పాత ఆంటీ కాదు ఈవిడ. మారిపోయింది. ఒక మామూలు స్త్రీలాగా నిందలూ, నిష్టూరాలూ, అవమానించడానికి ప్రయత్నించటం లాంటివి చేస్తోంది. అక్కడ ఒక్కక్షణం ఉండాలనిపించలేదు. ఆ భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఒకనాడు తాము అభిమానించిన అమ్మాయి, వాళ్ళ కూతురితో సమానంగా ఇంట్లో తిరిగిన అమ్మాయి వచ్చిందన్న భావన కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా, ఆదరంగా ఆహ్వానించటం లేదు స్నానం చేస్తావా? భోంచేశావాలాంటి ప్రశ్నలు వేయలేదు. పరిస్థితి తను ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అర్చనకి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు.
నెమ్మదిగా సూట్ కేసు హ్యాండిల్ పట్టుకుని డోర్ వైపు చూస్తూ, దుఃఖాన్ని అణచుకుంటూ "ఆయన బ్యాంక్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. వస్తానాంటీ. ఇటు వెళుతూ మిమ్మల్ని నీలూని చూసి వెడదామని వచ్చాను. వెళ్ళొస్తాను" అంది.
"భోంచేసి వెళ్ళమ్మా" మామూలుగా అంది జగతి.
అర్చన నవ్వింది. ఆమె నవ్వు జగతికి ఇబ్బందిగా అనిపించింది. ఎంత ప్రేమ నా మీద అన్నట్టుంది. నిజానికి అర్చనకి సాయం చేయాలనే ఉంది ఆవిడకి. అర్చన స్వభావం, ఆమె ధైర్యసాహసాలు, ఆమెలోని నిక్కచ్చిదనం అన్నీ తెలుసు జగతికి. కానీ, ఈ సమాజంలో అనేక వేల లక్షలమంది ఆడవాళ్ళలా ఆమె కూడా భర్త ఇష్టాయిష్టలమీద ఆధారపడి బతుకుతున్న ఒక సాధారణ స్త్రీ. అర్చన జీవితంలో జరిగిన ఒకే ఒక్క దురదృష్టకర సంఘటన విన్న తరువాత అతను చేసిన కామెంట్స్ గుర్తున్నాయి. మగవాడు కొన్ని సందర్భాల్లో ఆడపిల్ల పట్ల చేసే విమర్శలు అమానవీయంగానే కాదు అసహ్యంగా కూడా ఉంటాయి. తన భర్త గొప్ప మనసు ఆవిడకి తెలుసు. అర్చనతో ఆ ఇంటికున్న అనుబంధంతో అర్చన ధైర్యంగా నేనిక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నాను అని నిర్మొహమాటంగా చెప్పే చనువు ఉంది. కానీ, ఆ చనువుని ఇంకో విధంగా ఉపయోగిన్చుకునే నీచత్వం తన భర్తలో కూడా ఉండే ఉండవచ్సునన్న భయం అర్చనని చూస్తున్నకొద్దీ జగతి మనసులో కలుగుతూనే ఉంది. నిస్సహాయస్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి తనింట్లో ఆశ్రయం ఇవ్వడంలో ఆ పిల్లకి ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే జగతి అర్చనని ఆహ్వానించలేకపోయింది. అంతేకాదు, ఆమె మీద తన మనసులో ఉన్న అభిమానం, సానుభూతి కూడా బైటపడకుండా జాగ్రత్తపడడానికి ప్రయత్నిస్తోంది. అందుకే అర్చన నవ్వు ఆమెని బాధించింది. ఎక్కడ తన మాటలో ఆప్యాయత కనిపిస్తుందోనన్నట్టు పొడిపొడిగా అంది ఆ విషయం అర్చన గ్రహించిందన్న బాధ ఆమెలో కలిగింది.
"లేదాంటీ నా కోసం అమ్మ ఎదురుచూస్తుంటుంది. వస్తాను" అర్చన చరచరా నడిచి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళడంతో జగతి నిట్టూర్చింది.
మనసు దిటవు చేసుకుని వెనక్కి తిరిగిన జగతికి తన భర్త చూపులోని భావం కడుపులో తిప్పినట్లై లోపలికి వెళ్ళిపోయింది.
అర్చన వెనక్కి తిరిగి చూడలేదు. ఆమెకి అర్ధమైపోయింది. తనని ఎవరూ అర్ధం చేసుకోరు, చేసుకోలేరు. కన్నతల్లే అర్ధం చేసుకోలేనప్పుడు ఇంకెవరో అర్ధం చేసుకుంటారన్న ఆశే అర్ధవిహీనం. అవమానించారన్న బాధ దేనికి?
బాధ, ఆవేదన, అవమానాలు, తిరస్కారాలు వీటిని మౌనంగా స్వీకరించగలిగిననాడు తాను జీవితాన్ని జయించిన మహారాణి అవుతుంది. యస్...జయించాలి. ఈ జీవితాన్ని జయించాలి. తను వేణుని తిరస్కరించడం, హిందూమతం పవిత్రబంధంగా భావించిన వివాహాన్ని వాలంటరీగా రద్దు చేసుకోడం. ఈ రద్దుని సమజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. సహించదు. అలాగని ఈ సమాజం కోసం అన్యాయంగా కోల్పోయిన కొన్ని ప్రాథమిక హక్కులను వదులుకోడానికి తను సిద్ధంగా లేదు. వేణు తనని ఆదర్శవివాహం చేసుకున్నాడని, నాశనం కాబోయే తన భవిష్యత్తుని సానుభూతితో కాపాడాడని అతనికి కృతజ్ఞతగా పడి ఉండాల్సిన ఆగత్యం తనకి లేదు. జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించి మర్చిపోయి, వేణుతో రాజీపడి అతని పిల్లలకి తల్లిగా, అతని భార్యగా, ఒక సాధారణ గృహిణిగా బతికే బలహీనత తనలో లేదు. చిన్నప్పటినుంచీ తన రక్తంలో జీర్ణించుకుపోయిన తిరుగుబాటుతనం, విప్లవభావాలు చంపేసుకుని నచ్చని జీవితంతో, తను ఆహ్వానించలేని జీవితంతో రాజీపడి బతికే పెద్ద హృదయం అంటారా లేక బలహీనత అంటారా లేక మంచితనం అంటారా? ఏ పేరు పెడతారో ఈ సంప్రదాయవాదులు, ఆ పేర్లు ఏవన్నా కానీ, తనకి అవసరం లేదు.
తన ఇష్టం లేకుండా తన కడుపులో పడిన శిశువుని ఈ భూమ్మీదకి తీసుకొచ్చే అవసరం తనకేంటి? అవసరం కాదు బాధ్యత. కర్తవ్యం. నీ ప్రాథమిక హక్కుల కోసం నువ్వెంతగా తపిస్తున్నావో తనకీ జన్మించే హక్కుంది. అది కాదనే హక్కు నీకు ఎంత మాత్రం లేదు. నీ సుఖం కోసం, నీ స్వేచ్చ కోసం హత్య చేసే అధికారం నీకుందా? ఎవరో కొరడాతో చెళ్ళున కొట్టినట్టు అనిపించింది.
ఉలిక్కిపడింది. హత్యా! ఇంకా ఒక రూపమే రాని రక్తపు ముద్దని తీసేయడం హత్య అవుతుందా? ప్రతి నెలా మూడు రోజులు తన శరీరంలోంచి ఎంతో రక్తం పోతోంది. అది చెడురక్తం. మరి ఇది. ఇది చెడు రక్తం కాదా?
అలా అని నీ తల్లి కూడా అనుకుని ఉంటే నువ్వెవరివి?
మెదడు ఆలోచనలతో బరువెక్కింది. ఏం చేయాలో తెలియని స్థితి. ఏం చేస్తోందో కూడా అర్ధం కాని పరిస్థితి. ఎవరన్నా కదిలిస్తే భళ్ళున బద్దలయ్యే నీళ్ళ కుండలా ఉంది ఆమె హృదయం బరువుగా, బాధగా.
అర్చన తల విదిలించింది. ఈ ఆలోచనల నుంచి బైటపడాలి. ఈ సుడిగుండంలో చిక్కుకుని గిలగిలా తన్నుకుని చావలేకా, బ్రతకలేకా...నో అలా జరక్కూడదు. ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఎవరు చెప్పగలరు?
అర్చనకి హఠాత్తుగా గుర్తొచ్చింది. జానకి... జానకి మేడమ్. తను చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ జానకి. ఆవిడకి తనంటే చాలా ఇష్టం. బి.యస్సీ ఫస్ట్ క్లాస్ లో పాసయిందని తెలిసి ఎన్నోసార్లు కబురు చేసింది. ఎమ్మెస్సీలో చేరి, కెమిస్ట్రీలో పి.హెచ్.డి. చెయ్యి. జరిగిన సిల్లీ సంఘటన మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు అంటూ.
యస్... ఆవిడని కలవాలి. ఆవిడ ఉండి ఉంటారా? ఆమె ఇంకెక్కడికీ వెళ్ళి ఉండరు కదా! రిటైరు అయి ఉండరు కదా! లేదులే. అప్పుడే రిటైర్ అవరు. ఆవిడ తప్పకుండా ఉంటారు. ఆమెని కలవగలిగితే చాలు తనకి కొండంత ధైర్యం వస్తుంది.
అలా ఆలోచించాక అర్చనకి కొంచెం రిలీఫ్ గా అనిపించింది. హమ్మయ్య! సునామీలో కొట్టుకుపోతున్న చిన్న పక్షికి ఓ చిటారుకొమ్మ లభించినట్టు.
రోడ్డు మీద నిలబడి ఆలోచిస్తున్నట్టు అప్పుడే స్పుహ వచ్చింది. వెంటనే అటుగా వెళుతోన్న ఆటో పిలిచింది. తను చదువుకున్న కాలేజీవైపు వెళ్ళమంది. సముద్రం మీంచి వీస్తున్న గాలి హాయిగా ఉంది. విశాఖ.... ఈ పేరులోనే ఏదో హాయి ఉంది. ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణలో అడుగు పెట్టడానికి తహతహలాడింది. సరిగ్గా ఆ సమయం వచ్చేటప్పటికి తన జీవితనౌక మునిగిపోయింది. దీనిని బైటకి తీసి డామేజిని బాగుచేసి మళ్ళీ కదిలించాలి. తన ఆశయాల నదిలో హాయిగా సాగాలి.
