ సంఘం సంగతి ఏం తెలుసు? ఇప్పటికే.... ఇప్పటికే నీ వల్ల..." ఆవిడ స్వరంలో వణుకు. దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. "దేవుడు పంపినట్టుగా ఇతను వచ్చి, నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు."
    "కాకపోతే పోనీ అమ్మా! పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకలా అస్తమానం నాకు పెళ్ళి కాదేమో, పెళ్ళికాదేమో అని ఆలోచిస్తావు. ఏం ఎందుకు కాదు? నాకేం తక్కువైంది?"
    "ఏం తక్కువైందో, ఏం ఎక్కువైందో అవన్నీ నేనిప్పుడు చెప్పలేనమ్మా. నిన్ను ఇంట్లో పెట్టుకోడం అంటే నెత్తిమీద నిప్పుల కుంపటి పెట్టుకోడం, మేము శాంతిగా, నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకు తీరాలి."
    "ఒప్పుకోను!" అరిచింది అర్చన.
    "ఏం? ఎందుకొప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు."
    "కాదు స్వార్ధపరుడు. ఒక రౌడీవెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకుని, నా జీవితం మీద పెత్తనం సంపాదించడానికి... నా మీద తనకు ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించనందుకు ఈ సంఘటనకి మసిపూడి మారేడుకాయ చేస్తున్నాడు."
    "నువ్వన్నవన్నీ నిజమే. అయినా అతను నిన్ను పెళ్ళిచేసుకుంటాననడం నీ అదృష్టమే దీన్ని కాదనలేవు అంతే."
    "అతను స్వార్ధంతో నన్ను పెళ్ళిచేసుకోడానికి నామీద మీకు ఏదేదో చెబితే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలియదా?"    
    "అర్చనా! ఆడపిల్లలకి ఇంత తెగింపు పనికిరాదు. స్వేచ్చాస్వాతంత్ర్యాలంటూ మీరెంత అరిచినా, ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బతికినంత స్వేచ్చగా, తెగింపుగా ఆడది బతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చనా మా మాట విని, అందివచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందిట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి, ఇంక ఎప్పటికీ రాదుట" ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ.
    అర్చనకి కాళ్ళకింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది. రెండు చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలవిసి పోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు జీవితంతో రాజీపడడమేనా?
    చేయని తప్పుకి, ప్రతి క్షణం కుమిలిపోతూ, ఇష్టం లేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తనమీదే అందరూ కత్తికట్టి బాధపెడుతున్నారు? నాగరాజు, వేణు, వీళ్ళంతా బుద్ధిలేనివాళ్ళు. సిగ్గు, శరంలేనివాళ్ళు. కానీ అమ్మా, నాన్నా, అన్నయ్యా తననే అపరాధిగా చూస్తున్నారేం? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నతస్థానం పొందాలనుకుంది. తప్పా? అందుకు వాళ్ళేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్ళి చేసుకోమంటారేం? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాడిని శిక్షించాలి. తననెందుకు పెళ్ళి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అదికూడా తనకేమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్ళిచేసుకోవాలిట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమా, అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞతా?
    నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్ళే పరిష్కారం అంటూ పెళ్ళి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కని, పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్ళదేనా? తన జీవితం మీదా, తన భవిష్యత్తు మీదా తనకేం హక్కులేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్ ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్ళు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS