Previous Page Next Page 
అర్చన పేజి 27

    "ప్లీజ్..." అభ్యర్ధనగా చూశాడు.
    అర్చన ఏం మట్లాడలేదు. అందరూ కట్ లెట్స్ తిని, కాఫీలు తాగి బైటపడ్డారు. ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వెహికల్స్ మీద బై చెప్పేసి వెళ్ళిపోయారు. నీలిమ బండి మీద లిఫ్ట్ కోసం ఎదురుచూస్తూ నిలబడింది.
    అర్చన మౌనంగా కూర్చున్న వేణుని చూస్తూ అంది. "రా వేణూ, అలా స్కూటర్ పార్క్ చేసిన దగ్గరకు వెడుతూ మాట్లాడుకుందాం" అంటూ పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది.
    "చెప్పు వేణూ! ఇంటి ఏదో మాట్లాడాలన్నావు."
    వేణు పక్కనే ఉన్న ఒక స్కూటర్ మీద పడిన వేపచెట్టు  ఆకుల్ని దులుపుతూ మౌనంగా ఉండిపోయాడు. అర్చన కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం ఎదురుచూసి అంది. "ఆ స్కూటర్ ఎవరిదో వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే. నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పు ముందు. నా కోసం నీలిమ ఎదురుచూస్తోంది."
    వేణు ఆమె మాటల్లోని హాస్యానికి కొద్దిగా నవ్వాడు. అతని గుండెల్లో దడగా ఉంది. సినిమాల్లోలాగానో, కథల్లోలాగానో నిన్ను ప్రేమిస్తున్నా అర్చనా? నువ్వు లేకుండా బతకలేను అంటూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పే చాతుర్యం అతనిలో లేదు. మనసులో ఉన్నది రెండే ముక్కల్లో నిక్కచ్చిగా చెప్పాలనుంది. కానీ, తను చెప్పాక అర్చన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయంగా ఉంది. అలాగని ఆమెకి భయపడి తను చెప్పదల్చుకున్నది చెప్పకుండా ఉండలేడు. అర్చన కొంచెం అసహనంగా కదిలింది. తల వంచుకుని ఆమె పాదాలవైపు చూస్తున్న వేణు కొంచెం ధైర్యంగా, నెమ్మదిగా అన్నాడు.
    "అర్చనా! నువ్వంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా నువ్వు ఐఏయస్ అవాలనుకున్నావు కాబట్టి నీ ఆశయం నెరవేరడానికి నా శాయశక్తులా కృషిచేస్తా. నా సహకారం అందిస్తా. కానీ, కానీ నువ్వు మాత్రం మరొకర్ని పెళ్ళాడొద్దు ప్లీజ్."
    అర్చన సీరియస్ గా చూస్తూ అంది. "ఎవరిని పెళ్ళాడాలో, అసలు పెళ్ళాడాలో వద్దో నిర్ణయించుకోవల్సింది నేను. ఇకపోతే ఐపియస్, ఐఏయస్ అవడానికి నీ సహకారం నాకేం అవసరం లేదు. నీలాగే ఈ రొటీన్ డైలాగ్ చాలామంది చెప్పారు. అందర్నీ నేను పెళ్ళాడలేను కాబట్టి నిన్ను కూడా పెళ్ళాడలేను. ఈ ఆలోచన మానేసి, హాయిగా చదువుకుని, వృద్ధిలోకి రా గుడ్ లక్ బై" చరచరా వెళ్ళిపోతున్న అర్చనని దిగ్భ్రాంతిగా చూస్తూ శిలలా నిలబడిపోయాడు వేణు.
    తనకోసం ఎదురుచూస్తూ తన వెహికల్ దగ్గర నిలబడిన నీలిమ దగ్గరకు వెళ్ళి, బండి స్టార్ట్ చేసి, ఒక్కసారి నిరసనగా వేణు వైపు చూసింది అర్చన. అ చూపు పదునైన చాకులా సూటిగా వేణు గుండెల్లోకి దూసుకెళ్ళింది.
    నువ్వు కూడా నన్ను ప్రేమించే మగాడివా అన్నట్టుంది ఆ చూపు.
    నీ మొహానికి ప్రేమ ఒకటా అని పరిహసించినట్టు ఉందా చూపు.
    వెధవా నువ్వు నన్ను పెళ్ళాడతావా? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి అన్నట్టుగా ఉందా చూపు.
    వేణు అణువణువూ అవమానంతో దహిస్తున్నట్టు అనిపించింది. అయితే అప్పుడే అతని మనసులో ఒక బలమైన నిర్ణయానికి నాంది ఏర్పడింది. 'ఎలాగైనా నిన్ను నేనే పెళ్ళిచేసుకుంటాను అర్చనా! ఇది నా ఛాలెంజ్!' అనుకున్నాడు మనసులోనే. సన్నగా, తెల్లగా సున్నితంగా అనిపించే వేణు మనసు కూడా చాలా సున్నితం. కానీ, నిర్ణయం చాలా కఠినం. అతను ఒక్కడే కొడుకవడం వల్ల అతను కోరుకున్నదేదీ దక్కకుండా సాగలేదు జీవితంలో ఇప్పటిదాకా. అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైన జీవితభాగస్వామి కోరుకున్న అమ్మాయి కాక ఇంకోరు కావడానికి అతని మనసు అంగీకరించడం అసాధ్యం. ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకోడానికి అర్చన మాటలు బాగా దోహదం చేశాయి. నిశ్శబ్దంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
    వేసవి సెలవులు అయాక మళ్ళీ కలవదా? ఎక్కడికెళుతుంది తను? ఈ లోపల ఊరెళ్ళి అమ్మా, నాన్నలకి చెప్పాలి ఈ సంగతి అనుకున్నాడు. వేగంగా రూం వైపు కదిలాడు. అయితే ఊరికి వెళ్ళాడు కానీ, తల్లితండ్రులతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఫలితంగా వేణు తమ ఆశలు నెరవేరుస్తాడన్న నమ్మకం వాళ్ళ మనసుల్లో దృఢంగా పడిపోయింది.
    
