అతని చేతులు కంపించడం ఆయన దృష్టిలో పడింది. నెమ్మదిగా గ్లాసు అందుకని "కూర్చో వేణూ" అన్నాడు.
వేణుకెందుకో భయం వేసింది. నాన్న ఎందుకలా ఉన్నారు? అసలు ఇంత సడన్ గా ఎలా వచ్చారు? ఇంతకు ముందెప్పుడూ హైదరాబాదు రాని మనిషి ఎలా వచ్చారు? ఈయన లేకపోతే గుడి తలుపులు కూడా తీయరే. పైగా ఇది ధనుర్మాసం. ఎలా వచ్చారు? కొడుకూ, కోడలి దగ్గరకి వచ్చానన్న ఆనందం కానీ, ఉత్సాహం కానీ లేదీయనలో. వస్తూనే అమ్మాయేది? అంటూ చాలా పొడిగా ప్రశ్నించారు. ఎక్కడికెళ్ళిందన్న ఆరాటం కానీ, కుతూహలం కానీ కనిపించలేదు. చాలా మామూలుగా, నిర్వికారంగా అడిగారు. ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది. నాన్నకి అర్చన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెలిసిపోయిందా?
"వేణూ....అర్చన వచ్చింది."
వేణు పక్కన బాంబు పడ్డట్టుగా అదిరిపడ్డాడు. విహ్వలంగా చూశాడు తండ్రివైపు. "అ... అర్చన వచ్చిందా? ఎ...ఎక్కడికి? ఎప్పుడు?"
ఆయన తలెత్తి సూటిగా కొడుకువైపు చూస్తూ, అమ్ముల పొదిలో దాచిన బాణాలు ఒక్కొక్కటే సంధిస్తున్నవాడిలా అన్నాడు. "అర్చన మన ఊరుకి వచ్చింది నిన్న తెల్లవారుఝామున, బాబుని తీసుకొచ్చి, గుడిమెట్ల మీద వదిలిపెట్టి, తిరిగి వెంటనే వెళ్ళిపోయింది. మాకెవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది."
వేణు తెల్లబోయి చూస్తూ వింటున్నాడు. "బాబుని.... ఎవరి బాబుని?" అయోమయంగా అడిగాడు.
"నీ కొడుకుని."
"నో" గట్టిగా అరిచాడు. "నో నా కొడుకా? అలా జరగడానికి వీల్లేదు. అసలా అవకాశమే లేదు."
ఈసారి ఆయన తెల్లబోయి చూశాడు. "అంటే అంటే ఏంటిరా నువ్వనేది? వాడు నీ కొడుకు కాదా?"
"కాదు నాన్నా. ఎంతమాత్రం కాదు. నా కొడుకసలు కాదు. ఆ అవకాశం లేదు."
"అదేంటి? అర్చన నీ భార్య."
"కావచ్చు. కానీ, మా మధ్య ఆ సంబంధమే లేదు. ఆ అన్యోన్యత, ఆ ప్రేమా ఏవీ లేవు. అర్చన నాతో బలవంతంగా బతికింది అదీ కొంతకాలం. నిజం నాన్నా. కేవలం తొమ్మిది నెలలు అంతే. నా నుంచి పారిపోయింది. ఆమె మనసులో నాకు చోటు లేదు. నేనంటే ఆమెకిష్టం లేదు. అందుకే... అందుకే నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఏడాది కావస్తోంది. అవును నాన్నా! అర్చన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది" వేణు రెండు చేతుల్లో మొహం దాచుకుని, మోకాళ్ళ మీద వంగాడు.
"ఎక్కడికి? ఎక్కడికెళ్ళింది?"
"నాకు తెలియదు నాన్నా! నాకేం తెలియదు. నన్నేం అడక్కండి." వేణు స్వరంలోని వేదన ఆయన గుండెల్ని పిండేసినట్టుగా అనిపించింది. ఆప్యాయంగా కొడుకు తలమీద చెయ్యి వేసి, జుట్టు సవరిస్తూ అన్నాడాయన.
"ఏం జరిగిందిరా? మీ ఇద్దరి మధ్యా ఏదన్నా గొడవైందా? సంసారం అన్నాక గొడవలు మామూలు నాన్నా దానికోసం..."
వేణు చివ్వున తలెత్తి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. "నాన్నా! మీకు తెలియదు. అర్చన నాకు లోకం కోసమే భార్య. అవును కేవలం లోకం దృష్టిలో మాత్రమే నా భార్య నాన్నా మా ఇద్దరి మధ్య ఏం సంబంధం లేదు. తనెక్కడికి వెళ్ళిందో, ఎందుకెళ్ళిందో నాకేం తెలియదు;."
అయోమయంగా చూశాడాయన.
"ఏమైంది? వేణుకేమైంది? అర్చన ఎందుకు వెళ్ళింది? ప్రేమించి పెళ్ళిచేసుకున్నారే. ఎందుకు వాళ్ళ మధ్య గొడవ అయింది? అది ఇంత తీవ్రరూపం దాల్చిందాకా పెద్దవాళ్ళయిన తనకి, తన భార్యకీ ఎందుకు చెప్పలేదు? ఆయనకి ఆలోచిస్తుంటే శరీరం తీవ్రంగా కంపించసాగింది. కొడుకు కాపురం మూన్నాళ్ళ ముచ్చటైందా? ఒక్కగానొక్క కొడుకు కలెక్టర్ కావాలని పట్నం పంపించి చదివించారు. ఎంతో బాగా చదువుతూ, తమ ఆశలు తీరుస్తాడనుకున్న కొడుకు డిగ్రీ పూర్తి కాగానే బ్యాంకు పరీక్షలు రాయడం, బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకుని, అర్చనని భార్యగా స్వీకరించి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజు నిర్ఘాంతపోయారే గానీ, కొడుకుని ఏమీ అనలేకపోయారు. పోనీలే ఎలాగోలా వాడికి నచ్చిన పద్ధతిలో బతకనీ ఎలా బతికినా సుఖంగా ఉంటే చాలనుకున్నారు. కానీ, ఇదేంటి? ఇలా జరిగిందేం?
ఆయన అయోమయంగా వేణువైపు చూశాడు. వేణు రెండు చేతుల్లో తల పట్టుకుని, నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు నిప్పుకణికల్లా ఉన్నాయి. రగులుతున్న అగ్నిలా ఉన్నాడు. ఆయనకి భయం వేసింది. అసలే భార్య వియోగంతో ఉన్న కొడుకుకి ఇప్పుడు అశనిపాతంలాంటి వార్త తీసుకొచ్చాడు తను. ఆయన పితృహృదయం ద్రవించింది.
"వేణూ!" మృదువుగా ప్రేమగా పిలిచాడు.
వేణు దీనంగా చూశాడు. "నిజం నాన్నా! నాకు అర్చన ఎందుకు వదిలి వెళ్ళిందో తెలియదు. నేను తనని ఏమీ బాధపెట్టలేదు నాన్నా. ఇంకా తనని ఎప్పుడూ సంతోషపెట్టడానికే ప్రయత్నించా. తనంటే నాకు చాలా ఇష్టం నాన్నా. అందుకే అందుకే..."
"ఆ అందుకే..." ఏదో చెప్పబోయి ఆగిపోయిన కొడుకుని రెట్టిస్తూ అడిగాడు.
"అబ్బే ఏం లేదు నాన్నా! నాకు తెలియదు తనెందుకు వెళ్ళిపోయిందో?"
"ఎందుకు తెలియదు? తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కాదూ! నీ భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతే, ఎక్కడికెళ్ళిందో, ఎందుకెళ్ళిందో, వెళ్ళి ఏం చేస్తోందో తెలుసుకున్నావా?" తీవ్రంగా అడిగాడాయన.
వేణు ఆవేశంగా చూశాడు. అణుచుకున్న ఆవేశం ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది.
"ఎందుకు తెలుసుకోవాలి? చెప్పండి. దానికి ఒళ్ళు పొగరెక్కి వెళ్ళింది. అయాచితంగా లభించిన చక్కటి సంసార జీవితాన్ని అనుభవించడం చాతకాక వెళ్ళిపోయింది. అలాంటి ఆడదాన్ని నేనెందుకు ఖాతరు చేయాలి? చెప్పండి ఎందుకు చేయాలి?" ఆవేశంగా అడిగాడు.
"అయితే ఈ విషయం మా దగ్గర ఇంతకాలం ఎందుకు దాచావురా? అర్చన నిన్ను విడిచి వెళ్ళిందని మాకెందుకు చెప్పలేదింతకాలం?"
