"ఈ విషయం ఒక్కటే కాదు నాన్నా! మీ దగ్గర మరో విషయం దాచాను. అందుకే నా కన్నతల్లిదండ్రులను మోసగించినందుకే నేనివాళ ఇలా అనుభవిస్తున్నాను. నన్ను క్షమించండి." బావురుమంటూ ఆయన ఒళ్ళో వాలిపోయాడు వేణు.
ఆయన మనసు ఆర్ద్రమైంది. అతని పట్ల వాత్సల్యంతో, అభిమానంతో గుండె కరిగిపోయింది. అప్రయత్నంగా అతని వీపు మీద చేయి వేసి నిమురుతూ "ఎందుకు నాన్నా! ఇంత గరళాన్ని గొంతులో అదిమిపెట్టి, అమ్మనీ, నాన్ననీ మోసం చేస్తూ బతుకుతున్నావు?మేము చచ్చామనుకున్నావా?"
"అంత మాటనకండి నాన్నా! ప్లీజ్. ప్లీజ్ జరిగిందేవిటో, ఏ పరిస్థితుల్లో నేను అర్చనని పెళ్ళిచేసుకోవాల్సి వచ్చిందో చెపుతాను. మీరనుకున్నట్టు నేను అర్చనని గాఢంగా ప్రేమించిన మాట నిజం. తను కావాలని తపించిపోయింది నిజం. కానీ, అర్చనకి నేనంటే ఇష్టం లేదు. అయితే, మా పెళ్ళి ఎలా జరిగిందని మీకు అనుమానం రావచ్చు. చెపుతాను" వేణు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. జరిగిన సంఘటనలు మరోసారి మనోఫలకం మీదికి తెచ్చుకుని వాటిని తండ్రికి కన్విన్స్ చేసేలా చెప్పడం కోసం రిహార్సల్స్ వేసుకుంటున్నవాడిలా ఉండిపోయాడు. పనిపిల్ల అరటిపళ్ళు తెచ్చిచ్చింది.
"పండు తినండి నాన్నా!" పండు అందించాడు.
ఆయన వేణు చేతిలోంచి ఆ పళ్ళు తీసుకుని వంటగదిలోకి నడిచి, సింక్ లో పంపు తిప్పి పళ్ళను కడిగాడు.
కడిగిన పళ్ళల్లోంచి నాలుగు పళ్ళు ఒక ప్లేట్ లో పెట్టుకుని, తిరిగి వేణు దగ్గరకు వచ్చాడు.
ఒక అరటిపండు తీసుకుని, కొద్ధిగా తొక్క వలచి, పండు వేణు నోటికి అందించాడు.
వేణు కళ్ళల్లో మరోసారి నీళ్ళు తిరిగాయి. ఎంత ప్రేమ అమ్మా, నాన్నలకి తనంటే. ఒక్కడే కొడుకని ఎంత గారాబంగా పెంచారు. తను కలెక్టర్ కావాలని కలలు కన్నారు. అడిగినంత డబ్బిచ్చి, విశాఖపట్నంలో చదివించారు. డిగ్రీ కాగానే 'సివిల్ సర్వీసెస్ కి రాయి నాన్నా. మంచి ర్యాంకు తెచ్చుకుని, కలెక్టర్ వై మన ఊరికి నేను పుట్టి పెరిగిన ఈ ఊరికి నువ్వు కలెక్టర్ గా రావాలి ర' అంటూండేవాడు నాన్న. అమ్మ సెలవులకి వెళ్ళినప్పుడల్లా సున్నుండలు, వెన్నుండలు అంటూ బలం పెంచే పిండివంటలు చేసి పెడుతూ, కొసరి కొసరి కమ్మటి వంటలు వడ్డిస్తూ, 'బాగా చదువుకో నాన్నా! పట్నంలో మగపిల్లలు గాలికి తిరుగుతారని అంటున్నారు. మన ఊళ్ళోవాళ్ళ ఆలోచన తప్పని నిరూపించాలి' అంటూ హితవు చెపుతుండే అమ్మ. ఎంత వాత్సల్యం, ఎంత కరుణ, ఎంత ప్రేమ! చీమక్కూడా హాని చేయని అమాయకులు అమ్మా, నాన్నా.
ఆ రోజు అర్చనని మెడలో మంగళసూత్రంతో ఇంటికి తీసికెళ్ళేరోజు తనెంతగా భయపడ్డాడు.
కానీ ఏం జరిగింది? ఆ దంపతులు ముందు నిర్ఘాంతపోయినా, గంటసేపు తనతో మాట్లాడకపోయినా, కొద్దిసేపట్లోనే కోడల్ని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి, మా కోడలు అంటూ ఊరందరికీ పరిచయం చేసుకున్నారు.
ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంటూ మరోసారి ఊళ్ళోవాళ్ళ కోసం పెళ్ళంత ఆర్భాటం చేసి, సత్యనారాయణ వ్రతం చేయించారు.
అర్చన మెడ వంగిపోయేన్ని నగలతో అలంకరించింది అమ్మ. ఆ నగలు అమ్మకి వాళ్ళ పుట్టింటివాళ్ళు ఇచ్చినవి. అయినా ఇవి నీకే తల్లీ అంటూ అర్చనకి ఇచ్చింది. "మహాలక్ష్మిలా నట్టింట అడుగుపెట్టావు. కంటనీరు పెట్టొద్దమ్మా" అంటూ అర్చన తడి కళ్ళను తన చెంగుతో అద్ది, అక్కున చేర్చుకుంది అమ్మ.
అలాంటివాళ్ళని తను వంచించాడు. అదే కాదు. అర్చన కూడా. అర్చన చేసిన వంచన, మోసం భయంకరమైనది. అటు వాళ్ళనీ, ఇటు తననీ ఘోరంగా, దారుణంగా మోసం చేసింది.
వేణు రక్తం సలసలా మరిగినట్టు అయింది. పైగా, పైగా పిల్లవాడిని తీసుకొచ్చి తనవాళ్ళ దగ్గర దింపిందిట. వాడు నా కొడుకా? ఛీ, ఛీ కాపురమే చేయనప్పుడు కొడుకెలా పుడతాడు?
ఎవరై ఉంటాడా పిల్లాడు? అర్చన పెళ్ళి చేసుకుందా? లేదు అలా జరగదు. పెళ్ళి చేసుకునే ఉద్దేశమే ఉంటే తనని వదిలి ఎందుకు వెళుతుంది? అయితే ఎవరా బాబు? కొంపదీసి ఆమె జీవితంలో ఏదన్నా దుర్ఘటన.....ఒక్కసారి వేణు వణికిపోయాడు.
ఎంత సహనం వహించాడు. ఎంత ప్రేమించాడు. అర్చన మనసు మారాలని, మారుతుందని ఎంత ఆశపడ్డాడు. ప్రేమించిన యువతి, కోరుకున్న యువతి భార్య అయి, ఒక ఇంట్లో కలిసి బతుకుతూ, తనని వెలేసి ముట్టుకోనివ్వలేదు. ఆఖరికి అఖరికి ఆ రోజు వేణు ఆలోచనలు హఠాత్తుగా ఆగిపోయాయి.
"చెప్పు వేణూ! ఏదో చెపుతానన్నావు?" కృష్ణస్వామి మాటలకి ఉలిక్కిపడ్డాడు.
ఒక్కసారి గాఢంగా నిట్టూర్చి అన్నాడు. "చెపుతాను నాన్నగారూ! మీకిప్పుడు నేను చెప్పి తీరాలి. ఇప్పటికీ చెప్పలేకపోతే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నానన్నమాట!"
ఆయన మంచంమీద వెనక్కివాలి, దిండుకి తల ఆన్చి అతనివైపు సూటిగా చూశారు.
"ఏం జరిగింది? ఏ విషయంలో నన్ను మోసం చేశావు ఇప్పటిదాకా?"
మరోసారి ఉలిక్కిపడ్డాడు వేణు. ఆయనంత సూటిగా అడుగుతాడనుకోలేదు.
మౌనంగా ఉన్న వేణుని రెట్టిస్తూ అడిగాడాయన. "చెప్పరా! ఏ విషయంలో మోసం చేశావు? నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుని, నువ్వేం చేసినా మనసారా దీవించిన మమ్మల్ని మోసం చేయాల్సిన అగత్యం ఎందుకొచ్చింది?"
'అవును ఎందుకొచ్చింది? ఒకే ఒక్కకొడుకని ఎంతో ప్రేమగా, అడిగిందల్లా కాదనకుండా, లేదనకుండా చేసిన అమ్మానాన్నల్ని మోసం చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది?' వేణు మనసులో తనని తను పదే పదే ప్రశ్నించుకోసాగాడు.
"మోసం చేయాలని చేయలేదు నాన్నగారూ! పరిస్థితులు అలా వచ్చాయి. అంతే ఆ పరిస్థితుల్లో నేనలా చేయాల్సి రావడం నా దురదృష్టమో, అర్చన అదృష్టమో నాకు తెలియదు. కానీ కానీ..." నెమ్మదిగా తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు. "నాక్కొంచెం టైం కావాలి నాన్నా!"
కృష్ణస్వామి మౌనంగా తల పంకించాడు. 'వీడి మనసు దెబ్బతింది. నెమ్మదిగా చెప్తాడులే' అనుకుంటూ తలగడ మీదకి వాలి కళ్ళుమూసుకున్నాడు.
వేణు మనసంతా గందరగోళంగా ఉంది. అర్చన ఏ మాత్రం విశ్వాసం లేని స్త్రీ సిగ్గు లేకుండా ఎక్కడెక్కడో తిరిగి, ఎవరికో పిల్లవాడిని కని, తన తల్లితండ్రుల వద్ద ఆ పల్లెటూళ్ళో వదిలిపెట్టి వెళ్ళడమా? ఎంత ధైర్యం అతనికి కంపరంగా అనిపించింది. పుట్టి పెరిగిన ఊళ్ళో, తరతరాల నుంచీ ఒక గౌరవనీయమైన కుటుంబంగా ఊరి ప్రజలందరి అభిమానం, మన్నన పొందుతూన్న కృష్ణస్వామిగారు, భ్రమరాంబగారు ఇవాళ వారి కోడలు చేసిన పనికి తలెత్తుకోలేని వాళ్ళయ్యారు. ఏ ఊళ్ళో అయితే మహారాజుల్లా తిరిగారో ఆ ఊళ్ళో ఇవాళ చేయని నేరానికి వాళ్ళిద్దరూ నేరస్తులుగా తిరగాలి. ఎంత ధైర్యం అర్చనకి. ఎవరికి కన్నబిడ్డనో తీసుకువచ్చి మీ మనవడు అని వదిలిపెట్టడానికి ఆమెకెంత ధైర్యం కావాలి!
