సాయిబాబా భక్త సులభుడు. పిలిస్తే పలికే దైవం సాయిబాబా. బాబా పూజకు ఎలాంటి ఆడంబరాలూ అక్కర్లేదు. తిధి, వార, నక్షత్రాలు చూడనవసరం లేదు. తేదీలతో, దిక్కులతో సంబంధం లేదు. వర్ణ, వర్గాలతో నిమిత్తం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా, ఎపుడైనా ప్రారంభించవచ్చు.
సాయిబాబా పూజకు ఏ హంగులూ, ఆర్భాటాలూ అవసరం లేదు. ఫలానా సామగ్రి కావాలని, ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు, నిబంధనలు లేవు. సాయి బాబా పూజకు కావలసిందల్లా భక్తిభావన.
సాయిబాబా లీలలు పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయి బాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక, పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికీ పంచవచ్చు.
సాయిబాబా చరిత్ర, సాయిబాబా లీలలు మొదలైన పవిత్ర గ్రంధాలను పారాయణ చేయదలచుకున్నవారు గురువారం నాడు ప్రారంభించి, బుధవారం నాటికి ముగించవచ్చు. ఒక వారంలో పూర్తిచేయలేనివారు రెండు, లేదా మూడు వారాల్లోనూ పూర్తిచేయవచ్చు. నిత్య పారాయణ కూడా చేయవచ్చు. కానీ పారాయణ చేసేటప్పుడు శ్రద్ధ, భక్తి ముఖ్యం.
సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. అలాగే పారాయణ పూర్తయ్యాక రెండు రూపాయలకు తక్కువ కాకుండా బాబా ట్రస్టుకు దక్షిణ పంపాలి.
సాయిబాబా గ్రంధాలను పారాయణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్ధిస్తే మన చెంతనే ఉంటాడు.
|