Previous Page Next Page 
అర్చన పేజి 5


    విపరీతమైన రద్దీతో, కోలాహలంగా ఉన్న ఫ్లాట్ ఫారం చూడగానే మొదటిసారిగా నగరానికి వచ్చిన ఆయనకి గాభరా వేసింది. ఎటు వెళ్ళాలో అర్ధం కాలేదు. వేణుకి టెలిగ్రాం ఇచ్చి బయలుదేరడానికి సమయం లేదు. కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా, ఓ పంచె, లాల్చీ తీసుకుని బయలుదేరాడాయన. లాల్చీ జేబులో వేణు ఉంటోన్న ఇంటి అడ్రస్, పనిచేస్తున్న బ్యాంకు అడ్రసు కాగితం ఉంది. ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు. టికెట్టు కూడా అలా గుప్పిట్లో పట్టుకుని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తున్న వైపుకి నడిచాడు. ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరికి వచ్చి, టికెట్టు కలెక్టర్ కి టిక్కెట్టు ఇస్తూ, తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు. "బాబూ! నేనీ అడ్రసుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో చెబుతావా? మొదటిసారి వచ్చాను హైదరాబాదుకి" అడిగాడాయన.
    అతను అడ్రస్ చూసి "మల్కాజ్ గిరి వెళ్ళాలా మీరు? బైటకి వెళ్ళండి. కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు. వెళ్ళండి" అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టిక్కెట్టు కలెక్ట్ చేసుకోడంలో పడ్డాడు. అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది. తన ఊళ్ళో ఎవరన్నా అపరిచితులు వస్తే, వాళ్ళని ఎవరింటికి వెళ్ళాలో, వాళ్ళింటికి చేయి పట్టుకు తీసుకొస్తారు ఊరిజనం. బహుశా ఈ పట్నంలో ఇంతే కాబోలు. నిట్టూర్చి అందరితోపాటు బైటకి నడిచాడు. ఫ్లాట్ ఫారం మీద కన్నా భయంకరమైన రష్. జనం జనం పరుగులు పెడుతున్నారు. కార్లు, బస్సులు, స్కూటర్లు, ఆటోలు. "సార్! ఆటో కావాలా? అటో...ఇవ్వండి.....బ్యాగ్ ఇవ్వండి. రండి ఎక్కండి" చుట్టూ మూగి ఊదరబెట్టసాగారు ఆటోవాలాలు.
    "మల్కాజ్ గిరి వెళ్ళాలి" అన్నాడాయన.
    "రండి. వందరూపాయలు."
    "వంద రూపాయలా? ఆయనకి మతిపోయినట్లైంది. తిరిగి రాజమండ్రి వెళ్ళడానికి రైలు టిక్కెట్టు ధరా? తన కొడుకింటికి వెళ్ళడానికి. ఇదేం ఊరు బాబోయ్.
    "సార్! అక్కడ క్యూలో నిలబడండి. కంట్రోలర్ ఎక్కిస్తాడు ఆటో." ఎవరో వ్యక్తి వెళుతూ వెళుతూ, ఆయన అవస్థ చూసి, చాంతాడంత క్యూవైపు చూపించి వెళ్ళాడు. ఆయన క్యూ దగ్గరగా నడిచాడు. చాలా పెద్ద క్యూ ఆటోలు సర్ర్ న దూసుకొస్తున్నాయి. కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని, ఒక్కొక్కరినే పంపిస్తున్నాడు. ఈ పద్ధతి ఆయనకి నచ్చింది. హైదరాబాదులో ఆటోవాలాలు పట్నవాసం వాళ్ళనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో. పల్లెటూరి వాడైన తనని మోసం చేయరూ. బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. మంచిదే! ఇలా మోసాన్ని కంట్రోల్ చేయచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాకా ఓపిగ్గా నిలబడ్డాడు. ఆటో తన ముందు ఆగగానే కంట్రోలర్ కి అడ్రస్ చూపించాడు. ఆయన అది చదివి, కాగితం తిరిగి కృష్ణస్వామికిస్తూ, ఆటో అతన్ని మీటర్ వేయి అంటూ దబాయించి, ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని. ఆయన ఎక్కి కూర్చోగానే, ఆటో నెంబర్ నోట్ చేసుకుని, పోనీ అన్నాడు. ఆటో వేగంగా కదిలింది. కృష్ణ స్వామి సీటులో కొద్ధిగా వెనక్కి వాలి కూర్చుని, రోడ్లనీ, వాహనాలనీ అన్యమనస్కంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనల్లో మునిగిపోయారు.
    పిచ్చివెధవ. ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని, ఇంతకాలం నుంచీ తమకి తెలియచేయకుండా ఎలా ఉన్నాడో? భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం? ఎంత అవమానం? ఎంత దెబ్బ గుండెకి. అసలెందుకు వెళ్ళిపోయింది అర్చన?
    ఎంతో అణకువ గల పిల్ల. ఎలా చేసింది, ఇంత అప్రదిష్ట పని ఎందుకు చేసింది? భార్యాభర్తలు గొడవపడ్డారా? భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అంత మాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది?
    ఈ చదువుకున్న అమ్మాయిలకి వాళ్ళకేం కావాలో వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు. ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు. ఒకనాడు ఆడపిల్లలని ఇల్లు కదలనిచ్చేవాళ్ళా? చదువుల్లేవు, ఉద్యోగాలు లేవు, పెళ్ళి అయిందాకా తల్లితండ్రుల అధీనంలో, పెళ్ళి అయాక భర్త, అత్తమామల అధీనంలో వాళ్ళేం చెబితే అదే వేదం, అదే శాసనం. వాళ్ళు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం. తాయారమ్మ తనని ఈ నలభై ఏళ్లుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా? పొరపాటునన్నా తను ఆవిడని సినిమాకి తీసుకెళ్ళాడా? సరదాక్కూడా తనకి ఆవిడ ఎదురుచెప్పిందా? లేదు. కానీ అర్చనని తాము అలా చూడలేదే. ఉద్యోగం చేస్తానంటే చేయమన్నారు. పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు. పెళ్ళి అయిన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తగారింటికి. తాయారు ఒక్కపని చేయించలేదు. తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంది. "ఉద్యోగం చేసి, ఇంట్లో పని చేసి, అలసిపోయి వస్తావమ్మా. ఉన్న నాలుగు రోజులు నీకెందుకీ చాకిరీ" అంటూ కూర్చున్న దగ్గరకే అన్నీ అమర్చేది. అయినా, వినకుండా చేతనైన సాయం చేస్తూ, అత్తగారికి నోట్లో నాలికలా మసులుకుంది. అర్చన ఇలాంటి పని చేయగలదని అసలెన్నడైనా ఊహించారా? ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారంటే సరే అన్నారు. అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పలేకపోయాం నాన్నగారు! అంటే, వయసు వేడిలో తొందరపడ్డారు కాబోలని సర్దిచెప్పుకున్నారు. కానీ, భగవంతుడా! ఏం చేయబోతున్నావు నా కొడుకు భవిష్యత్తుని? అర్చన ఇల్లు విడిచి పోయిందన్న విషయం మాట మాత్రం చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు. ఎందుకు? రహస్యంగా ఉంచాల్సి వచ్చింది? ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వేణా? అర్చనే క్షణికావేశంలో వెళ్ళిపోయిందా? క్షణికావేశం అయితే, ఈపాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది, కానీ కలుసుకోలేదు. పైగా ఇప్పుడు ఓ పిల్లవాడి తల్లిగా వచ్చి, ఆ పసివాడిని తన లోగిట్లో వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి.
    "ఎంత పిలిచినా పలకలేదయ్యగారూ! ఏలూరెళ్ళే బస్సు ఎక్కినారు. ఆరు ముమ్మాటికీ మన కోడలుగారే" అన్నాడు సూరయ్య. అదే ఇంకే ఆడపిల్లనో అయి ఉంటే, సూరయ్యని ఏలూరుకి వెంటనే పంపించేవాడు తను. కానీ, పసివాడిని నిర్దయగా వదిలి వెళ్ళింది తన కోడలిని తెలిశాక మెదడు మొద్దుబారిపోయింది. సర్వశక్తులూ హరించిపోయినట్టు అయింది.
    "సార్, మల్కాజ్ గిరి ఇదే ఎక్కడికెళ్ళాలి?" ఆటోవాలా ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. చేతిలో అడ్రసు కాగితం చూశాడు. అనుటెక్స్ బట్టల దుకాణం ఎక్కడ బాబూ?" అడిగాడు.
    "ఇంకా ముందుంది సార్" అంటూ ఆటో ముందుకి పోనిచ్చాడు. సరిగ్గా రెండు నిమిషాల్లో అనుటెక్స్ దగ్గర ఆగింది.
    "ఇంకా కొంచెం ముందుకి వెళ్ళు. బ్యాంక్ ఎదురుగా సందులో."
    మరో రెండు నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది. ఇంటి నెంబరు చూస్తూన్న ఆయన "ఆపు. ఆపు ఇక్కడే" అంటూ అరిచాడు. ఆటో మీటరు చూసి డబ్బులు ఇచ్చి, బ్యాగు చేతిలోకి తీసుకుని గేటు తోసి, లోపలికి నడిచాడు. వేణు ఇంకా లేవలేదు కాబోలు, తలుపు తీయలేదు. వాకిట్లో మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. వాకిలి ఊడ్చి, ముగ్గేసి చాలాకాలం అయినట్టుగా అంతా ఎండిన ఆకులతో, మట్టితో, చెత్తాచెదారంతో నిండి ఉంది. ఆయన తలుపు దగ్గరకి నడిచి, ఎడం చేయి పక్కగా ఉన్న కాలింగ్ బెల్ నొక్కాడు. మూడు నాలుగుసార్లు నొక్కాక కానీ, లోపల్నించి ఎవరూ అన్న స్వరం వినిపించలేదు. అది వేణు స్వరమే. బరువుగా ఉంది. ఇంకా నిద్రమత్తు వదల్లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS