"వేణూ! తలుపు తియ్యి" మృదువుగా బదులు పలికాడు ఆయన.
కొన్ని క్షణాల తరువాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా తండ్రిని చూసిన వేణు కళ్ళల్లో ఆశ్చర్యం. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. అప్రతిభుడై చూస్తూ "నాన్నా! మీరా? మీరు ఇప్పుడు....?" తడబడ్డాడు.
"లోపలికి రానివ్వవా?" అడిగాడాయన.
వేణు చటుక్కున ఆయన చేతిలో సంచి అందుకుని, "రండి" అంటూ లోపలికి నడిచాడు. అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూము, దుమ్ము కొట్టుకుపోయి ఉన్న టి.వి.ని చూసి, వేణువైపు చూశాడు. గడ్డం పెంచాడు. బాగా చిక్కిపోయాడు. కళ్ళకింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది. పచ్చటి పిల్లాడు రంగు మారాడు. తెలివితేటలు ప్రస్ఫులిస్తున్నట్టుండే కళ్ళల్లో ఏదో విచారం, విషాదం పెనవేసుకుని ఉన్నాయి. ఆయన చూపులు తట్టుకోలేని వాడిలా చూపు తిప్పుకుని "రండి నాన్నా! అదిగో బాత్రూం. మొహం కడుక్కోండి. వేడినీళ్ళు పెడతాను. స్నానం చేద్దురుగాని" అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అలమరలో పెట్టాడు.
అతని నోటినుంచి చాలా వికారమైన వాసన. కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్టు అయింది. తెల్లవారకుండానే గోదారమ్మ ఒడిలో స్నానమాచరించి, ఆ విష్ణుమూర్తికి అగరబత్తులు ధూపం వేసి, కర్పూరహారతులిచ్చి, చామంతులు, గులాబులు, మల్లెలు, విరజాజులు, సంపెంగలతో పూజిస్తూ, ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లోనుంచి వచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు.
"కో... కోడలేది?" అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ.
వేణు చివ్వున చూశాడు. తిరిగి తల తిప్పుకుని "లే... లేదు. బైటికి వెళ్ళింది" అన్నాడు.
"ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు వస్తుంది?"
"వస్తుంది నాన్నా మీరు స్నానం చేయండి. నేనిప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను" అంటూ లోపలికి వెళ్ళి, తల దువ్వుకుని, పైజామా మీద లాల్చీ వేసుకుని స్లిప్పర్లు తొడుక్కుని బైటికి నడిచాడు.
వేణు బైటకి వెళ్ళగానే, కృష్ణస్వామి ఇల్లంతా పరికించి చూశాడు. ఒక డ్రాయింగ్ రూం, ఒక బెడ్ రూం, చిన్న వంటగది. దానికే ఎక్స్ టెన్షన్ లా అమర్చబడిన డైనింగ్ హాల్. బెడ్ రూముకి అటాచ్ డ్ టాయిలెట్. చిన్న వసారా. చుట్టూ ప్రహరీ, బైట మరో టాయిలెట్. ఇల్లు చిన్నది. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు హాయిగా, ఆనందంగా ఉండచ్చు. ముద్దుగా ఉంది. కానీ, ఆడదిక్కులేని ఇల్లులాగే అసహ్యంగా ఉంది. వేణు బెడ్ రూములో సిగరెట్ పీకలు, ఖాళీ బ్రాందీ సీసాలు, సగం తిని వదిలేసిన అన్నం కంచం, చిప్స్ పాకెట్.
ఆయన బాత్ రూములోకి నడిచి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు. టవల్ చుట్టుకుని బైటకి వచ్చేటప్పటికి వేణు కాఫీ కాస్తున్నాడు. అప్పటికి ఇల్లంతా కొద్దిగా సర్ది ఉంది. "పూజ గది ఎక్కడ బాబూ!" అడిగాడాయన.
పూజగది అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్నా. ఇలా రండి. ఇదే, ఇక్కడే దేవుడి ఫోటోలున్నాయి" అంటూ వంటగదిలో ఓ మూల ఉన్న గూట్లో దేవుడి ఫోటోలు చూపించాడు. దుమ్ము, ధూళితో నిండి ఉన్నాయి వెంకటేశ్వరస్వామి ఫోటో, లక్ష్మీ, సరస్వతీ, వినాయకుడు ఉన్న ఫోటోలు కుందుల్లో కాలిన వత్తి, కాలిన అగరుబత్తుల నుసితో దీపారాధన చేయడానికి అనువుగా లేని ఆ గూట్లో పూజ చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని, శ్లోకాలు చదువుకుంటూ బట్టలు వేసుకున్నాడు. ఈ లోపల ఎవరో ఒక పన్నెండేళ్ళ పిల్ల వచ్చి, చకచకా ఇల్లంతా సర్ది, ఊడ్చి తడిగుడ్డతో ఇల్లంతా తుడిచింది. సింకులో ఉన్న ప్లేట్లు, గిన్నెలు కడిగేసింది. వేణు ఆయనకి కాఫీ తెచ్చిచ్చాడు. "స్నానం చేసి వస్తాను నాన్నా" అంటూ బాత్ రూంలోకి దూరాడు. అప్పటికి ఆయన అక్కడికి వచ్చి గంటైంది. వేణుకీ, ఆయనకీ మధ్య రెండు మూడు మాటలు మినహా మరేం సంభాషణ జరగలేదు.
అప్పటిదాకా గిరగిర తిరుగుతూ పనిచేసిన పిల్ల వరండాలో నిలబడి "అయ్యగారూ! ఎల్లచ్చా" అని అడిగింది కృష్ణస్వామిని. ఆయనేం మాట్లాడలేదు. స్నానం పూర్తిచేసి వచ్చిన వేణు మాత్రం "ఉండు. అయ్య్గగారికీ, నాకూ టిఫిను తెచ్చిపెడుదువుగాని" అంటూ లోపలికి వెళ్ళాడు.
కృష్ణస్వామి కూడా కుర్చీలోంచి లేచి వేణుని అనుసరించి అడిగాడు "టిఫిను హోటలునుంచా?"
వేణు తల ఊపాడు "అవును నాన్నగారూ."
ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు. "నా అలవాట్లలో మార్పేం లేదురా. నేను బైట తిండి తినలేను నాన్నా. అరటిపళ్ళు తెప్పించి, కాసిని పాలు కలిపి ఇవ్వు చాలు."
వేణుకి అప్పుడు గుర్తొచ్చింది. ఆయన నిష్ఠాగరిష్టుడై వైష్ణవాలయం పూజారి. అరవై ఏళ్ల అయన జీవితంలో ఏనాడూ బైట వండిన ఆహారం తీసుకోలేదు. ఇప్పుడు ఆయన నియమానికి విరుద్ధంగా, బైటనుంచి ఇడ్లీ తెప్పించి పెట్టాలనుకున్న తన తెలివితక్కువకి అతనికే సిగ్గేసింది. "సారీ నాన్నా, మర్చ్జిపోయాను. నాకు బైట తిండి అలవాటు కాబట్టి, మీకూ అలవాటనుకున్నాను" అంటూ చొక్కా తొడుక్కుంటూ అన్నాడు. "ఇప్పుడే వస్తాను. కూరలు, పెరుగు తీసుకొస్తాను."
ఆయన అతన్ని వారిస్తూ అన్నాడు. "వద్దొద్దు. నువ్విప్పుడు బైటకి వెళ్ళకు. నీతో మాట్లాడాలి. ఆ అమ్మాయిని పంపించి పండ్లు, పాలు తెప్పించు."
వేణు గుండె గుభేలుమంది. ఏం మాట్లాడాలి? తండ్రిని గుమ్మంలో చూడగానే సగం గుండె జారిపోయింది. ఇప్పుడు పూర్తిగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. భయం వేస్తోంది. అర్చన ఏది అనడిగితే ఏం చెప్పాలి? అర్చన వెళ్ళిపోయింది. వెళ్ళి ఏం చేస్తోందో, ఎక్కడుందో, అసలు బతికుందో లేదో! భగవంతుడా! ఇంతకాలం ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందని అమ్మా, నాన్నా కంట పడకుండా తప్పించుకుంటున్నాను. ఇప్పుడేం చెప్పను. ఈయనడిగే ప్రశ్నల ధాటినుంచి నన్ను రక్షించు తండ్రీ.
వేణు గుబగుబలాడుతున్న గుండెని చిక్కబట్టుకుని, తనని తాను అదుపు చేసుకుంటూ వరండాలోకి వెళ్ళి పనిపిల్ల చేతికి ఇరవై రూపాయలు ఇచ్చాడు. "వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కురా."
"ఎన్నండి?" అడిగింది.
"డజను తీసుకురా."
వేణు వంట గదిలోకి వెళ్ళి పాలు వెచ్చబెట్టి గ్లాసులో పోశాడు. పంచదార వేసి, స్పూన్ తో నెమ్మదిగా కలుపుతూ, అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు. కృష్ణస్వామి రెండు చేతులూ ఒడిలో చాపుకుని, కుర్చీలో కొంచెం ముందుకి వంగి, నేల చూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాలగ్లాసు అందించాడు.
