ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...
బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.
ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.
ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.
సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.
ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.
హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.
సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.
సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.
|