                                                                                  * * * * *

    "వేణూ! నీకీ విషయం తెలుసా?" పరీక్షలయాక వేసవి సెలవుల్లో ఊరు వెళ్ళి వచ్చిన వేణుతో అన్నాడు చక్రవర్తి.
    "ఏ విషయం?" స్నానానికి వెళ్ళబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "అదే నీ డ్రీమ్ గర్ల్ అర్చన..." చక్రవర్తి స్వరంలో ఓ విధమైన వెటకారం ధ్వనించింది.
    "ఏమైంది? అర్చనకేమైంది?" నొసలు చిట్లించి ఆత్రుతగా అడిగాడు వేణు.
    "అర్చనని మన కాలేజీ రౌడీలు నాగరాజు, వాడి స్నేహితులు అంతా కలిసి..."
    "ఊ... కలిసి..."
    "అర్చనని కిడ్నాప్ చేసి, రాత్రంతా దాచేశారు" చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ, గడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు.
    "ఏంటి నువ్వు చెప్పేది?" వేణు చేతిలో టవల్ జారిపడింది. ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు.
    "అర్చనని రేప్ చేశారని విన్నాను."
    "చక్రవర్తీ..." వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తనవైపు తిప్పుకుని చొక్కా పట్టుకున్నాడు. "నువ్వు... నువ్వు చెప్పేది నిజమేనా?"
    "నామీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ ని ఎవరినన్నా అడుగు" చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి.
    వేణు చక్రవర్తి చొక్కా వదిలేశాడు. అర్చనని రేప్ చేశారా? ఒక్కసారిగా సర్వనాడులూ శక్తిహీనమై పడినట్టనిపించింది.నో అలా జరక్కూడదు. అర్చనని అంత దారుణంగా రేప్ చేసే ధైర్యం ఎవరికుంది? అర్చన అలా మోసపోదు. ఆ అవకాశమే లేదు. అలా జరగదు జరక్కూడదు.
    చక్రవర్తి చెపుతున్నాడు. "వాళ్ళు టీకి రమ్మన్నారుట. వాళ్ళల్లో ఎవరిదో పుట్టినరోజు అని పిల్చారుట. ఈవిడగారు చాలా అడ్వాన్స్ డ్, బ్రాడ్ మైండెడ్ కదా! వెళ్ళింది. కాఫీలో మత్తుమందు కలిపి ఇచ్చి, ఎత్తుకెళ్ళారు. తెల్లారాక ఆమెని వాళ్ళింట్లో దింపి మరీ వెళ్ళారుట."
    "చక్రవర్తీ ప్లీజ్" చెవులు రెండూ మూసుకుంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు "దయచేసి చెప్పకు. నేను వినలేను. నా వల్ల కాదు.,"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS