Previous Page Next Page 
అర్చన పేజి 23

    కెవ్వున అరిచి లేచి కూర్చుంది అర్చన. కిటికీలోంచి అవతల పక్క పెరట్లో ఉన్న నూరు వరహాలు కిటికీ వైపు వంగి తొంగిచూస్తోంది. దాహంతో గొంతు తడారినట్లైంది.
    ఇదే కల చాలా కాలమైంది. మళ్ళీ ఇన్నేళ్ళకు ఇదే కల రావడం. ఎందుకిలా? ఈ కల ఎంతకాలం ఇలా వెంటాడుతుంది?    
    ఒళ్ళంతా చెమటతో నిండిపోగా, కాళ్ళమీదున్న దుప్పటి తొలగించి లేచి, టేబుల్ మీద ఉన్న చిన్న కూజాలో నీళ్ళు గ్లాసులోకి వంపుకుని తాగింది.
    ఆమెకేం అర్ధం కాలేదు. ఇదే కల! ఈ కలే ఇదివరకూ వచ్చింది. సరిగ్గా ఇలాగె అతను తన చెయ్యి అందుకోడానికి ప్రయత్నించడం, ఆ భయంకరమైన పక్షి ఆ చేతి మీదనుంచి ఎగరడం, తన చెయ్యి విరిగిపోవడం. అర్చనకి భయంతో ముచ్చెమటలు పోశాయి. భగవంతుడా ఏవిటీ కల? నన్నెందుకిలా ఈ కల వెంటాడుతోంది? అతన్నెక్కడో చూసినట్లు అనిపిస్తోంది.
    ఎవరతను? ఎవరతను? అస్పష్టంగా ఉన్న రూపం, కానీ అతని నవ్వు మాత్రం చాలా స్పష్టంగా, ఎంతో మనోహరంగా ఉంది. ఆ నవ్వు చాలా పరిచితమైన నవ్వు. ఎవరతను? ఎస్. అతనే అవును ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అతనే! ఎందుకిలా జరుగుతోంది. ఎందుకో ఆ పక్షి మాత్రం ఖచ్చితంగా వేణూనే అనిపిస్తోంది. వేణు ఎందుకు తన దృష్టికి ఎప్పుడూ దుర్మార్గుడిలా కనిపిస్తాడో ఆమెకి అర్ధం కాదు. నిజానికి వేణు దుర్మార్గుడు కాదు. కానీ, తన బలహీనతని క్యాష్ చేసుకున్న స్వార్ధపరుడు, అవకాశవాది అని ఆమె విశ్వాసం.
    అర్చనకి తన మనసులో ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. నెమ్మదిగా లేచి తలుపు తీసుకుని బైటకి వచ్చింది,
    నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలను, చీకట్లో మౌనంగా ఉన్న చెట్లను చూస్తూ నిలబడింది. పెరట్లో విచ్చుకున్న జాజులు, తెల్లగన్నేరు పూలు గాలికి పెరడంతా రాలి ఉన్నాయి. చీకట్లో చూస్తూంటే తెల్లటి పూలున్న నల్లతివాచీలా అనిపిస్తోంది. మంచి సువాసన వీస్తోంది. రకరకాల పూలసౌరభాలు. కొద్దిగా సేద తీరినట్టు అనిపించింది. కానీ, ఎందుకో చీకటిని చూస్తుంటే భయం వేస్తోంది.
    తనిలా చీకట్లో ఇక్కడ నిలబడడం ఇంటి ఓనరు పూర్ణమ్మగారు చూస్తే ఏమనుకుంటుందో? అనేక అనుమానాలు, భయాలు ముప్పిరిగా ఆవరించగా గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుని, మంచం మీద వాలింది. కానీ, కళ్ళు మూతలు పడలేదు.
    ఎప్పుడో తెలతెలవారుతుండగా నిద్రపట్టింది.
    
