"ఏమన్నా విశేషాలున్నాయా?" అడిగాడు కృష్ణస్వామి భార్యని.
ఆవిడకి ఆ ప్రశ్నలో అర్ధం తెలుసు. బాబు విషయంలో ఎవరన్నా, ఏదన్నా అడిగారా? ఏమన్నా విమర్శలు, ప్రశ్నలు వచ్చాయా అని. "లేదు. ఏమీ లేవు" అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఆయన సన్నగా నిట్టూర్చి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు.
* * * * *
అర్చన, నళిని సాయంత్రం చల్లగాలికి పార్క్ వైపు నడుస్తూ వెళ్తుండగా అడిగింది నళిని. "ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చనా!"
అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది "చెప్తాను లోపలికెళ్ళి కూర్చున్నాక చెప్తాను." ఇద్దరూ లోపలికెళ్ళి సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు. నళిని అర్చనవైపు చూసింది.
ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుంచీ అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో, పాటల్లో, వక్త్రుత్వ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ కి సర్టిఫికెట్లు ఇవ్వడం, ప్రత్యేకంగా ఆ రోజున డ్యాన్సు, సంగీతం లాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళచేత మంచి కార్యక్రమాలు చేయడం... కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తోన్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైనది అయిన అర్చన అన్ని విషయాల్లో ముందుండడంతో, లెక్చరర్స్ దగ్గరినుంచీ, స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడర్ గా పరిగణించి ఈ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకి అర్చనని సెక్రటరీ చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది.
స్టూడెంట్స్ అందర్నీ నెల క్రితం సమావేశపరిచి ఏ ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు తమ ప్రతిభ చూపించుకోడానికి. అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి పదిహేను రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరో కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటుంది. అంతకు తప్ప సంగీతం, నాట్యం ఇతర కళల గురించి పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే వాటిపట్ల అభిరుచి మాత్రం ఉంది. సంగీతం వినడం, నాట్యం చూడడం, ఆస్వాదించడం ఆమెకి చాలా ఇష్టం. అందుకే ఈసారి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, నాట్యం ఉండేలా ఏర్పాట్లు చేసింది.
అమలకి సంగీతం వచ్చు. కానీ, ఆ పిల్లకి స్టేజి ఫియర్. పేరంటాల్లో పాడడం, లేదంటే రేడియోలో అప్పుడప్పుడూ పాడి, పాతికో పరకో తెచ్చుకోవడం తప్ప వేదిక ఎక్కి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలని వేదిక ఎక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతోంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నేర్చుకుంటోంది ఆమె నాట్య ప్రదర్శన. కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తోంది. వీళ్ళు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డ్యాన్సు చేస్తున్నారు. కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ ని పిలిచారు. కలెక్టర్ ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకి వచ్చి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం నాలుగింటికే వచ్చేసింది.
కాలేజీ ఆవరణలో బండి ఆపగానే విద్యార్ధులంతా ఆమెని చుట్టుముట్టారు. కాస్సేపు అంతా గోలగోలగా అయింది.
"అర్చనా ఇలారా, అర్చనా నా ప్రోగ్రాం ఎన్నింటికి, డ్యాన్సు తరవాతనా, ముందా? అర్చనా నా మిమిక్రీ ఒక్కసారి చూడకూడదూ!' ఇలా అందరూ కలగాపులగంగా మాట్లాడుతూ ఆమెకి ఊపిరి సలపకుండా చేశారు. అందరినీ తప్పించుకుని, లోపలికి వెళ్ళబోతున్న అర్చన దగ్గరకు వచ్చి అడిగాడు వేణు.
"అర్చనా! నేనేమన్నా సాయం చేయాలా నీకు?"
అర్చన వేణువైపు చూసింది. ఎప్పుడూ పుస్తకాల్లో మునిగిపోయి, మధ్య మధ్య తనవైపు దొంగచూపులు చూస్తూ, బెరుకుగా ఉండే వేణు కళ్ళల్లో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకి నవ్వొస్తుంది. తెల్లగా, బక్కపల్చగా, ఆడపిల్లలా ఉండే వేణు, ఒక్క చక్రవర్తితో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. కానీ, అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెని ఎప్పుడూ ఆరాధనగా చూస్తూ ఉంటాడు.
అర్చన క్లాసెస్ కి అటెండ్ అవని రోజున ఏదన్నా నోట్సు కావాలా అని అడగడం, నిన్న కాలేజీకి రాలేదేం అంటూ బెంగగా అడగడం, లంచ్ అవర్ లో ఆమె తింటోందో లేదో అని చూసిగాని, బాక్స్ మూత తీయకపోదాం ఇలాంటి వన్నీ చూస్తుంటే అర్చనకి వేణు అంటే తమాషాగా అనిపిస్తుంటుంది.
ఎందుకితనికి నేనంటే ఇంత శ్రద్ధ. ఎవరితో మాట్లాడనీవాడు నాతో ఎందుకు మాట్లాడతాడు? అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ సరదాగా ఆటపట్టిస్తూ ఉంటుంది. 'నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణూ! నూట పదహారు డిగ్రీలుంటుందేమో టెంపరేచర్' అని బిక్కమొహం పెట్టగానే, వేణు తెల్లటి మొహం గాభరాతో ఎర్రగా అయిపోతుంది.
'మరి డాక్టర్ దగ్గరకు వెళ్ళావా? ఏమన్నారు? మందులేసుకుంటున్నావా?' వగైరా ప్రశ్నలతో హడావుడీ పడుతుంటాడు.
"నిజంగా నువ్వు చాలా మంచివాడివి వేణూ! నాకు నోట్స్ నువ్వు తప్ప ఎవరూ ఇవ్వరు" అంటూ చిలిపిగా నవ్వుతుంది. ఆమె మాటల్లో కొంటెదనాన్ని, వ్యంగ్యాన్ని అర్ధం చేసుకోడో, లేక అర్ధం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు.
ఎప్పటిలాగే ఇప్పుడూ నవ్వుతూ అంది అర్చన "నువ్వేం చేయద్దులే గానీ, మధ్య మధ్య నాకు కాస్త బిస్కెట్లు, టీలు అందిస్తూ ఉండు చాలు."
వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినవైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు! ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే గానీ, ఏం చేయడానిక్కూడా సిద్దపడతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్నా వేణు బిస్కెట్ పాకెట్ తో, టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాకా ప్రతి అరగంటకీ ప్రత్యక్షం కాసాగాడు.
పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.
కార్యక్రమాలు మొదలైనాయి. మేయర్ గారు, కలెక్టరుగారు వచ్చారు. చక్కటి పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఆహ్వానం పలికారు అమ్మాయిలు నలుగురు కలిసి.
మొదట గణపతి స్తోత్రంతో కూచిపూడి డ్యాన్స్ మొదలుపెట్టింది ఒక అమ్మాయి.
ఆ తరువాత అమల పాటలు రెండు అన్నమాచార్య కీర్తనలు పాడింది ఎవరినీ చూడకుండా కళ్ళు మూసుకుని, మైకు ముందు నిలుచుని కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు వాడు, బ్రహ్మ కడిగిన పాదము పాడి, ఇవతలకి వచ్చిన అమల మొహంలో చెమటలు చూసి పకపకా నవ్వింది అర్చన.
