Previous Page Next Page 
అర్చన పేజి 18

    ఆయన వేణు వైపు చూసి మెత్తగా నవ్వాడు. "లేదు. అమ్మకి ఆ బాబెవరో ఏమిటో తెలియదు. ఆవిడ షాక్ లో ఉంది. నీలవేణి అని ఒకమ్మాయి మనింట్లో పని చేస్తుంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఆ అమ్మాయి కేబాబుని తాను పెంచుకుంటానని తీసుకుంది."
    వేణు కంగారుగా అడిగాడు. "ఆ అమ్మాయి ఎక్కడుంటుంది?"
    "మనింట్లోనే ఉంటుంది. భయపడకు. బాబు ఎక్కడికీ వెళ్ళడు."
    హమ్మయ్య వేణు  గుండె కుదుటపడింది.
    "ఏటిఎమ్ కి వెళ్ళొస్తాను నాన్నా" అంటూ బైటికి వెళ్ళబోతున్న వేణుని వారిస్తూ అన్నాడు కృష్ణస్వామి.
    "డబ్బులు నా దగ్గర ఉన్నాయి లేరా. నువ్విప్పుడు ఓ ఐదు వేల కోసం ఏటి ఎమ్ దాకా ఎందుకు?"
    "నా దగ్గర అసలు లేవు నాన్నా!"
    "ఫర్వాలేదురా. నీ డబ్బు, నా డబ్బు అంటూ మనకి తేడాలేం లేవు కదా! ఇంట్లో ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి. కూర్చో ఉదయం నుంచీ తిరుగుతూనే ఉన్నట్టున్నావు. ఇంకా ఎంత టైం ఉంది మన బండికి?"
    కూర్చున్నాడే కానీ, ఏం మాట్లాడాలో అర్ధం కాని వేణు కొద్దిసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అతని మనసు నిండా బాబు నిండిపోయి ఉన్నాడు. ఎలా ఉన్నాడో చిట్టితండ్రి! తన పోలికా? అర్చన పోలికా? ఆ రాక్షసి పోలిక రాకుండా ఉంటేనే హాయి.
    అవును ఆమె రాక్షసి. అందమైన రాక్షసి. తన సున్నితమైన మనసుని ముక్కలు చేసి, ఆ ముక్కలు మరింతగా గుండెల్లో గుచ్చుకునేలా ఆ గుండెల మీంచి నడిచి వెళ్ళిపోయిన గుండెలేని ఆడది. అందమైన ఆ రూపం వెనక ఎంత కాఠిన్యం? ఆ మనసు ఎంత పాషాణం? అలాంటి ఆడదాన్ని ప్రేమించడం తను చేసిన పొరపాటు. ప్రేమించి వెంటబడడం, ఆమె చీత్కారాలు, అవమానాలు భరించడం, చివరికి ఆమె అహంకారం దిగిపోయిందనుకుని, నిస్సహాయంగా తన చేయి అందుకుని తనతో నడుస్తుందని ఆశించి పెళ్ళిచేసుకోడం... ఇవన్నీ పొరపాట్లే. ఎన్ని పొరపాట్లు చేశాడు? వీటిని సరిదిద్దుకుని సవ్యంగా జీవించడానికి తనకి ఎంతకాలం పడుతుందో? అంతదాకా అమ్మా, నాన్నలకి మానసిక క్షోభే కదా! ఇది న్యాయమా? తను చేసింది ధర్మమా? ఒక యువతి కోసం కంటిదీపంలా పెంచుకున్న తల్లితండ్రులకి ఇంతటి శిక్ష వేసిన తాను వాళ్ళని క్షమించమని ఎలా అడగగలడు?
    బియస్సీలో యూనివర్శిటీ ఫస్ట్ వచ్చిన తను అర్చన కోసం, ఆమెని భార్యగా పొంది చక్కటి దాంపత్య జీవితం గడపడం కోసం బ్యాంకు ఎగ్జామ్స్ రాయడం, బ్యాంకులో తనకి ఉద్యోగం రావడం, అంతా జస్ట్ యాక్సిడెంట్. ఎంత పెద్ద గాయం. మానని గాయం చేసింది ఈ యాక్సిడెంట్.
    ఆ రోజు చక్రవర్తి బతిమాలాడు. "వద్దురా! నా మాట విను. నేను సరదాకి రాస్తున్నాను బ్యాంకు ఎగ్జామ్స్. నీలాగా నాకు పెద్ద యాంబిషన్స్ లేవు. నా మాట విని సివిల్స్ కి ప్రిపేర్ అవరా" అని, తను వింటేనా? నో అర్చనని పెళ్ళి చేసుకోవాలి. ఆమె కోల్పోయిన జీవితానందాన్ని ఇవ్వాలి. అందుకు ఉద్యోగం సంపాదించాలి. అనుకున్నట్టే జరిగింది. బ్యాంకు ఎగ్జామ్స్ రాయడం, సెలక్ట్ అవడం అంతా యాదృచ్చికం. తనేం కష్టపడలేదు. చాలా ఈజీగా వచ్చింది ఉద్యోగం.
    చక్రవర్తి తండ్రి పెద్ద బిజినెస్ మాన్, చక్రవర్తి ఒక్కడే కొడుకు. అతనికి ఉద్యోగం చేసే అవసరం ఎంతమాత్రం లేదు. కానీ, ఉద్యోగం చేయాలి కాబట్టి సరదాగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు. ఉద్యోగం వచ్చింది. అయితే, అంతకు ముందే డిగ్రీ అయిపోగానే అతని మేనత్ట కూతురు మాధవితో అతని వివాహం కూడా అయిపోయింది. మాధవి మంచి అమ్మాయి. గొప్ప అందగత్తె కాకపోయినా చామనఛాయతో, గుండ్రటి మొహంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి స్నేహశీలి. అర్చన విషయం చక్రవర్తితో చెపితే అతను ముక్క చివాట్లు పెట్టాడు. భవష్యత్తు చేతులారా పాడు చేసుకుంటున్నావు. నీకెందుకురా ఆ అమ్మాయి గొడవ? నిన్ను ప్రేమించడం లేదని చెప్పింది కదా! అంటూ ఎంత చెప్పినా వేణు పట్టిన మొండిపట్టుకి మాధవి సపోర్టు ఇవ్వడంతో వేణు కోరిక నెరవేరింది.
    వేణుకి జుట్టు పీక్కోవాలనిపిస్తోంది. తలని తాను ఎడా పెడా కొట్టుకోవాలనిపిస్తోంది. ఎదురుగా నుదుట నామాలతో కూర్చుని, ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న తండ్రి అతని కంటికి విష్ణుమూర్తిలా అనిపించాడు. ఆలోచనల నుంచి బైటపడాలి. తల విదిల్చి లేచాడు. లోపలికి వెళ్ళి గోడగడియారం చూశాడు. ఎనిమిదింపావు బయలుదేరాలి. బైటకి వచ్చి మెల్లిగా అన్నాడు.
    "నాన్నా! బయలుదేరదామా?"
    కృష్ణస్వామి ధ్యానంలోంచి కళ్ళు తెరిచాడు.
    "ఆ వెళదాం పద" అంటూ లేచి కండువా దులుపుకుని భుజం మీద వేసుకుని లాల్చీ వేసుకోడానికి లోపలికి నడిచాడు.

                                                                                          * * * * *
 
    అర్చనకి తాను మూడు సంవత్సరాలు ఎంతో ఉల్లాసంగా గడిపిన ఆ పరిసరాల్లో తిరుగుతుంటే అప్పటిదాకా నిరాశతో, నిస్పృహతో, విషాదంతో నిండిన మనసంతా కొత్తగా చైతన్యం నింపుకున్నట్టయింది. ఇదే చెట్టుకింద కదా ఎప్పుడూ తనూ, నీలూ, లీల కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఈ క్యాంటీన్ దగ్గరే కదా గంటలు, గంటలు కాఫీలు తాగుతూ, బాతాఖానీ వేస్తూ గడిపేవారు. ఈ వేదికమీదే కదా తను అందరిచేతా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించింది. ఇదే ఇదే తన క్లాస్. అణువణువునా ఆనందం. ఇదే ఇదే ఈ క్లాసులోనే వేణు, వేణు స్నేహితులు.....ఆగిపోయింది. ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. నీరసంగా వెనక్కి తిరిగింది. గంట వినిపించింది. కాలేజీ అయిపోయింది. అడుగులు వేగంగా వేసుకుంటూ ప్రిన్సిపాల్ రూమువైపు నడిచింది. సింహాచలం ఎదురొచ్చాడు.
    "వెడదామా సింహాచలం?" అడిగింది.
    "లేదమ్మా ఆయమ్మ అక్కడ లేరట. ఇంకెక్కడికో వెళ్ళిపోయారట. మీరు కావాలంటే రేపు కొత్త మేడమ్ వస్తారు కలుస్తారా?" అడిగాడు. పొంగుతున్న పాల మీద గిన్నెడు నీళ్ళు ఒలికిపోయాయి. ఆశలన్నీ అణగారిపోయాయి. మళ్ళీ భవిష్యత్తు క్వశ్చన్ మార్కు దగ్గరికొచ్చింది. ఈ జీవితం నిండా క్వశ్చన్ మార్కులేనా? నవ్వొచ్చింది. జీవంలేని నవ్వు.
    ఏం మాట్లాడకుండా తల అడ్డంగా తిప్పి వెనక్కి తిరిగింది.
    కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ. అంధకారం అలుముకున్న భవిష్యత్తు. అర్చనకి ఉప్పెనగా దుఃఖం వచ్చింది. ఏమిటీ జీవితం? కొన్ని రోజులు ముందు తాను వేణుని వదిలేసి వచ్చినా కన్యగానే ఉండేది. కానీ, భవిష్యత్తు గురించి ఒక నిర్ణయానికి వచ్చేలోపలే ఆ సంఘటన జరిగిపోయింది. ఆ రోజు వేణు అలా ఉద్రేకపడకపోయి ఉంటే ఈ జీవితం ఇంకోరకంగా ఉండేది. తన ఆశయాలు, ఆశలు.... అర్చన అర్చనగానే మిగిలేది. కానీ, ఇప్పుడు తను అర్చన కాదు. మిసెస్ వేణు. నో అలా జరక్కూడదు. ఎన్నటికీ జరక్కూడదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS