కానీ, కానీ అలా ఎందుకు చెపుతుంది? అర్చన నిజంగా తను అనుకుంటున్నట్లు నీతి లేనిది కాదు. తను కోపంలో ఆమె తనకి చేసిన అన్యాయానికి రగిలిపోతూ అభాండాలు వేస్తున్నాడు కానీ, అర్చన సంగతి తనకి బాగా తెలుసు. ఆమెకి అసలు మగస్పర్శే ఇష్టం లేదు. ఎన్నోసార్లు తను తాకబోతే పాము మీద పడ్డట్టే చూసేది. పెళ్ళంటేనే అసహ్యం అన్న అర్చన ఎవరికో పిల్లాణ్ణి కంటుందా?
ఓ గాడ్ ఏంటి? ఏం జరుగుతోంది? ఇప్పటిదాకా జరిగిన ఘోరాలు చాల్లేదా? భగవంతుడు ఇంకా, ఇంకా తన జీవితంతో ఆడుకోవాలనే అనుకుంటున్నాడా?
ఒకవేళ ఒకవేళ బాబు నిజంగా... నో... ఎలా సాధ్యం?
'ఎందుకు సాధ్యం కాకూడదు? నువ్వు ఆవేశంలో చేసిన పని ఆమెకి శాపంగా మారిందేమో! ఆ శాపాన్ని నీకే కానుకగా ఇచ్చిందేమో! అంతరాత్మ నిలదీసినట్టు అనిపించింది.
వేణుకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మెదడు ఆలోచనలతో వేడెక్కిపోయింది.
తండ్రివైపు పిచ్చిచూపులు చూశాడు. బాగా అలసిపోయాడేమో కృష్ణస్వామి నిద్రలోకి జారిపోయాడు.
వేణు చివ్వున లేచి వాష్ బేసిన్ వైపు వెళ్ళి, చన్నీళ్ళతో మొహం కడుక్కున్నాడు. అడ్డదిడ్డంగా తల దువ్వుకుని, హాంగర్ కున్న షర్ట్ తీసి తొడుక్కుని, తలుపు వారగా వేసి, బైటకి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు.
కొంచెం దూరంలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞ దగ్గరకి స్కూటర్ పోనిచ్చాడు.
డాక్టర్ ప్రజ్ఞ వేణు కొలీగ్ కి అక్క ఆవిడ గైనకాలజిస్టు. ఈ మధ్యే కోర్సు పూర్తిచేసి, ప్రైవేటు ప్రాక్టీసు పెట్టింది. వేణు స్కూటర్ గేట్లో పార్క్ చేసి, లోపలికి నడిచాడు. పైన ఇల్లు కింద డిస్పెన్సరీ.
అప్పటికి సమయం పన్నెండవుతోంది. ఒకరిద్దరు పేషెంట్స్ వరండాలో కూర్చుని ఉన్నారు. ఆయా డాక్టర్ గారి గుమ్మం దగ్గర కర్టెన్ పట్టుకుని మధ్య, మధ్య లోపలికి తొంగిచూస్తూ నిలబడి ఉంది. లోపల ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు. వేణు కుర్చీలో కూర్చున్నాడు.
"మెడికల్ రిప్రెజెంటివా?" అడిగింది ఆయా.
కాదన్నట్టు తల ఊపి "పర్సనల్" అన్నాడు.
ఇంతలో లోపల ఉన్న పేషెంట్ కూడా లోపలికి వెళ్ళొచ్చిందాకా ఓపిగ్గా కూర్చున్నాడు వేణు. ఆఖరి పేషెంట్ బైటకి వస్తోంటే ఆయా లోపలికి వెళ్ళింది. ఒక్క నిమిషంలో బైటికి వచ్చి వెళ్ళండి అంది వేణుని ఉద్ద్దేశిస్తూ.
వేణు కర్టెన్ తొలగించుకుని లోపలికి నడిచాడు.
"హలో వేణూ! కం... కం... ఏంటిలా వచ్చావు?" హుషారుగా ఆహ్వానించింది డాక్టర్ ప్రజ్ఞ.
వేణు సమాధానంగా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
"టీ తాగుతావా? కాఫీనా?"
"ఏం వద్దు. ఇప్పుడే అన్నీ అయాయి."
"ఏం ఫర్వాలేదు. మరోసారి కానివ్వు. టీ చెప్పనా? అయామ్ టైర్డ్. టీ తాగాలి" అంది బెల్ నొక్కుతూ. ఆయా లోపలికి రావడంతో వేణు సమాధానం కోసం చూడకుండా "రెండు టీ తెప్పించు" అని చెప్పి ఆయా వెళ్ళిపోగానే "ఏంటి విశేషాలు?" అనడిగింది.
వేణు మౌనంగా ఆవిడ టేబుల్ మీద పేపర్ వెయిట్ తిప్పుతూ కూర్చున్నాడు. కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం చూస్తూ కూర్చున్న ప్రజ్ఞ కొద్దిగా ముందుకు వంగి ఆప్యాయంగా అడిగింది. "ఏంటి మౌనం భోంచేస్తున్నావు? ఎనీ థింగ్ రాంగ్?"
వేణు సన్నగా నిట్టూర్చి తలెత్తి ఆవిడవైపు చూస్తూ "ఒక్కసారితో గర్భం వచ్చే అవకాశం ఉందా?" అడిగాడు. ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం, వెంటనే పెదిమల మీద చిన్న చిరునవ్వు వెలిశాయి. ఆవిడకి అర్చన గురించి తెలుసు. వేణు జీవితంలోంచి అర్చన వెళ్ళిపోయిందని, వేణు అప్పట్నించీ బాగా డిస్ట్రబ్ అయి ఉన్నాడని అన్ని విషయాలూ తెలుసు. వాళ్ళిద్దరిదీ అన్యోన్య దాంపత్యం కాదని కూడా తెలుసు. ఓసారి అర్చనని చెకప్ కి కూడా తీసుకొచ్చాడు. అర్చనకి దాంపత్య జీవితం మీద ఎందుకు విరక్త్ కలిగిందో, తనతో ఎందుకు ఎడమొహంగా ఉంటోందో, శారీరకంగా ఏం లోపమో తెలుసుకోవడానికి తీసుకొచ్చాడు. అర్చనకి శారీరకంగా ఏం లోపం లేదని, మానసికంగానే అని ఆవిడకి తెలిసినా ఆవిడ వేణుతో ఆ విషయం చెప్పలేదు. "మరికొంత కాలం ప్రయత్నించు వేణూ. ఆవిడకేం లోపం లేదు. షి ఈజ్ క్వైట్ ఆల్ రైట్" అని చెప్పి పంపించింది.
వేణు ప్రశ్నతో ప్రజ్ఞ ఉలిక్కిపడింది. "కలిసిన ఎన్నాళ్ళకి గర్భం వస్తుంది?"
"ఎందుకు అడుగుతున్నావు? ఎవరితోనన్నా కమిట్ అయావా? ఈజ్ షి క్యారీయింగ్?" అడిగింది. మగవాడు భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడు. వేణు ఏదో పొరపాటు చేసి ఉంటాడు. అయితే ఏం మ్యారేజ్ చేసుకోవచ్చుగా. వెళ్ళిపోయిన భార్యకోసం ఎందుకు నిరీక్షణ అనిపించిందావిడకి.
"నో నో" కంగారుగా అన్నాడు వేణు.
"అలాంటిదేం లేదు కానీ..."
"ఊ... కానీ"
"అర్చన.... అర్చన వెళ్ళిపోయిన ఏడాదికి తిరిగి వచ్చి బాబుని నాన్నగారి దగ్గర వదిలి వెళ్ళిందిట."
"వ్వాట్.... అర్చన బాబుని హౌ హౌ ఇటీజ్ పాజిబుల్?"
"అదే నాకూ అర్ధం కావడం లేదు."
"మ్యారేజ్ చేసుకుందేమో!"
"అలా అయితే, తన కొడుకుని నాన్నగారి దగ్గర ఎందుకు వదులుతుంది?"
"అఫ్ కోర్స్" ఆవిడ ఆలోచనలో పడింది.
"ఎవరిబాబు?" అడిగింది.
"నా బాబని చెప్పిందిట."
"ఓ గాడ్ వేణూ! ఇలా ముక్కలు ముక్కలుగా కాక కొంచెం వివరంగా చెబుతావా? నాకు మతిపోతోంది" అంది,
ఇంతలో ఆయా టీ తీసుకురావడంతో ఇద్దరూ నిశ్శబ్దంగా అయారు.
