Previous Page Next Page 
అర్చన పేజి 21

    నేను భార్యను కాను, తల్లిని కాదు, అమ్మా, నాన్నలకి కూతుర్ని కాను. అన్నయ్యకి చెల్లిని కాను. నేనిప్పుడు ఎవరిని? ఒక్కసారి దబ్బనం లాంటి ప్రశ్న గుండెల్లోకి దిగబడినట్టు అనిపించింది.
    నేను అర్చనని. యస్... అయామ్ అర్చన.
    మిగిలిన నీళ్ళు గబగబా పోసుకుని మరో ఆలోచనకి తావివ్వకుండా చకచకా స్నానం కానిచ్చి, ఫ్రెషప్ అయి రిసెప్షన్ కి ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్, కాఫీ ఆర్డర్ చేసింది. రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది.
    కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్ళి డోర్ తీసింది.
    రూమ్ బోయ్. చేతిలో ట్రే. ఆమె పక్కకి తొలగి దారిచ్చింది. అతను లోపలికి వచ్చి, ట్రే టేబుల్ మీద పెట్టి జగ్ లో ఉన్న నేలెలు గ్లాసులో పోసి, పెట్టి వెళ్ళిపోయాడు. డోర్ వేసుకుని వచ్చి కూర్చుని టిఫిన్ తినసాగింది.
    
                                                                                                     * * * * *

    బిలబిల్లాడుతూ పిల్లలు లేత నీలంరంగు యూనిఫాంలో పావురాళ్ళ గుంపులా కనిపించారు. పెద్ద గేటు, దాటి లోపలికి వెళితే విశాలమైన ప్రాంగణం, వరుసగా నాలుగైదు బిల్డింగులు, సమయం ఉదయం ఎనిమిదిన్నర. స్కూలు బెల్ మోగింది.
    మోడువారిన వనం చిగురించి, పూలసౌరభాలతో నిండినట్టు అయింది అర్చన మనసు.
    "రండి అర్చనగారూ! ఇప్పుడు ప్రేయర్... రండి వెళదాం."
    సర్వం మరిచిపోయినట్టు నిలబడిపోయిన అర్చన దగ్గరకు వచ్చి స్నేహంగా పిలిచింది హేమలత పరిచయం చేసిన నళిని టీచర్. హేమలతని ఉద్యోగం ఇప్పించమని అడిగిన వెంటనే ఆవిడ తన చిన్ననాటి స్నేహితురాలైన నళిని బి.ఎడ్. చేసి కాన్వెంట్ రన్ చేస్తోందని నళిని ఇంటికి తీసుకుని వెళ్ళి అర్చనని పరిచయం చేసి, ఆ స్కూల్లో లెక్కల టీచర్ గా ఉద్యోగం ఇప్పించింది. ఆ ఉద్యోగంతో పాటు నళిని ఉంటున్న ఇంటికి దగ్గరగా రెండు గదుల పోర్షను కూడా ఇప్పించింది. అద్దె తక్కువని ప్రధాన నగరానికి కొంచెం దూరంగానే ఉంటుంది నళిని. అర్చన కూడా ప్రస్తుతం ఎక్కువ అద్దె భరించే స్థితిలో లేదు కాబట్టి అక్కడే ఆమెక్కూడా ఇప్పించడం జరిగింది.
    అర్చన నళినితో పాటు ముందుకు నడిచింది. పిల్లలంతా ఆరు వరసల్లో చాలా క్రమశిక్షణతో నిలబడ్డారు.
    "ప్రేయర్ స్టార్ట్" అంది నళిని.
    పిల్లలంతా ఒకే స్వరంతో శృతి తప్పకుండా చక్కగా మొదలుపెట్టారు. 'పిల్లలతో గడిపితే ఇంత మనశ్శాంతి ఉంటుందా?' అనిపించింది అర్చనకి.
    నా తండ్రి ఎప్పటికి పెద్దవాడై ఇలా స్కూలుకి వెళతాడో? తల్లి మనసు ఒక్కసారిగా విలవిల్లాడింది కన్నకొడుకు కోసం. ఏం బతుకిది భగవంతుడా? కొడుకండీ లేని తఃల్లి, తల్లి ఉండీ లేని కొడుకు.
    "ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ లవ్ మై కంట్రీ."
    పిల్లలంతా ఏక కంఠంలో లయబద్దంగా పాడుతున్నారు. అర్చనకి ఒక్కసారిగా తన చిన్నతనం గుర్తొచ్చింది. పాపం! ఏ మాటకామాటే నాన్న తననెంతో ప్రేమగా పెంచారు. అమ్మ మాత్రం ఏం తక్కువ చేసింది? ప్రేమగానే పెంచింది. కాకపోతే తల్లిగా ఆవిడ కొన్ని విషయాల్లో కఠినంగానే వ్యవహరించేది. ఆడపిల్లలంటే పనీపాటా నేర్చుకోవాలని, వంటావార్పూ వచ్చి ఉండాలని, లేకపోతే అత్తగారింటికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని వంట నేర్చుకో అంటూ అర్చనని వేధించేది. కానీ, వెంటనే ఆనందరావు "మా అర్చన అందరాడపిల్లల్లా పెళ్ళిచేసుకోదు. ఐపియస్ ఆఫీసర్ అవుతుంది" అంటూ కొట్టిపారేసేవాడు.
    గాఢంగా నిట్టూర్చింది అర్చన.
    అలాంటి నాన్న, చిన్నప్పటినుంచి తనకి చదువుపట్ల అంతులేని ఆసక్తిని కలగజేసిన నాన్న, ఎందుకు వేణు మాయలో పడ్డాడు. కాదు, నాన్న వేణు మాయలో పడలేదు. నాగరాజు చేసిన ఘాతుకంతో బెదిరిపోయి, ఒకసారి కలిగిన దౌర్భాగ్యస్థితి తన కూతురికి మరోసారి కలక్కూడదని, వరించి వచ్చిన కుర్రవాడిని మహాభాగ్యంగా భావించి, తనకి నచ్చచెప్పి, తన మెడలు వంచి పెళ్ళిచేశాడు. ఛ! అర్చనకి మళ్ళీ ఏడుపొచ్చింది. తనని తాను మందలించుకుని పిల్లలతో పాటు స్వరం కలిపింది.
    ప్రేయర్ అయిపోయింది. క్యూలో ఉన్న పిల్లలంతా చెదిరిన పక్షుల్లా కలకలధ్వనులు చేస్తూ క్లాస్ రూమ్స్ కి వెళ్ళిపోసాగారు.
    "రండి మీ క్లాసు చూపిస్తాను" నళినిని అనుసరించింది.
    ఆ రోజంతా స్కూలు టీచర్ గా ఓ కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల తరువాత మనసంతా ఉల్లాసంగా, తేలిగ్గా అయింది. మంచి ఉద్యోగం ఇప్పించారు మేడమ్. ఆవిడకి థాంక్స్ చెప్పాలి అనుకుంది. మిగతా తీచర్లని కూడా నళిని పరిచయం చేసింది. ఎవరూ కూడా తనని "మీ ఆయనేం చేస్తారు? మీకెంతమంది పిల్లలు?" లాంటి రొటీన్ ప్రశ్నలేయనందుకు చాలా ఆనందంగా అనిపించింది.
    సాయంకాలం నళిని, అర్చన కలిసే ఇంటికి వెళ్ళారు. స్కూలుకు కూడా దగ్గరే. నడిచి వెళ్ళచ్చు. నళినికి థాంక్స్ చెప్పి తన ఇంటివైపు నడిచింది.
    ఇంటికి వెళ్ళగానే పొట్లాలు పొట్లాలుగా ఉన్న సరుకులు, అట్టపెట్టెల్లో ఉన్న చిన్న గిన్నెలు బైటకి తీసింది. టీ పొడి, పంచదార, పాలపొడి డబ్బా, అగ్గిపెట్టె వరసగా అన్నీ సర్దుకుని స్నానం చేసి వచ్చి టీ పెట్టుకుని, టీ కప్పుతో వచ్చి వరండాలో కూర్చుంది. వాకిట్లో ఉన్న పూలమొక్కలు ఒకొక్కటీ తమని తాము పరిచయం చేసుకుంటున్నట్టు గాలికి తొంగిచూసి వెనక్కెళ్తున్నాయి. 'నా పేరు కనకాంబరం' అంది ఓ మొక్క కొద్దిగా వంగి. 'నా పేరు పచ్చ చామంతి' అన్నాయి పచ్చని పూలు. 'హలో నా పేరు గులాబీ. చూశావుగా ఎంత నాజూగ్గా ఉంటానో! నన్ను చూడగానే పిల్లల దగ్గర్నించి పెద్దవాళ్ళదాకా మొక్కనుంచి వేరు చేయడానికే చూస్తారు. అందుకే నా చుట్టూ ముళ్ళు కాపలాగా' నవ్వింది గులాబీ. ఆ నవ్వుకి పరవశించిన పారిజాతం జలజలా రాలింది.
    అర్చన పెదవుల మీద కూడా సన్నని నవ్వు విరిసింది. అది పూవుల్లో కలిసి షికారుకెళ్ళింది.
    "ఏమ్మా! వచ్చేశావా?" అంటూ వచ్చింది పూర్ణమ్మగారు.
    "రండి పిన్నిగారూ! టీ తాగుతారా?" తను కూర్చున్న స్టూలు ఆవిడకిచ్చి తను గడపమీద కూర్చుంటూ అడిగింది.
    "గడపమీద కూర్చోకూడదమ్మా" అందావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS