Previous Page Next Page 
అర్చన పేజి 20


    "ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?" అడిగింది ఆవిడ.
    అర్చన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి "చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. ఇంక ఇక్కడే ఉంటాను కదా! తప్పకుండా చెపుతాను" అంది.
    ఆవిడ ఇంక రెట్టించలేదు.
    అర్చన జీవితనౌక చిన్న మజిలీలో ఆగింది.
    హేమలత దయతో అర్చన ప్రశాంతంగా బాబుకి జన్మనిచ్చింది. బాబుని చూసుకున్నప్పుడు చిన్న మమకారం ఉవ్వెత్తున లేచింది, మాతృత్వం మధురంగా గుండెల్లో సన్నాయి మోగించింది. కానీ, ఆమె ముందు బలంగా నిలబడిన ఒక లక్ష్యం ఆ మమకారాన్ని జయించింది. సన్నాయిలోని శ్రావ్యతను ఆస్వాదించే స్థితిలో లేని తన అశక్తతకి తల వంచింది. అర్చన డెలివరీకి వెళ్ళడం, డెలివరీకి వెళ్ళిన లైబ్రేరియన్ డ్యూటీలో జాయిన్ అవడం ఒకేసారి జరిగాయి.
    ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. మళ్ళీ జీవితం ప్రశ్నార్ధకంగా మారింది.
    ఈసారి ఆమె కళ్ళముందున్న పెద్ద ప్రశ్న బాబు. ఈ బాబునేం చేయాలి? తాడూ బొంగరం లేని ఈ జీవితానికి బాబు నిజంగా ఒక ప్రతిబంధకమే. అలా అని వాడిని ఏ మురుగు కాలవలోనో పడేయడానికి ఆమె హృదయం లేని కసాయి స్త్రీ కాదు. స్త్రీ సహజమైన మాతృత్వపు మమకారం అమెలోనూ ఉంది. చిన్న చిన్ని పాదాలు, అరచేతులు, నల్లని కనుపాపలు అల్లనల్లన తిప్పుతూ కళ్ళు తెరిచి తనవైపు చూస్తున్న బాబు నన్నేం చేస్తావు అని అడుగుతున్నట్టే అనిపించి ఉలిక్కిపడసాగింది.
    బాబుని వాడి తాతగారికి, నాయనమ్మకీ అందించగలిగితే వాడి జీవితం చక్కటి మార్గంలో సాగిపోతుంది. వాడు ఉన్నతంగా ఎదుగుతాడు. ఆ నమ్మకం ఆమెకి ఉంది. పదిరోజులు గడిచి, స్నానం చేయగానే హేమలతకి చెప్పి, హైదరాబాద్ వెళుతున్నానని నమ్మించి బాబుని తీసుకుని బయలుదేరింది.
    
                                                                                             * * * * *

    బస్సు హారన్ మోగుతోంది. అర్చన ఉలిక్కిపడింది. కొంచెం ఉంటే బస్సు కింద పడిపోయేది. చాలాసేపటి నుంచీ ఆలోచిస్తూ 
అక్కడే నిలబడిపోయింది. విశాఖపట్నం వెళ్ళే బస్సులు వెళ్ళిపోయాయా? ఆలోచనలు వదిలించుకుని ఒక్కసారి బస్టాండులో ఉన్న బస్సులపైన పేరు చూసింది. పిఠాపురం, విశాఖపట్నం. యస్... తను వెళ్ళాల్సిన బస్సు.
    కౌంటర్ వైపు నడవబోతుంటే మరోసారి కళ్ళు తిరిగినట్టు అయింది. పక్కనే ఉన్న కొట్టులో మంచినీళ్ళ బాటిల్ కొనుక్కుని ఓ పక్కగా వెళ్ళి నీళ్ళు నోట్లో పోసుకుని మూడుసార్లు పుక్కిలించింది. మిగిలిన నీళ్ళు తాగింది. తిరిగి కొట్టు దగ్గరకి నడిచి బాయిలర్ లో మరుగుతున్న కాఫీ వైపు చూసి ఒక కప్పు ఇవ్వమంది.
    వేడి వేడి కాఫీ తాగాక ఎంతో బలం వచ్సినట్టు అనిపించింది. పర్సు తెరిచి డబ్బులిచ్చి కౌంటర్ వైపు నడిచింది. పగలు కాబట్టి రిజర్వేషన్ అవసరం లేదు. టిక్కెట్టు తీసుకుని కొన్ని క్షణాల్లో కదలబోతున్న బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాక రిలాక్స్ గా వెనక్కి వాలి, కళ్ళు మూసుకుంది.
    
                                                                                        * * * * *

    అర్చన విశాఖపట్నం బస్ డిపోలో బస్సు దిగింది. ఆ గాలి సోకగానే ఏదో నిశ్చింత. ఏదో ఆశ. పుట్టి పెరిగిన ఊరు. జీవితాన్ని, జీవితానికో లక్ష్యం నిర్ణయించిన ఊరు. కానీ, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం కూడా దూరం చేసిన ఊరు.
    ఏది ఏమైనా ఇది తన ఊరు. జీవితం ఇక్కడినుంచే ప్రారంభం అయింది. ఇక్కడే కొనసాగింది. ఇక్కడే మధ్యలో బ్రేక్ వేసింది. మళ్ళీ ఇక్కడే పునర్జీవితం ప్రారంభం కావాలి. ఇక్కడే ఈ జీవితం స్థిరపడాలి. స్థిరంగా అనుకుంది.
    తప్పకుండా తన లక్ష్యం నెరవేర్చుకుంటుంది. ఇదంతా తాత్కాలికం. సుదీర్ఘమైన ఈ జీవనయానంలో ఇదొక మజిలీ. ఈ మజిలీ దాటి తప్పకుండా తను చేరాల్సిన గమ్యానికి దారి తెలుస్తుంది. యస్. ఆ దారిలో నడిచి వెళ్ళి తప్పకుండా గమ్యం చేరాలి. అందుకు తనకి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ఎంతో ధైర్యం కావాలి. ఎవరేమన్నా లక్ష్యపెట్టకూడదు.
    అలా అనుకున్నాక ఆమెలో కొత్త శక్తి, ఎంతో ధైర్యం నరనరంలో పాకుతున్న భావన కలిగింది. రోడ్డుమీదకు వచ్చి, చుట్టూ మూగిన ఆటోవాళ్ళల్లో ఒకళ్ళ ఆటో ఎక్కింది.
    ఇప్పుడు నేరుగా హోటల్ కి వెళుతుంది. ఆ తరువాత ఏం చేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు హోటల్ కి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం, ఎలాంటి, నుదురు, ఆలోచన, భయం లేవు.
    ఆటో మంచి హోటల్ ముందు ఆగింది. ఆటో దిగి తన సూట్ కేస్ తీసుకుని నేరుగా హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి రూము తీసుకుంది.
    సూట్ కేసు తీసుకుని, రూమ్ తాళం చెవి పట్టుకుని తన వెనకే వస్తున్న హోటల్ బాయ్ ముందు దర్పంగా, ఠీవిగా తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళింది. ఆమె దగ్గర ఇప్పుడు డబ్బుంది. మెడలో, చెవులకి, చేతులకి నాలుగు బంగారం గాజులు, ఫర్వాలేదు. ఉద్యోగం దొరికిందాకా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఒక ఉద్యోగం సంపాదించాలి. కొంచెం సేపు రెస్టు తీసుకుని తిరిగి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడా కాలేజీనే తన టార్గెట్. అక్కడ ఉంటేనే ఆ కాలేజీ కరస్పాండెంట్ కొడుకు నాగరాజు మూమెంట్స్ తనకి తెలుస్తాయి.
    నాగరాజు... అర్చన పళ్ళు పటపటలాడాయి. డబ్బు, పరపతి ఉపయోగించి తను పెట్టిన కేసు కొట్టేయించాడు. ఎవరూ ఏం చేయలేరని కదా వాడి ధైర్యం! అర్చన తల్చుకుంటే ఏం చేయగలదో నిరూపించాలి. వాడి డబ్బుతో ఎంత గొప్ప భవిష్యత్తు నిర్మించుకున్నా దాన్ని పునాదితో సహా పడేయాలి. ఈ ఒక్క లక్ష్యం నెరవేర్చుకున్నాక భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలి.
    వేణుతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంది. బాబు అర్చన గుండెల్ని మెలిపెడుతూ.... ఒక నిట్టూర్పు వచ్చింది. తను కసాయి తల్లి. ఎంత కసాయిదైనా ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చింది. బాబు విషయంలో నిశ్చింతగా ఉండచ్చు. దేవతల్లాంటి ఆ దంపతుల చేతుల్లో బాబు చక్కగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతాడు. వాడిలో వేణులోని స్వార్ధం, నాగరాజులాంటివాళ్ళలా దుర్మార్గం, పిరికితనం, చేతగానితనం ఇవేవీ ఉండకూడదు. మగాడిలా పెరగాలి. మంచి మగాడిలా బతకాలి. ఎప్పటికైనా తాను బాబుని కలుసుకుంటుంది. ఆ రోజున ఎత్తుగా ఎదిగిన వాడి ముందు మరుగుజ్జుగా మారి తన దీనగాథ చెప్పుకుంటుంది. వాడు తప్పకుండా క్షమిస్తాడు. అవును క్షమాగుణమే ఆభరణంగా, నిష్కల్మషంగా బతికే కృష్ణస్వామి, తాయారమ్మ దంపతుల సంరక్షణలో వాడూ దేవుడే అవుతాడు.
    పల్చగా కన్నీటి తెర కప్పేసింది కళ్ళని. కన్నీళ్ళు తుడుచుకుని, సూట్ కేసులోంచి బట్టలు, టవల్, సోప్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. నింపాదిగా వేడినీళ్ళతో కాస్సేపు ఆడుకుంటూ స్నానం చేస్తుంటే గుర్తొచ్చింది. తనిప్పుడు బాలింత. అంతా సక్రమంగా ఉండి ఉంటే పసుపు, సున్నిపిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమనేది అమ్మ. తలంటి పోసుకుని, సాంబ్రాణి ధూపం వేసుకోవాల్సిన సమయమిది. బాబుకి ఒంటికి నూనె రాసి, మూడేసి బకెట్లతో నీళ్ళు పోయాల్సింది. వేడినీళ్ళతో పాలు కన్నీళ్ళు కూడా వెచ్చగా జారాయి చెంపలమీదికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS