Previous Page Next Page 
అర్చన పేజి 22

    చటుక్కున లేచింది. అర్చన. లేచి వెళ్ళి కిటికీలో కూర్చుంది. "టీ తాగుతారా?" మళ్ళీ అడిగింది.
    "వద్దమ్మా నాకలవాటు లేదు. అవునూ మీ వారు ఎప్పుడు వస్తారు?"
    అర్చన గుండె గుభేలుమంది. ఇల్లు తీసుకునే ముందు "ఆయన ఊళ్ళో లేరండి" అని చెప్పింది. ఇప్ప్దుడేమని చెప్పాలి?
    విధవరాలైన పూర్ణమ్మగారి అయిదు గదుల ఇంట్లో. ఒకటిన్నర గది అద్దెకు దొరికింది. ఆ ఇంట్లో పూర్ణమ్మగారు ఒక్కతే ఉంటోంది. ఆవిడ వయసు అరవై ఐదు ఏళ్ళుంటాయి. పిల్లలు లేరు. భర్త పోయాడు. ఒక్క మనవడు ఆవిడ దగ్గరుండి చదువుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు రాఘవ. అతని తల్లీ, తండ్రీ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. ఆవిడ మంచీ చెడూ రాఘవే చూసుకుంటాడు. ఆవిడకా ఇల్లు భర్త తదనంతరం చెందిన మావగారి ఆస్తిలో భాగం. ఆయనకున్న రెండిళ్ళు, ఇద్దరు కొడుకులకీ చెరొకటీ రాసిచ్చాడు. పెద్ద కొడుకు పూర్ణమ్మగారి భర్త లక్ష్మీనారాయణ. ఆ దంపతులకి పిల్లలు లేకపోవడంతో తోటికోడలు కొడుకు, రాఘవ తండ్రి అయిన శేఖరాన్ని చిన్నప్పటినుంచీ చేరదీశారు. అతడిని బాగా చదివించి, ఉద్యోగస్తురాలైన అమ్మాయిని చూసి పెళ్ళి చేశారు. వాళ్ళకి ఒక కూతురు, కొడుకు కొడుకు రాఘవ. పూర్ణమ్మగారు హైదరాబాదులో ఇమడలేదని కొడుకుని ఆవిడ దగ్గరే ఉంచారు. పూర్ణమ్మగారో భర్త ఏమీ సంపాదించలేదు.
    మామగారిచ్చిన ఆ ఇంట్లో రెండు పోర్షన్లు అద్దెకిచ్చి ఆ అద్దెతో గడిపేస్తుంది. రాఘవ చదువు ఖర్చు అతని తండ్రే చూసుకుంటాడు. ఇంటికి నాలుగువైపులా ఖాళీ స్థలం ఉండడంతో పూలమొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు వేసుకుంది. వాటి సంరక్షణా, దైవధ్యానం వీటితో ఆవిడ సమయాన్ని గడిపేస్తుంటుంది.
    అర్చన వంటరిగా, కేవలం ఒక సూట్ కేసుతో వచ్చి, ఆశ్రయం కోరితే, ఆమె ఎవరో ముక్కూ, మొహం తెలియకపోయినా ఒంటరి ఆడపిల్ల, ఏదో కష్టంలో ఉంది అనే సదుద్దేశంతో ఆదుకుని, ఇంట్లో ఒక గది ఇచ్చింది. ఆ ఒక్క గదీ చాలా విశాలంగా ఉంది. ఒక చిన్న క్లోజ్ డ్ వరండా. చుట్టూ చెట్లు, రకరకాల మొక్కలు. ధారాళంగా గాలీ, వెలుతురూ. చాలా హాయిగా ఉంది. కానీ మట్టిగోడల బాత్ రూం, ఫ్లష్ అవుట్ లేని టాయ్ లెట్ కొంచెం ఇబ్బందిగా అనిపించాయి అర్చనకి. అయినా, ఇనప్పెట్టెలో ఉన్నంత భద్రంగా ఉన్న ఆ గది ఆమెకి కొంత నిశ్చింతనీ, హాయినీ కలిగించడంతో మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు.
    ఆమె పూర్ణమ్మగారి నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఆశించలేదు. అర్చనతో ఆ ఇంటికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చక చెప్పింది నళిని. "మీ అయన ఏడీ అని అడిగితే ఊరికెళ్ళారు అని చెప్పు పూర్ణమ్మగారితో" అని.
    అబద్ధం చెప్పడానికి అర్చన మనస్సు అంగీకరించలేదు. "ఇవాళ కాకపోతే రేపైనా ఆవిడకి నిజం తెలుస్తుందేమో!" అంది సందేహంగా.
    "రెండు రోజులు పోయాక చెపుతాను. పెద్దావిడ కదా! నీమీద చెడ్డ అభిప్రాయం లేకపోయినా ఒంటరి ఆడపిల్లవని నీకు ఇల్లివ్వడానికి సందేహించచ్చు. అందుకే చిన్న అబద్ధంతో ఆపద దాటావంటే నీకు కావలసినంత కాలం ఇక్కడ సేఫ్ గా ఉండచ్చు" అంది నళిని.
    ఆ మాట నచ్చింది అర్చనకి. అందుకే అడ్వాన్స్ ఇచ్చి కొద్ది సామానుతో రాగానే పూర్ణమ్మగారి ధాటిని ఓపికగా తట్టుకోగలిగింది.
    "ఏంటమ్మా? ఇంత కొంచెం సామానేనా? మంచాలు లేవా? అదేంటి పాత ఇంట్లోంచి సామానేం తెచ్చుకోలేదా? మీ ఆయన ఊరెళ్ళాట్టగా... ఎప్పుడొస్తాడు? నువ్వు ఆఫీసునుంచి ఎన్నింటికి వస్తావు?" ఇలాంటి అనేక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి, ఆవిడని పంపించి గదిలోకి వచ్చి తలుపేసుకుంది.
    కానీ, ఇప్పుడు మళ్ళీ ఆవిడ అదే ప్రశ్న వేసింది. అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది. "వస్తారండి. ఆయన పని అయిపోయాక వస్తారు. ఆఫీసు పనిమీద బొంబాయి వెళ్ళారు."
    "అలాగా జాగ్రత్తగా ఉండమ్మా అసలే రోజులు బాగాలేవు. నేనున్నాననుకో. ఏం భయం లేదు. ఏదన్నా కావాలంటే మా కుర్రాడు రాఘవని పిలువు. సరే మరి చూడు. దొడ్లో కూరగాయలున్నాయి. ఏం కావాలన్నా తీసుకో. సరేనా?"
    అర్చన కృతజ్ఞత గా తలూపింది.
    "వస్తానమ్మా" ఆవిడ వెళ్ళిపోయింది.
    పాపం ఎంత అమాయకురాలు? ఎంత మంచితనం! హేమలత దయవలన నళినితో, నళిని దయవల్ల ఈ ఇంట్లో పూర్ణమ్మగారితో, ఇదంతా ఆ భగవంతుడు చేస్తున్న సహాయం. ఒంటరిని చేసినా ఎంత మంచి ఆత్మీయుల్ని ప్రసాదించాడు. కరుణామయుడు. నిట్టూర్చింది. కాస్సేపు పడుకోవాలనిపించింది. మెల్లిగా ఒక టీవీ కొనుక్కుంటే కాస్త కాలక్షేపం అవుతుంది.
    నెమ్మదిగా కిటికీ దిగి, ఖాళీ టీ కప్పు తీసుకుని కిచెన్ లో సింకులో పెట్టేసింది. మళ్ళీ గదిలోకి వచ్చి కలయచూసింది.
    ఆ గదిలో ఎప్పటిదో పాతకాలం నాటి పందిరిమంచం ఉంది. ఒక పడక్కుర్చీ ఉంది. తలుపు వేసేసి మంచం మీద వాలింది. ఒక్కసారిగా ఏదో దిగులు కమ్మేసినట్టు అయింది. గట్టు తెగి, గండి పడిన చెరువులాగా దుఃఖం వెల్లువైంది అర్చనకి. ఎక్కడినుంచి ఎక్కడికి ఈ పయనం? చివరికి ఏది గమ్యం?
    అర్చనలో భవిష్యత్తు పట్ల భయం దిగులు, ఆవేదన దుఃఖంగా మారి జలప్రలయంలా బుస కొట్టసాగింది. కళ్ళు బలవంతంగా మూసుకుని నిద్రలోకి జారడానికి ప్రయత్నించింది.
    
                                                                                                 * * * * *
    అదొక అందమైన పూలతోట. రంగు రంగుల గులాబీలు, చేమంతులు, పరిమళాల ధూపం వేస్తూ సంపెంగలు, మొగలిపూలు, అక్షింతల హారతిస్తూ పొగడలు, పారిజాతాలు. అప్పుడే ఓ అందమైన అమ్మయి చేతిలో పూలసజ్జతో వచ్చింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మోకాళ్ళను దాటి, అరచేతి మందాన ఉన్న పూలజడ వేసుకుంది. పట్టుపరికిణీ, ఓణీ, పట్టు జాకెట్టు. చీరకీ జాకెట్టుకీ మధ్య ఉన్న అందమైన సన్నని నడుము మోయలేక మోస్తున్న వడ్డాణం, మెడనిండా నగలు, చెంపస్వరాలు, పచ్చటి ఒంటిరంగు బంగారంతో పోటీపడుతోంది. ఆ బంగారపు బొమ్మ పూలసౌరభాలను గాఢంగా ఆఘ్రాణిస్తూ, పరుగు పరుగన మొక్కల దగ్గరకి పరిగెత్తింది. సుకుమారమైన తన లేత వేళ్ళతో నాజూగ్గా ఒక్కొక్క పూవే తెంపి, పూలసజ్జలో వేయసాగింది. అంతలో ఎక్కడినుంచో ఓ తెల్లని గుర్రం రెక్కలు టపటపలాడిస్తూ ఆమె ముందు ఆగింది. దానిమీంచి తెల్లని దుస్తుల్లో అందమైన రాజకుమారుడు దిగి, అమెవైపే అడుగులు వేస్తూ, ఆమె దగ్గరగా వచ్చి, మత్తుగా, ఆమె కళ్ళల్లోకి చూసి, మనోహరంగా నవ్వాడతను. ఆ నవ్వుకి మతిపోయి శిలావిగ్రహంలా నిలబడిపోయింది. తన చేతి స్పర్శతో ఆ శిలలో చైతన్యం కలిగించడానికి కాబోలు అతని అందమైన చేయి ఆమె చేతిని అందుకుంది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ పక్షి ఇద్దరి చేతుల మీదుగా రివ్వున ఎగిరింది. ఆమె చేయి విరిగింది. తల ఎగిరిపడింది. మొండెంతో ఆ పక్షి రెక్కల నుంచి నిప్పురవ్వలు రాలిపడి, మంటలుగా ఎగిసి, ఆ మంటలో అందమైన పూలతోట కాలిపోతోంది. మంటలు ఆకాశానికి ఎగిసిపడుతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS