"ఏంటే అంత భయమైతే ఎలా?" అంటూ.
"ఏమో తల్లీ! నీ బలవంతం మీద ఎక్కానివాళ స్టేజ్! లేకపోతే ఛస్తే ఎక్కేదాన్ని కాను" చెమటలు తుడుచుకుంటూ అంది.
వేదిక మీద మ్యాజిక్ షో మొదలైంది. నోట్లోంచి రెండు మీటర్ల గుడ్డ తీయడం, అందరూ చూస్తుండగానే బంగారం గొలుసుని పాముగా మార్చడం వగైరా తమాషా చర్యలతో సరదాగా నడిచింది.
ఆ తరువాత అబ్బాయిల వెస్ట్రన్ డ్యాన్స్, వెంట్రిలాక్విజమ్ ఇలా వరసగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి.
కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అర్చనని అభినందించారు.
స్టూడెంట్స్ అంతా అర్చనకి థ్యాంక్స్ చెప్పి, ఇళ్ళ దారి పట్టారు, అందర్నీ పంపించి, వాచ్ మన్ కి అన్నీ అప్పచెప్పి, అర్చన వెహికల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి పధైంది.
"బాగా లేట్ అయింది అర్చనా. మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్లున్నారు. మనిద్దరం వెళ్ళగలమా ఈ టైంలో" భయంగా అడిగింది అమల.
"ఏం? ఎందుకెళ్ళలేము?" బండి స్టార్ట్ చేస్తూ అడిగింది అర్చన.
"ఏమో బాబూ! నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం. అందరూ వెళ్ళేదాకా ఉండాల్సి వచ్చింది. అయినా ప్రిన్సిపాల్ గారు కూడా భాధ్యతంతా మనమీద పెట్టటం ఏంటి? ఇంతమంది మగపిల్లలుంటే!"
"ఏంటీ నీ నస? రా కూర్చో" విసుక్కుంది అర్చన. అర్చనకి అమల పిరికితనం చూస్తే చిరాకు. ఆడపిల్లలు డైనమిక్ గా ఉండాలి. ఈ పని చేయను, ఆ పని చేయను, అక్కడి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను అని అనకూడదు అంటుంది. అమల ఒట్టి పిరికిది.
అమల అర్చన వెనకాల బండి మీద ఎక్కి కూర్చుంది బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ.
అర్చన బండి బయలుదేరుతుంటే హడావిడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి.
"అర్చనా పది దాటింది. మేము మీ ఇంటిదాకా తోడు వస్తాం" అన్నాడు.
అర్చన ఆశ్చర్యంగా చూసింది. "మీరింకా వెళ్ళలేదా?"
"లేదు. మీరు వెళ్ళకుండా మేమెలా వెళతాం? ఆడపిల్లలు ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు."
"ఎందుకు? ఫర్వాలేదు, మేము వెళ్ళగలం" అంది అర్చన.
అమల మెల్లిగా అంది. "రానీవే కాస్త మగపిల్లలు తోడుంటారు. వద్దంటావేంటి?" అర్చన అమలవైపు చూసింది. తిరిగి వేణుని చూస్తూ మా గురించి వీళ్ళకెందుకింత ఆదుర్దా అనుకుంటూ "ఏం ఫర్వాలేదు. మీరు వెళ్ళండి. మాకేం భయం లేదు" అంది బండి స్టార్ట్ చేస్తూ.
అమలకి ఒళ్ళు మండిపోయింది. ఏంటి దీని ధైర్యం? వాళ్ళంతట వాళ్ళు వస్తానంటే వద్దంటుందేం?
"మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళుతుంటే మాకు భయం మాకేం ఫర్వాలేదు వస్తాం" అన్నాడు వేణు.
అర్చన కొంచెం విసుగ్గా చూసింది. "ఏంటి వేణూ! నీ చాదస్తం. అయినా నేను బండిమీద కదా వెళుతున్నాను. నువ్వెలా వస్తావు?"
"మీరు ఇప్పుడు ఒంటరిగా వెళితే వాడు రాత్రికి నిద్రపోడు. మేము మీ వెనకాల జస్ట్ బండిమీద ఫాలో అవుతాం. మీరు గేటులోకి వెళ్ళిపోగానే వెనక్కి వెడతాం" అన్నాడు చక్రవర్తి.
అమల గబగబా అంది "రండి, రండి, అర్చన అలాగే అంటుంది."
అర్చన కోపంగా అమలవైపు చూసి మీ ఖర్మ అనుకుంటూ "సరే రండి" అంది.
ముందు అర్చన, అమల కూర్చున్న బండి, తరువాత చక్రవర్తి, వేణు కూర్చున్న బండి ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి.
రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యం అయిపోయాయి. మెయిన్ రోడ్స్ మీద కార్లు, బస్సులు, స్కూటర్లు తిరుగుతున్నాయి. రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తున్న కెనైటిక్ హోండా రివ్వున వెళుతోంది. గాలికి ఆమె కట్టుకున్న షిఫాన్ చీర కుచ్చిళ్ళు చిందరవందరగా చిందులేస్తున్నాయి. వేణు చక్రవర్తి భుజం మీదగా అర్చనని చూడడానికి తల అటూ ఇటూ తిప్పుతుంటే "అరేయ్ సరిగ్గా కూర్చో" అంటూ కసురుకున్నాడు చక్రవర్తి.
వేణు సర్దుకుని కూర్చున్నాడు. రెండు బళ్ళు అర్చన ఇంటి గేటు ముందు ఆగాయి.
అమల ముందు దిగింది. అర్చన కూడా దిగి, హ్యాండిల్స్ పట్టుకుని వెనక్కి తిరిగి, చక్రవర్తి వైపు చూస్తూ "థాంక్యూ.... గుడ్ నైట్!" అంది.
చక్రవర్తి చిరునవ్వుతో "మోస్ట్ వల్ కమ్" అంటూ తన మోటార్ బైక్ ని రివర్స్ చేశాడు. ఆ రివర్స్ చేయడంలో వేణు అర్చన వైపుకి తిరిగాడు. ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు. అర్చనకి చిరాకేసినా తమాయించుకుని. గుడ్ నైట్ అని తన కైనెటిక్ హోండాని అమల గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకుని వెళ్ళింది.
"ఇప్పుడు మనం డిన్నర్ చేయాలి" అన్నాడు చక్రవర్తి.
"అవును పద. ఏదన్నా హోటల్ కి వెడదాం" అన్నాడు వేణు.
"హోటల్ కాకపోతే మనకిప్పుడు ఎవరు వండి వారుస్తారు?" అన్నాడు చక్రవర్తి. బండి స్లో చేసి, దారిలో ఏ హోటల్ కనిపిస్తుందా అని పరిశీలిస్తూ.
కానీ, ఆ సమయంలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒకటి, రెండు చోట్ల ఆపి, "మీల్స్ ఉందా?" అని అడిగితే లేదన్నారు. చక్రవర్తి కి ఆకలేస్తోంది. వేణు మీద విరుచుకుపడ్డాడు. "నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తోంది. వద్దంటే వినకుండా ఆవిడకి బాడీ గార్డులా బయలుదేరావు.
"అబ్బా! విసుక్కోకు. ఎక్కడోక్కడ దొరుకుతుంది. పద ముందు. ఇంకా ఏమన్నా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం" అన్నాడు వేణు.
"నా మొహం ఉంటాయి. మెయిన్ రోడ్ లో లేనివి ఎక్కడో మూల ఉంటాయా? ఒకవేళ ఉన్నా, ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ వెళ్తానా?"
