అర్చనకి దిగులుగా, బాధగా తనమీద తనకే జాలిగా అనిపిస్తోంది. ఈ వెధవ బతుకు బతకాల్సిన అవసరం ఉందా? అనిపించింది కాస్సేపు. చావడానిక్కూడా ధైర్యం కావాలి అనుకుంది. తనకి బతికే ధైర్యం ఉంది కానీ, చచ్చే ధైర్యం లేదు. ఏం జరిగినా బతకాలి. ఎలాగైనా బతకాలి.
ఒక నిర్ణయానికి వచ్చినదానిలా ఆటో పిలిచి ఎక్కింది. తనకున్న ముఖ్యమైన స్నేహితురాళ్ళలో లీల కూడా ఉంది. తన దగ్గరకు వెళ్ళాలి. లోకం గొడ్డుపోలేదు. నీలిమలాంటి వ్యక్తిత్వం లేనిది కాదు లీల. మంచి మనసున్న మనిషి, దానికీ చాలా ఆశయాలుండేవి. బహుశా పి.జి. పూర్తి చేసి ఉంటుంది. నీలిమలా పెళ్ళి చేసుకుని ఉండకపోవచ్చు.
తనకు బాగా గుర్తున్న లీల ఇల్లు సునాయాసంగానే తెలుసుకోగలిగింది అర్చన.
చిరకాల స్నేహితురాలిని చూస్తున్నానన్న ఆనందంతో ఓ క్షణం శరీరం ఆపాదమస్తకం ఆనందంతో నృత్యం చేసింది. ఒక్కసారి ఆ రోజుల్లో అందరూ కలిసి చేసిన అల్లరి, కంబైన్డ్ స్టడీస్ పేరుతో ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి వెన్నెల రాత్రుల్లో డాబా మీద కూర్చుని పాత సినిమాల్లో పాడుకున్న పాటలు, ఒకళ్ళకి వచ్చిన ప్రేమలేఖలు మరొకళ్ళు చదువుకుంటూ పొందిన చిత్రమైన ఆనందం అన్నీ గుర్తొచ్చాయి.
తనను చూడగానే ఎగురుతూ వచ్చి వాటేసుకుంటుందని ఆశించిన అర్చనకి నిరాశే మిగిలింది. అర్చన రాకను ఆహ్వానించింది. కానీ ఆనందంగా స్వీకరించలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానన్న గర్వం ఆమెలో తొంగిచూసింది. పైగా లీల పెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో నిశ్చయమైంది. ఆశ్రయం కోరి వచ్చింది తెలియగానే నిర్ధయగా అంది.
"సారీ అర్చనా! నువ్వు ప్రాణస్నేహితురాలివే కానీ, ఇలాంటి పరిస్థితుల్లో నీకు సాయం చేయడం నా గొయ్యిని నేను తవ్వుకోడం అవుతుంది. ఏమీ అనుకోకు."
అర్చన నిట్టూర్చింది.
ఆమె ఆశపడిన దారులన్నీ మూసుకుపోయాయి. గర్భిణీ ఉదయం నుంచీ తిండి లేకుండా తిరుగుతోంది. చేతిలో డబ్బుంది. హోటల్ రూం తీసుకోవచ్చు. కానీ, ఎవరన్నా చూస్తే.... చూస్తే చూడనీ అనుకునే పరిస్థితి కాదు. అటు కన్న తల్లితండ్రులు, ఇటు భర్త పేరుతో ఓ వ్యక్తి తనకి ఉన్న విషయం అందరికీ తెలుసు. ఈ విశాఖపట్టణం తాను పుట్టి పెరిగిన ఊరు. ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ కనిపించచ్చు. ఏంటమ్మా హోటల్లో ఉన్నావేంటి అని అడగచ్చు. సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? అవును ఏమని చెప్పాలి? తల్లి, తండ్రి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు అని చెప్పాలా? నా మొగుడ్ని నేను వదిలేసి వచ్చాను అని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఎందుకు అని అడిగితే ఆ ఎందుకు తన దగ్గర సమాధానం ఉందా?
అర్చనకి ఆకలితో పాటు అవమానభారం కూడా కలిసి ఒళ్ళంతా తూలిపోతోంది. ఆగమ్యగోచరంగా బైటకి వచ్చి, ఆలోచిస్తున్న అర్చన తట్టుకోలేని అశక్తతతో కనిపించిన హోటల్లోకి దూరింది.
ఆ క్షణంలో ఆమెకి మూసుకుపోయిన దారుల్లో చిన్న వెలుగు చూపించడానికే ఆ దైవం ఆ హోటల్ కి పంపించాడేమో నన్న భావన కలిగేలా ఆ జగన్మాతే హేమలత రూపంలో కనిపించింది. ప్రస్తుతం కాలేజీ ప్రిన్సిపాల్ ఒకనాటి కెమిస్ట్రీ లెక్చరర్. అర్చనని చూడగానే గుర్తుపట్టింది. సంతోషం వెల్లివిరుస్తున్న మొహంతో ఆత్మీయంగా పలకరించింది.
"ఏమ్మా అర్చనా! ఏంటిలా వచ్చావు? ఎలా ఉన్నావు?" ఆమెని చూడగానే భయం, కంగారు కలిగిన అర్చనకి ఆ పలకరింపు పన్నీటిజల్లులా అనిపించింది.
"బాగున్నాను మేడమ్. మీరెలా ఉన్నారు?"
"చాలా హాయిగా ఉన్నాను. అరుగో మా వారు." హ్యాండ్ వాష్ కి వెళ్ళి వస్తున్న భర్తని అర్చనకీ, అర్చనని అతనికీ పరిచయం చేస్తూ అంది. "ఈ అమ్మాయే అర్చన అని నాకిష్టమైన స్టూడెంట్ అని చెప్పాను కదా మీకు చాలాసార్లు."
"ఓ నైస్. హవార్యూ అర్చనా?" అడిగాడు ఆయన. నల్లటి హేమలతకి హ్యాండ్ సమ్ హజ్ బండ్.
అర్చన పల్చగా నవ్వి, "థాంక్యూ సర్. అయామ్ ఫైన్" అంది.
"మళ్ళీ కలుస్తాను మేడమ్..." అంటూ వెళ్ళబోతున్న అర్చన చేయి పట్టుకుని ఆపుతూ.
"ఎక్కడికి? కూర్చో కలిసి తిందాం...." అంటూ తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని "ఏమ్మా! ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు?" ప్రశ్నల పరంపరం ప్రారంభించింది. తప్పించుకుందామనుకున్నా పరిస్థితి ఎదురవడంతో తప్పేలా లేదనుకున్న అర్చన "తరవాత మాట్లాడదాంలే మేడమ్" అంది. ఆమెకిప్పుడు హేమలతతో పర్సనల్ గా మాట్లాడాలని ఉంది. ఈవిడే సింహాచలం చెప్పిన క్రొత్త ప్రిన్సిపాల్ అని తెలిస్తే ఆవిడ ఇంటికే వెళ్ళేది. కానీ అతను చెప్పలేదు. తాను అడగలేదు. ఇప్పుడు ఆవిడ భర్త ఎదురుగా తన వ్యక్తిగత విషయాలు ఆమెతో చర్చించడం ఇష్టంలేని అర్చన మొహంలో కనిపిస్తున్న అయిష్టత హేమలత సూక్ష్మదృష్టికి రావడంతో ఆమె కూడా ఆ విషయాలు వదిలేసి కాలేజీ విషయాలు, లోకాభిరామాయణం మాట్లాడుతూ కడుపునిండా టిఫిను పెట్టించింది.
"రేపు కాలేజీకి రా..." అంటూ అర్చనని ఆహ్వానించి, సెలవు తీసుకుని వెళ్ళిపోయింది.
ఆమె మాటలు, ఆమె ఆప్యాయత అర్చనకి ఏదో అభయం ఇచ్చినట్టు అనిపించింది. ఈ ఒక్కరాత్రి లాడ్జిలో గడపక తప్పదు అని ఓ నిర్ణయానికి వచ్చి లాడ్జి వైపు నడిచింది.
మర్నాడు కాలేజ్ కి వెళ్ళిన అర్చనని ఆదరంగా ఆహ్వానించింది. అర్చన మెల్లిగా సమయం చూసుకుని అంది.
"నాకు కొంతకాలం సుమారు ఆరునెలలు ఆశ్రయం కల్పించండి మేడమ్. మీకు ఋణపడి ఉంటాను."
"తప్పమ్మా! అంత పెద్ద మాటలెందుకు? ప్రస్తుతం మన లైబ్రేరియన్ మెటర్నిటీ లీవు మీద వెళ్ళింది. ఆ పోస్టు చేస్తావా నీ డెలివరీ అయిందాకా?" అంది హేమలత.
అంతకన్నా ఏం కావాలి? "తప్పకుండా చేస్తాను. అలాగే నాకేదన్నా హాస్టల్ లో కూడా అకామిడేషన్ ఇప్పించగలరా?"
"ష్యూర్. వై నాట్? నా ఫ్రెండ్ ఒకావిడ రీసెంట్ గా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పెట్టింది. నువ్వక్కడ జాయిన్ అవచ్చు. హాయిగా నిర్భయంగా ఉండచ్చు."
అర్చన మొహంలో ఆరిపోయిన వెలుగు దివ్యకాంతితో వచ్చినట్లైంది. "థాంక్యూ మేడమ్ థాంక్స్ ఎలాట్" అంది ఉద్వేగంగా.
