ఫ్లోరల్ ఫ్యాషన్... లేటెస్ట్ ప్యాషన్!

 

ఒకప్పుడు పువ్వులు తలలో పెట్టుకుని మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు పూలు ఒళ్లంతా పూయించుకుంటున్నారు. అర్థం కాలేదా? ఈ ఫొటోలు చూడండి అర్థమైపోతుంది.

ఒకప్పుడు చిన్నపిల్లలకి పువ్వుల పువ్వుల గౌన్లు కుట్టించేవారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్లకే ఈ పువ్వుల పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి కాస్తా ఫ్యాషనైపోయింది. దాంతో ఎక్కడ చూసినా పువ్వులే. చీరలు, స్కర్ట్స్, జాకెట్స్, ఫ్రాక్స్, అనార్కలి సూట్స్... డ్రెస్ ఏదైనా సరే పూలు ఉండాల్సిందే.

బట్టలు మాత్రమే కాదు... హ్యాండ్ బ్యాగ్స్, శాండిల్స్, హ్యాట్స్ లాంటి వాటన్నిటి మీద పూల డిజైన్సే. ఈ ఫ్లోరల్ ఫ్యాషన్ అందరికీ ఎంత ప్రీతి పాత్రమైపోయిందంటే... చివరికి అబ్బాయిలు కూడా పూల చొక్కాలు వేసుకుని మురిసిపోతున్నారు. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పాల్సిన పని లేదు. బాబు బంగారం సినిమాలోని ఓ పాటలో నయనతార కట్టిన ఫ్లోరల్ శారీస్ ఎంత అందంగా ఉంటాయో. బాలీవుడ్ భామలైతే ప్రతి అకేషన్ కీ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్న దుస్తుల్నే ప్రిఫర్ చేస్తున్నారు.

 

 

కాటన్, సిల్క్, క్రేప్ తదితర మెటీరియల్స్ పై రంగురంగుల పూలను చూస్తోంటే నిజంగానే మతిపోతోంది. కుసుమాల అందాలు చూడటానికి రెండు కన్నులూ చాలవనిపిస్తోంది. నిజానికి పూల డిజైన్ల కోసమని ప్రత్యేక ధరలేమీ లేవు. ఆ డిజైన్ ఏ మెటీరియల్ మీద వేశారన్నదాన్ని బట్టే రేటు. అందుకే ఓ చక్కని ఫ్రాక్ ఐదు వందల లోపే వచ్చేస్తోంది. చూడచక్కని చీర ఏడెనిమిదొందలకే దొరికేస్తోంది. మరింకా ఆలోచిస్తున్నారేంటి... మీరు కూడా వెంటనే ఓ మాంచి ఫ్లోరల్ డ్రెస్ కొనేయండి మరి!

 

- Sameera