Previous Page Next Page 
అర్చన పేజి 26

    "లేకపోతే పోనీరా. రూములో ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. తిందువుగాని, ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా?"
    "నీకంత దురదగా ఉంటే నువ్వు చెయ్యి త్యాగాలు. నాకిలాంటి పిచ్చి పైత్యాలు లేవు. అయామ్ ఏ ప్రాక్టికల్ మాన్" అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి.
    చక్రవర్తి, వేణు ఒకే ఊరువాళ్ళు, ఒకే రూమ్ మేట్స్ కూడా. ఏడో తరగతినుంచీ కలిసి చదువుకుంటున్నారు. వేణుది సున్నితమైన స్వభావం. చక్రవర్తి ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తి. ప్రేమా, గీమా లాంటి పిచ్చివేషాలేయడం అతనికి నచ్చదు. చక్కగా కట్నం తీసుకుని పెద్దవాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్ళిచేసుకోవడమే అతనికిష్టం. కానీ వేణు సంగతి వేరు. వేణుకి అర్చనంటే పిచ్చి, వెర్రి. ఆమె కోసం కైలాసగిరి మీదనుంచి దూకమన్నా దూకడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ విషయం చక్రవర్తికి తెలుసు. అందుకే విసుక్కుంటాడు. ఏంటి పిచ్చి అంటూ. వేణుకి అదేం పట్టదు. ఎవరి పిచ్చి వాళ్ళకానందం అంటాడు.
    వాళ్ళు రూముకి చేరే దారిలోగానీ, చుట్టుపక్కలగానీ ఎక్కడా హోటల్స్ లేవు. మీల్స్ దొరకలేదు. ఉసూరుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి.
    రూముకి చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి, గదిలో ఓ మూలకి గిరాటేసి, కింద పరిచిన పరుపు మీద జారగిలబడుతూ "హోటల్స్ అన్నీ మూసేశారు. ఆకలేస్తోంది. నీ వలన ఈ పూట తిండిలేదు" అన్నాడు.
    "అబ్బా! అగరా ఐదు నిమిషాలు ఓపిక పట్టు. కడుపు నిండా పెడతాను" అంటూ వేణు చొక్కా విప్పి, హాంగర్ కి తగిలించి, కాళ్ళు, చేతులు కడుక్కోడానికి బాత్ రూమ్ వైపు వెళ్ళాడు.
    'ఏంటి పెట్టేది కడుపునిండా' అనుకుంటూ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు. ఆవేళ జరిగిన కార్యక్రమాలన్నీ ఒక్కసారి కళ్ళముందు కదిలాయి. ఎంతైనా అర్చన డైనమిక్ అనుకున్నాడు.
    వేణు కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చి, "పోరా, నువ్వు కూడా ఫ్రెషప్ అయి రా" అన్నాడు.
    "నాకాకలి వేస్తోంది. కడుపులో ఏమన్నా పడితేగానీ లాభం లేదు" అన్నాడు చక్రవర్తి లేవకుండా.
    నువ్వు కాళ్ళు, చేతులు కడుక్కుని వస్తేగానీ ఏమీ పెట్టను అన్నాడు వేణు.
    "అబ్బ! వీడొకడు" విసుక్కుంటూ లేచి బాత్ రూమువైపు వెళ్ళాడు చక్రవర్తి.
    వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు తరిగాడు. ద్రాక్ష పళ్ళు కడిగి, అన్నీ విడిగా తీసి ప్లేటులో సర్దాడు. స్టీలు డబ్బాలో ఉన్న కేకు నాలుగు ముక్కలుగా సర్దాడు. మరమరాల్లో కొంచెం నేతిలో వేయించిన శనగపప్పు, వేరుశనగపప్పులు కలిపి, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి, కొంచెం ఉప్పూ, కారం వేసి అన్నీ కలిపాడు.
    చక్రవర్తి మొహం కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చి, అవన్నీ చూసి "ఏంటిరా! బానే జమ చేశావే తిండి. ఎక్కడివి ఇవన్నీ?" అడిగాడు తిరిగి పరుపుమీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ.
    "అదే మరి వేణంటే ఏంటనుకున్నావు?" గర్వంగా అన్నాడు వేణు.
    "సంతోషించాంలే! ఇంతకీ ఏంటి కథ? ఆ పిల్ల వెంట పడ్డావు?"
    వేణు మాట్లాడలేదు. కేకు తింటూ ఉండిపోయాడు.
    "మాట్లాడవేం? ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే ఇలా ప్రేమ వలలో పడితే మీ అమ్మానాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం."
    వేణు నవ్వాడు. "ఏం ఫర్వాలేదు చక్రవర్తి! నాకులాగే అర్చన కూడా ఐఏఎస్ అవాలనుకుంటోంది. అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మర్చిపోయి, పెళ్ళికోసం తపిస్తాననుకోకు. కానీ, ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే."
    "కానీ తన ప్రవర్తన చూస్తుంటే నీ పట్ల తఃనకలాంటి భావం ఏమీ ఉన్నట్లు లేదే!"
    "కావచ్చు ఉండాలని నేను ఆశించను కూడా. కాకపోతే, చక్రవర్తీ! తెరిచి ఉన్న కవాటాల్లోంచి లోపలికి వెళ్ళడం చాలా ఈజీ కానీ, మూసి ఉన్న కవాటాలను తెరుచుకుని లోపలికెళ్ళడంలో ఒక విధమైన థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా? నేను అందగాడిని కాను. నాకు తెలుసు. అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు. కానీ, పెళ్ళి మాత్రం ఆమెనే చేసుకుంటా. నా ప్రేమతో ఆమె మనసు గెల్చుకుంటా. తన కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తా, తన ఆశయం, నా ఆశయం నెరవేరడానికి నా శాయశక్తులా కృషిచేస్తా."
    ఒక విధమైన ఆవేశంతో చెపుతున్న వేణువైపు ఆసక్తిగా, ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి.
    వీడి ఆవేశం ఎంతవరకూ సక్సెస్ అవుతుంది? అనే ప్రశ్న అతని మెదడులో గిర్రున తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు.
    వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు.

                                                                                         * * * * *
    
    పరీక్షలు పూర్తవగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పరీక్ష హాల్లోంచి బైటికి వచ్చారు అర్చనా, నీలిమా ఇంకా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్ళల్లో వేణు కూడా ఉన్నాడు. అర్చనని చూడగానే వికసించిన మొహంతో ఆమె దగ్గరకు వెళ్ళి "పరీక్షలు బాగా రాశావా అర్చనా? నేను చాలా బాగా రాశాను. ఫస్ట్ క్లాస్ గ్యారంటీ" అన్నాడు.
    అర్చనకి నవ్వొచ్చింది. "గుడ్. కంగ్రాచ్యులేషన్స్" అంది నవ్వుతూ.
    "నువ్వెలా రాశావు? ఆఫ్ కోర్స్  నాకన్నా బాగానే రాసి ఉంటావులే. నీకు యూనివర్శిటీ ఫస్ట్ వస్తుందని నాకు తెలుసు" అన్నాడు.
    నీలిమ తమాషాగా కళ్ళెగరేసి "ఏంటోయ్ వేణూ! పెద్ద జ్యోతిష్యుడిలా మాట్లాడుతున్నావేంటి? అర్చనకేనా? నాకు రాకూడదా యూనివర్శిటీ ఫస్ట్" అంది రెచ్చగొడుతూ.
    "అర్చనకి తప్ప ఇంకెవరికీ వచ్చే అవకాశం లేదులే నీలిమా!" అన్నాడు మొదటిసారిగా ధైర్యంగా, చనువుగా మాట్లాడుతూ అర్చన చిత్రంగా చూసింది అతనివైపు. బెరుకు బెరుగ్గా ముడుచుకుపోతూ ఉండే వేణేనా అనిపించిందామెకి.
    అర్చన చూపుల్లో భావం గమనించినవాడిలా అన్నాడు వేణు. "మనలో కొందరం ఈ ఏడాదినుంచీ విడిపోతాం. వేరు వేరు ఆశయాలతో, అందరూ వారి వారి దారుల్లో నడిచి వెళ్ళిపోతారు. ఇవాళైనా న్ధారం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అందుకే ధైర్యం కూడగట్టుకున్నాను. రండి క్యాంటీన్ కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం" అన్నాడు.
    "ఛీ, చీ క్యాంటీన్ ఏంటి? మంచి హోటల్ కి వెడదాం" అన్నాడు ఇంకో కుర్రాడు.
    ఓ.కే అంటే ఓకే అనుకుంటూ పదిమంది బిలబిల్లాడుతూ కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న హోటల్ కి వెళ్ళారు. వేణు నెమ్మదిగా అర్చన పక్కకి చేరి, "అర్చనా నేను కొంచెం నీతో మాట్లాడాలి" అన్నాడు కొంచెం రహస్యంగా. అర్చన చిత్రంగా చూసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS