షిర్డీ సాయిబాబా సామాన్యునిలా జీవించి, అసామాన్య గుణాలను ప్రబోధించాడు. సర్వసాధారణంగా మనందరికీ ఇతర్ల గురించి కుతూహలం ఉంటుంది. తోటివాళ్ళేం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎలా జేవిస్తున్నారు లాంటి అనేక అనవసర విషయాలమీద దృష్టి పెడతాం. ఆ అంశాల్లో ఉన్న కుతూహలం నిజంగా అవసరమైన విషయాల్లో ఉండదు. ముఖ్యంగా మన గురించి మనం తెలుసుకోవాలనుకోం. ఆధ్యాత్మికంగా ఎదిగి ఔన్నత్యం సంపాదించాలనుకోం.
సాయిబాబా ఇతర్ల విషయాలు తెలుసుకోవాలనే ఈ రకమైన వైఖరిని పూర్తిగా ఖండించాడు. ఎవరికి వారు, ''నేను ఎవర్ని? నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏం చేయాలి? ఏం చేస్తే జీవితం సార్ధకమౌతుంది? - అని ఆలోచించి, ఎప్పటికప్పుడు మన నడవడిక తీర్చిదిద్దుకుంటూ, ఆదర్శప్రాయంగా జీవించాలని చెప్పేవాడు.
ఇది చూట్టానికి ఎంతో మామూలు అంశంలా కనిపిస్తుంది. కానీ, ఇందులో ఎంతో లోతైన భావం ఉంది. మన గురించి మనం ఆలోచించదం మొదలుపెడితే మన కర్తవ్యం ఏమిటో బోధపడుతుంది. తోటివారికి సంబంధించిన అనవసర జిజ్ఞాస తగ్గుతుంది. అన్నిటినీ మించి ''నేను'', ''నా'' అనే స్వార్ధచింతన, అహంభావం తగ్గుముఖం పడతాయి.
సాయిబాబా ఇంకో విషయం కూడా స్పష్టంగా చెప్పాడు. తనను వెతుకుతూ భక్తులు ఎక్కడికీ పోనవసరం లేదన్నాడు. తాను ఈ ప్రపంచం లోని సకల జీవజాలంలో, వస్తువుల్లో.. అన్నిటిలో ఉన్నానని చాటి చెప్పాడు. ప్రతి జీవిలో చైతన్యం ఉంటుందని, ఆ చైతన్యమే దేవుడని గుర్తించాలని చెప్పాడు. దేవునికోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచుకోవాలని చెప్పాడు. తోటివారిని ఏదో విధంగా బాధపెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడు. మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడు.
తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని, తాము కష్టపడి అయినా, ఇతర్లకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడు.
|