                                                                                      * * * * *

    తనని చూడగానే కన్నీళ్ళతో వచ్చి దగ్గరగా తీసుకున్న తల్లి భుజమ్మీద తలాన్చి ఏడ్చేశాడు వేణు. ఆవిడ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసి తట్టుకోలేని కృష్ణస్వామి లోపలికి వెళ్ళిపోయాడు. నీలవేణి అప్పుడే బాబుకి నీళ్ళు పోసినట్టుంది. కాళ్ళమీద పడుకోబెట్టుకుని పౌడర్ రాస్తోంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనేస్తోంది. అది పౌడర్ సువాసనతో కలిసి తమాషాగా ఉంది. ఆయన సూట్ కేసు పక్కన పెట్టి నేరుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు స్నానానికి.
    వేణు కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగాడు "బాబు ఎక్కడమ్మా? నా బాబు ఎక్కడ?"
    ఆవిడ దుఃఖం అణచుకుంటూ చెంగుతో కళ్ళు తుడుచుకుని "దా నాన్నా లోపలికి" అంటూ పెద్ద గడప దాటి లోపలికి నడిచింది.
    ఆవిడని అనుసరించిన వేణు నీలవేణి కాళ్ళమీద ఉన్న బాబుని చూస్తూనే కొంచెం వేగంగా ముందుకి నడిచాడు. అప్పటికే జుబ్బా తొడిగిన నీలవేణి చటుక్కున బాబుని భుజమ్మీద వేసుకుని లేచి తాయారమ్మ చేతికిచ్సింది. ఆవిడ బాబుని ఒక్కసారి గుండెలకు హత్తుకుని వేణు చేతులకిచ్చింది. నీలవేణి నిశ్శబ్దంగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.
    వేణు జాగ్రత్తగా బాబుని రెండు చేతుల్లో పట్టుకుని తదేకంగా చూడసాగాడు. అర్చన పోలికలు కనిపిస్తాయేమోనన్నట్టు ఆత్రంగా అతని కళ్ళు బాబుని వెదకసాగాయి. తెల్లగా, బొద్దుగా, నల్లని ఉంగరాల జుట్టుతో ముద్దుగా ఉన్నాడు. సాంబ్రాణి, పౌడర్ వాసన కలగాపులగంగా వస్తోంది. "అమ్మా! వీడు నా కొడుకు" అన్నాడు ఉద్వేగంగా వేణు.
    ఆవిడ అవునన్నట్టుగా తలూపింది.
    వేణుని చూస్తుంటే ఆవిడకి దుఃఖం ఆగడం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేణు ద్వారా అసలేం జరిగిందో తెలుసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని, కోడల్ని ఇంటికి తీసుకురావాలని ఆవిడ తహతహలాడుతోంది. కానీ అతను రాగానే ఆ విషయాలు గుర్తుచేసి, అతనుపడే వేదన చూసే ధైర్యం ఆమెకి లేదు. అందుకే విషయం దాటేస్తూ నెమ్మదిగా అంది. "స్నానం చేసిరా నాన్నా! వేడిగా ఇడ్లీ చేశాను. తిందువుగాని. బాబు పడుకున్నాడు కదా, లేచాక ఎత్తుకుందువులే."
    వేణుకి వాడిని దింపాలని లేదు. అలా గుండెలకానించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది. వాడు తన కొడుకు అనుకుంటుంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తోంది.
    "ఇలా ఇవ్వు నాన్నా!" ఆవిడ చేయి చాపింది.
    "నేను పడుకోబెడతానమ్మా!"
    "తీసుకురా" అంటూ ఆవిడ పడకగదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల. అది తనదే! వేణుకి అర్ధమైంది. ఇన్నేళ్ళూ అటక మీద ఉన్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందికి దించింది తాయారమ్మ.
    "ఇది నాదే కదమ్మా!" బాబుని మెత్తటి పక్కమీద పడుకోబెట్టి ఉయ్యాల ముట్టుకుంటూ అన్నాడు.
    "అవును నాన్నా! నీ తరవాత ఎవరూ ఊగలేదు. మళ్ళీ నీ కొడుకే" అందావిడ బాబు మీద పల్చటి బట్ట కప్పి, ఫ్యాను ఒకటో నెంబరులో వేసింది. "పద స్నానం చేసిరా" అంటూ వేణు భుజంమీద చేయేసి గదిలోంచి బైటకి తీసుకెళ్ళి తలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించి వస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లి అందించిన కొత్త టవల్, మైసూర్ శాండల్ సోపు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు,
    వేణు స్నానం చేసి వచ్చేసరికి వేడి వేడి ఇడ్లీ, కారప్పొడి, కొబ్బరి పచ్చడి ఇంట్లో కాచిన నెయ్యి వాసన వేస్తోంది. తండ్రీ, కొడుకులిద్దరికీ పెద్ద స్టీలు ప్లేట్లలో పెట్టి, నేతిగిన్నె పట్టుకుని నిలబడింది తాయారమ్మ. దూదుల్లా ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ 'ఎంతకాలమైంది అమ్మ చేతి వంట తిని?' అనుకున్నాడు వేణు. తాయారమ్మ వేణు ప్లేటులో ఉన్న కారప్పొడి కొద్దిగా కదిపి వేలితో గుంటలా చేసి, నెయ్యి వేసింది. "చాలమ్మా చాలు" కంగారుగా చేయి అడ్డం పెట్టుకోబోయాడు వేణు. "తిను నాన్నా" అంటూ కారప్పొడి నేయితో తడిపి, గిన్నె తీసుకుని కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది తాయారమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS