సరిగ్గా పదిరోజుల తరువాత కొద్దిగా స్వాంతన చేకూరింది.
"ఇల్లు అమ్ముడుపోయిందమ్మా. మీరు నాతో వచ్చేయండి. ఇదిగో ఈ యాభైవేలు దానికిచ్చి ఎక్కడికి పోతుందో పొమ్మను. నా దగ్గరికి మాత్రం రావద్దు. నేనక్కడ పరువుగా బతుకుతున్నా."
అన్నగారి స్వరం.
అర్చన మనసంతా నిర్వికారంగా అయిపోయింది. తల్లి చేతిలో ఉన్న డబ్బు వైపు చూడలేదు. ఆవిడ పిలుపు వినలేదు. బైటకి వచ్చేసింది.
రోడ్డు మీదకు వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాలేదు. అస్పష్టంగా డాక్టరు మాటలు చెవుల్లో వినిపిస్తున్నాయి.
తను గర్భవతి. ఏదైతే జరగద్దు అనుకుందో అదే జరిగింది.
వేణు పశుత్వానికి తన భవిష్యత్తు బలైపోతోంది. వద్దు వద్దు అనుకుంటూనే సంసారం ఉచ్చులో బిగుసుకుపోతోంది.
ఏ గమ్యం కోసం వేణు ప్రేమని తిరస్కరించిందో, ఏ కలలు నిజం చేసుకోడానికి తనని ప్రేమించిన, ప్రేమిస్తున్నానన్నవారందరినీ ఒక చూపుతో దూరంగా నిలబెట్టిందో ఇవాళ అవన్నీ గర్భంతో సమాప్తం. ఇంక వేణు భార్యగానే బతకాలి. అతని పిల్లలకి తల్లిగా, వాళ్ళింటి కోడలిగా ఒక సామాన్య స్త్రీలా బతకాలి.
అసలు ఈ స్థితికి కారకుడైనవాడు వాడు నాగరాజు. అర్చన ఆవేశంతో నిలువెల్లా వణికింది. వాడిని వాడినేం చేసినా పాపం లేదు. అన్యాయంగా తన జీవితంతో ఆడుకున్న ఆ నాగరాజు మీద ప్రతీకారం తీర్చుకోనీకుండా మౌనంగా జీవితంతో రాజీపడి బతకమని అందరూ తనని ఆదేశించారు. తన ప్రతిఘటనని ఎవరూ పట్టించుకోలేదు.
తన తప్పు లేకుండా జరిగిన ఒక నీచమైన పరిస్థితికి చిలవలు, పలవలు అల్లుకుని ఏదో జరిగిందని, ఆ జరిగిందానికి పరువుకోసం, కుటుంబ ప్రతిష్ఠ నిలపడం కోసం ఇష్టంలేనివాడిని భర్తగా జీవితాంతం భరించమన్నారు. ఆ ఒక్క సంఘటనను తనకు అనుకూలంగా మార్చుకుని తనని సాదించాలనుకున్న వేణు ప్లాన్ కి లొంగిపోయేలా చేశారు. తల వంచి తాళి కట్టించారు. వేణు పట్ల కృతజ్ఞతతో అతనితో సంసారం చేస్తూ జీవితాంతం రాజీపడమన్నారు.
ఇది న్యాయమా? ధర్మమా? ఎందుకు రాజీపడాలి? ఆమెకి దుఃఖం పొర్లి పొర్లి వస్తోంది. ఎవరున్నారు తన ఆవేదన పంచుకోడానికి? మాధవి సరిగ్గా సమయానికి అందుబాటులో లేదు. ఉన్నా మాధవి కూడా రాజీపడమనే చెపుతుంది. తన బాధ అర్ధం చేసుకుందా ఏనాడైనా? వేణు వైపే మాట్లాడుతుంది. ఎంతైనా వేణు స్నేహితుడి భార్య తనకి న్సేహితురాలు కాగలదా? తనవైపు నుంచి ఆలోచించగలదా? గాఢంగా నిట్టూర్చింది అర్చన.
సడన్ గా నీలిమ గుర్తొచ్చింది. తనకున్న ఒకే ఒక ఆప్తురాలు నీలిమ. ఐదేళ్ళ స్నేహం. తన మనసు తెలుసు, తన ఆశయం తెలుసు. తన కలలు తెలుసు. నీలిమకి తన కల తెలుసు. యస్. నీలిమ దగ్గరకి వెళ్ళాలి. ప్రస్తుతం తనని ఆదుకోడానికి ఉన్నది నీలూనే. అర్చన మనసుకి కొంచెం ఊరట లభించినట్టు అయింది. హమ్మయ్య.... చిరుచీకట్లో చిన్న ఆశాకిరణం నీలు.
అర్చన ఒక నిర్ణయానికి వచ్చినదానిగా ఆటో పిలిచింది. ఎక్కి కూర్చుని రామకృష్ణ చీచ్ కి పోనీయమంది. ఆటో కదిలింది. వేడిగాలి ఒక్కసారిగా మొహాన్ని తాకింది.
నీలిమ, అర్చన ఇంటర్ నుంచి డిగ్రీదాకా క్లాస్ మేట్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాదాపు రెండేళ్ళు నీలిమవాళ్ళు కూడా అర్చన ఇంటి పక్కనే అద్దెకుండేవాళ్ళు. నీలిమ పేరెంట్స్ కి కూడా అర్చనంటే ఎంతో ఇష్టం. అర్చన తెలివితేటలు, చలాకీతనం వాళ్ళకి ఎంతో ఇష్టం. నీలిమ కొంచెం పిరికిగా ఉండేది. నలుగురిలోకి వెళ్ళడానికి జంకేది. నీలిమకి కొంచెం ధైర్యం, చొరవ నేర్పమని అస్తమానం చెప్పేవాళ్ళు. ఆ తరువాత రామకృష్ణా బీచ్ దగ్గరగా ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుని షిఫ్ట్ అయిపోయారు. ఆ ఫ్లాట్ కి అర్చన చాలాసార్లు వెళ్ళింది కూడా. తప్పకుండా తనకి ఆశ్రయం ఇస్తారు. నీలిమకి అన్ని విషయాలు చెప్పుకుంటే మనసుకి కొంచెం శాంతి లభించవచ్చు, కన్నతల్లి కడుపులో పెట్టుకుంటుందని ఆశ పడింది. కానీ ఆవిడ కొడుకు చేతిలో బానిస. కొడుకు ఎలా ఆడితే అలాగే ఆడుతుంది.
ఆటో ఆగింది. అర్చన డబ్బులిచ్చి ఒక్కసారి నిలబడి అపార్ట్ మెంట్ ని పైదాకా చూసింది. ఐదు అంతస్థులు మూడో అంతస్తులో నీలిమ వాళ్ళ ఫ్లాటు.
కార్ పార్కింగ్ దాటి లిఫ్ట్ దగ్గరకి సూట్ కేసు లాక్కుంటూ వెళ్ళింది. లిఫ్ట్ లో మూడో అంతస్తు చేరుతోంటే ప్రాణ స్నేహితురాలిని కలుస్తున్నానన్న ఆనందంతో ఒక్క క్షణం మనసు దూదిపింజలా తేలిగ్గా అయినట్లనిపించింది.
కాలింగ్ బెల్ మీద కుడిచేయి చూపుడువేలు పెట్టి నొక్కింది. రెండు క్షణాల్లో తలుపు తెరుచుకుంది.
ఎదురుగా నీలిమ తల్లి జగతి. "నమస్తే ఆంటీ" నవ్వింది అర్చన.
ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం. "నువ్వా? ఎక్కడ్నించి వస్తున్నావు అర్చనా? రా రా లోపలికి రా" పక్కకి తప్పుకుని అర్చనని ఆహ్వానించింది.
"ఎవరు జగతీ?" అంటూ లోపల్నించి వచ్చిన ఆనంద్ అర్చనని చూసి ముందు ఆశ్చర్యపోయి, అర్చన "బాగున్నారా అంకుల్?" అనడంతో "ఆ బాగున్నాను. నువ్వెలా ఉన్నావు?" అడిగాడు. కానీ, ఆ అడగడంలో మునుపటి ఆప్యాయత కనిపించలేదు.
"నీలూ లేదాంటీ?" అడుగుతూ సూట్ కేసు ఒకపక్కగా గోడకానించి లోపలికి తొంగి చూసింది అర్చన.
"నీలూనా? తన పెళ్ళయింది. స్టేట్స్ కి వెళ్ళిపోయింది. నీకు తెలియదా?" జగతి ఆశ్చర్యంగా అడిగింది.
"వాట్....నీలూ పెళ్లయిందా? నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నీలూ పెళ్ళి చేసుకుందా? ఎంత అన్యాయం?"
"మీ ఇంటికి కార్డు పంపించాం. మీ అమ్మగారు చెప్పలేదా? పెళ్ళయి రెండు నెల్లయింది. వెంటనే అమెరికా వెళ్ళిపోయింది."
"అమ్మ నాకేం చెప్పలేదు. అయినా నేను అమ్మని అడగలేదు" అంటూనే ఆలోచనలో పడింది అర్చన. అమ్మా, తనూ ఈ విషయాలు మాట్లాడుకునే సమయం, సందర్భం ఏం వచ్చిందని? తన రాకే అనుకోని అతిథి రాకలా ముగ్గురూ భావించి ఇబ్బంది పడ్డారు.
"ఎప్పుడొచ్చావు హైదరాబాదు నుంచి. మీ అమ్మగారు, నాన్నగారు బాగున్నారా? పాపం నీ వలన చాలా మానసిక క్షోభ అనుభవించారు. అయినా ఆడపిల్ల కొంచెం ఒదిగి ఉండాలి అర్చనా! మగాళ్ళతో సమానంగా కయ్యానికి కాలు దువ్వితే నష్టపోయేది మనమే. నీ అందానికి, నీ తెలివితేటలకి కొంచెం వినయం, సహనం, మన్నన ఉండి ఉంటే మా నీలూలాగా మంచి ఫారెన్ సంబంధం వచ్చేది. చూడు గతిలేక చేసుకున్నట్టయింది. ఇంతకీ మీ ఆయనకి ఏదన్నా ఉద్యోగం దొరికిందా? ఎలా ఉన్నారు? నిన్ను బాగానే చూసుకుంటున్నాడా?"
