కాలేజీ గేటు దగ్గర ఆటో ఆగగానే నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచింది.
ఒక్కసారిగా మనసుకు రెక్కలొచ్చినట్టు అనిపించింది. నాటి రోజులు ఎంత బాగుండేవి. ఎంత అద్భుతమైనది విద్యార్ధి జీవితం.... అందులోనూ కాలేజీ విద్యార్ధి జీవితం ఎంత అందంగా, ఎంత చలాకీగా ఎన్నో ఆశలు, ఏవేవో కోరికలు.....ప్రేమలేఖలు, అల్లరి చేష్టలు, లేకి చూపులు తమాషా జీవితం ఆడైనా, మగైనా జీవితంలో చేరే అతి ముఖ్యమైన మజిలీలో అప్ప్డుడప్పుడూ గుర్తుచేసుకుని ఆనందించడానికి పోగేసుకనే అందమైన అనుభూతులు కాలేజీ అనుభవాలు.
పాతవాళ్ళెవరూ లేరు. అన్నీ కొత్త మొహాలు. అందంగా, చలాకీగా ఉన్నారు. అందరి మొహల్లో ఎంతో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. ఫ్యాషన్ ప్రపంచం తెచ్చిన మార్పు. సుమారు రెండేళ్ళు కాలేజీనుండి బైటకి వచ్చి. రెండేళ్ళలో ఎంత మార్పు. ఆడపిల్లల్లో ఏదో ధైర్యం కనిపిస్తోంది. వాళ్ళ నడకలో, నవ్వులో వ్యక్తిత్వం, ధీమా. ఎక్కడినుంచి వచ్చింది వీళ్ళకీ ధీమా. కాలం తెచ్చిన మార్పా? ఎంత మంచి మార్పు! వాళ్ళందరినీ గమనిస్తూ ప్రిన్సిపాల్ రూం దగ్గరకు వచ్చింది. గుమ్మం పక్కన స్టూలు మీద కూర్చున్న ఫ్యూన్ సింహాచలం అర్చనని గుర్తుపట్టి చప్పున లేచాడు. "బాగున్నారా అమ్మాయిగారూ!" విప్పారిన మొహంతో ఆప్యాయంగా పలకరిస్తున్న సింహాచలాన్ని చూడగానే ఎంతో ధైర్యం వచ్చింది అర్చనకి.
"బాగున్నాను సింహాచలం! నువ్వెలా ఉన్నావు?"
"నాకేం తల్లీ! మీ అందరి దయవల్ల హాయిగా ఉన్నాను. నీ జీవితమే అన్యాయమైపోయింది. ఆ ము..... సుబ్బరంగా తిరుగుతున్నాడు. లక్షల కట్నం తీసుకుని పెళ్ళి చేసుకున్నాడు."
స్థాణువైంది అర్చన. వాడు.... వాడు పెళ్ళిచేసుకున్నాడా? అదీ కట్నంతో. ఎవరిచ్చారు వాడికసలు ఆడపిల్లని. వాడొక రాక్షసుడు. ఆనాటి రావణాసురుడికి కొంచెం నీతి ఉంది. నేటి రావణాసురుడైన ఆ వెధవకి నీతిలేదు. నియమం లేదు. అలాంటివాడికి లక్షల కట్నం ఇచ్చి అమ్మాయి జీవితాన్ని పణం పెట్టిన ఆ తల్లితండ్రులెవరో!
"పోనీలేమ్మా! బంగారంలాంటి కుర్రాడు మిమ్మల్ని కోరి పెళ్ళిచేసుకున్నాడు. సుఖంగా ఉన్నారు కదా!"
అర్చన తడబడుతూ అంది "ఆ బాగున్నాను.....మేడమ్ ఉన్నారా సింహాచలం?"
"మేడమ్ రిటైర్ అయ్యారమ్మా. నాలుగు నెలలైంది."
"రిటైర్ అయారా? అప్పుడేనా?"
"ఆవిడ కూతురు అమెరికా వెళ్ళింది కదమ్మా! ఆవిడకి పిల్లలు. వాళ్ళని చూడ్డానికి అమ్మగారు వెళ్ళాల్సి వచ్చింది. ఆవిడక్కూడా ఆరోగ్యం బాగోలేదు. అందుకే వాలంటరీ రిటైర్మెంటు తీసుకున్నారు."
"అంటే.... అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నారా?"
"లేదమ్మా! వెళ్ళి వచ్చారు, వచ్చి కూడా పదిరోజులైంది. మన దగ్గరనుంచి రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి. వాటికోసం వచ్చి వెళుతున్నారు. నిన్న వచ్చారు. ఈ రోజు రాలేదు."
"మేడమ్ ఇల్లు తెలుసా సింహాచలం?"
"తెలియకేం.... తెలుసమ్మా!"
"నన్ను తీసుకెళతావా అక్కడికి? అమ్మగారితో చాలా పనుంది నాకు."
"అలాగే తల్లీ! ఇంకో అరగంటలో కాలేజీ అయిపోతుంది. వెళదాం. కాస్సేపు కూర్చోండి."
"అలాగే" అర్చన కూర్చోడం కోసం చుట్టూ చూసింది. రూమ్ గుమ్మానికి బైట రెండు పక్కలా బెంచీలున్నాయి. ఆమె చూపులు గ్రహించినవాడిలా అన్నాడు సింహాచలం. "లోపల కూర్చోమ్మా!"
"వద్దులే సింహాచలం. అలా ఒక్కసారి కాలేజీ మొత్తం చూసి వస్తాను."
"వెళ్ళిరా తల్లీ" సింహాచలం చూపుల్లో కనిపిస్తున్న ఆప్యాయతకి చలించి పోయింది అర్చన, చదువూ, సంధ్యా లేని ఈ వ్యక్తిలో ఉన్నపాటి సంస్కారం కూడా తనవాళ్ళెవరికీ లేదు.
నిట్టూర్చి నెమ్మదిగా అక్కడినుంచి కదిలి తను తిరిగిన పరిసరాలను చూడడానికి బయలుదేరింది.
* * * * *
వేణు ప్రజ్ఞ దగ్గర్నించి బయలుదేరి నేరుగా ఇంటికి వెళ్ళకుండా పార్కుకెళ్ళి కూర్చున్నాడు. అదృష్టం బాగుంది కాబట్టి ఉదయం తాను చెప్పిందేదీ తండ్రి వినలేదు. విని ఉంటే కథలో వచ్చిన చిత్రమైన మార్పుని అబద్ధంగా కొట్టేసేవారు. అర్చన దోషిగా మిగిలిపోయేది ఆయన దృష్టిలో ఇప్పుడు అర్చన సంగతి, తన సంగతి పక్కన పెడితే తామిద్దరూ చేసిన తప్పుకి ఒక పసిప్రాణం బలి కాకూడదు.
బాబు తన రక్తం. వేణు ఛాతీ ఉప్పొంగింది. నేను తండ్రినయానా? దోషి అయితే అయాను. కానీ తండ్రినయాను. చాలు......చక్రవర్తి ఇచ్చిన స్ఫూర్తితో ఆ రోజలా తాను రెచ్చిపోకుండా ఉండి ఉంటే ఎప్పటికీ తండ్రి అయేవాడు కాదు. అది కూడా అర్చన ద్వారా. ఇప్పుడు అర్చన లేకపోయినా ఆమె ప్రతిరూపం బాబు ఉన్నాడు. బాబులో అర్చనని చూసుకుంటూ బతికేయచ్చు.
అర్చనని ఎంత ప్రేమించాడు! ఎంత ఆరాధించాడు! ఆమె తనని ఒక గడ్డిపోచలా తీసేసినా, అవమానించినా ఆమె వెంటపడి, ఆఖరికి ఆ రోజు ఆ సంఘటన జరక్కపోయి ఉంటే అర్చన తనకి దక్కేదా? ఆమె ఆశలు, ఆశయాలు చాలా ఉన్నతమైనవి. వాటిని దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తన ప్రేమని అంగీకరించేది కాదు. ఒక విధంగా ఆ సంఘటన ఆమెకి శాపం. తనకి వరంగా పరిణమించింది. కానీ, ఇప్పుడు అనిపిస్తోంది. అది వరం కాదు, ఇద్దరికీ శాపమే అని.
"సార్! పల్లీ సార్! పల్లీ కావాలా?"
ఆలోచనలు చెదరగొట్ట్టిన ఆ కుర్రాడి మీద బాగా కోపం వచ్చింది వేణుకి. తమాయించుకుంటూ "వద్దు" అన్నాడు.
"తీసుకోండి సార్. ప్లీజ్ సార్" ప్రాధేయపూర్వకంగా అడిగాడా కుర్రాడు.
వేణుకి కొంచెం జాలేసింది. వాడిని అక్కడినుంచి పంపేస్తే మళ్ళీ అర్చన గురించిన ఆలోచనలోకి వెళ్ళిపోవచ్చన్నట్టుగా జేబులోంచి పది రూపాయల నోటు తీసి పల్లీలు కొన్నాడు. కుర్రాడు హుషారుగా "పల్లీ పల్లీ" అని అరుస్తూ వెళ్ళిపోయాడు.
పదేళ్ళ ఆ కుర్రాడిని చూస్తుంటే వేణుకేదోలా అనిపించింది. చదువుకోవాల్సిన వయసులో వాడికీ ఖర్మేంటి? ఏ తల్లి కని వదిలేసిందో పాపం ఇలా బాలకార్మికుడిగా బతకాల్సి వచ్చింది.
బాలకార్మికుడు... వేణు సడన్ గా ఏదోగా అనిపించింది. బాలకార్మికుడిగా ఎందుకయాడు? వాడి తల్లి, తండ్రి వదిలేశారా వాడిని. తల్లి, తండ్రి వదిలేసిన పిల్లలు ఇలా అవుతారు. అవును.
