సిజేరియన్‌తో మనం మారిపోతున్నాం..

సిజేరియన్‌తో మనం మారిపోతున్నాం

 


ఒకప్పుడు బిడ్డకు  జన్మనివ్వడం అంటే తల్లికి పునర్జన్మలా ఉండేది. ఇప్పటికీ ఈ మాటలో వాస్తవం ఉన్నా, సిజేరియన్‌ ప్రక్రియ వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తగ్గిపోతున్నాయి. అయితే ఇలా సిజేరియన్‌ ద్వారా బిడ్డను బయటకు తీయడం వల్ల మానవజాతి పరిణామం మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.

 

అవే జన్యువులు

స్త్రీలలో కటిప్రాంతం సన్నగా ఉండి యోనిమార్గం బిగుతుగా ఉంటే... బిడ్డ బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. దాని వల్ల తల్లీబిడ్డా చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది. సిజేరియన్ల కారణంగా ఈ ముప్పు తగ్గిన మాట వాస్తవమే అయినా... కటి ప్రాంతం సన్నగా ఉండే స్త్రీలు బతికిపోవడం వల్ల, వారి నుంచి అవే తరహా జన్యవులు వారి పిల్లలకు చేరుతున్నాయట. అందుకనే కటిప్రాంతం తక్కువగా ఉండే స్త్రీల సంఖ్యలో ఏమన్నా మార్పు వచ్చిందేమో తెలుసుకునేందుకు ఆస్ట్రియాకు చెందిన కొందరు పరిశోధకులు పూనుకొన్నారు. ఇందులో తేలిందేమిటంటే... 1960ల ప్రాంతాలలో 1000 మంది స్త్రీలలో 30 మందికి మాత్రమే సన్నటి యోనిమార్గం ఉండేదట. కానీ ప్రస్తుతం 1000 మంది స్త్రీలలో 36 మందిలో ఈ ఇబ్బంది కనిపిస్తోంది.

 

తీసిపారేయలేం

30కీ 36కీ ఏమంత తేడా లేకపోవచ్చు. కానీ వేల ఏళ్ల పరిణామక్రమంలో కేవలం ఒక యాభై ఏళ్లలోనే 20 శాతం మార్పు కనిపించడాన్ని తీసిపారేయలేం. పైగా బిడ్డ వైపు నుంచి చూస్తే దీనికి రెండో కోణం కూడా ఉంది. తల్లి కడుపులో ఉన్న పిల్లవాడి తల బాగా పెద్దదిగా ఉన్నా కూడా అది బయటకు రావడం కష్టం. అలాంటి బిడ్డ బతికి బట్టకట్టడం ఒకప్పుడు ఆసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు సిజేరియన్‌ వల్ల ‘తల పెద్దగా ఉన్న’ పిల్లలు కూడా క్షేమంగా బయటకు వస్తున్నారు. దాంతో వారి జన్యువులు కూడా తరువాత తరాలకు అందుతున్నాయి. అంటే సిజేరియన్‌ వల్ల ఇటు కటిప్రాంతం సన్నగా ఉండేవారి సంఖ్యా, అటు తల పెద్దగా ఉండేవారి సంఖ్య కూడా నానాటికీ పెరిగే అవకాశం ఉందన్నమాట. అలా బహుశా సిజేరియన్ చేయక తప్పనిసరి పరిస్థితులు కూడా పెరిగిపోతాయి.


ప్రకృతి శాపం

కటి సన్నగా ఉండే ఆడవారు, పెద్ద తలతో పుట్టే పిల్లలు సిజేరియన్‌తో బతికిపోవడంతో అవే జన్యువులు వ్యాపిస్తున్నాయన్న మాట వినడానికి చాలా క్రూరంగా ఉంది. ఆ కాస్త లోపం వల్ల వారు మరణించాలని కోరుకోము కదా! అందుకనే ‘మా ఉద్దేశం వైద్యుల ప్రమేయాన్ని విమర్శించడం కాదు. దీని వలన మానవ పరిణామంలో మార్పులు వస్తున్నాయి అని ఒక మాట చెప్పడమే’ అంటున్నారు పరిశోధకులు. వైద్యులు ఎడాపెడా సిజేరియన్‌ చేసిపారేస్తున్నారు అన్న అపవాదు ఉన్నప్పటికీ, ప్రకృతి పరంగా కూడా మనిషికి కొంత లోటు ఉంది. ఎందుకంటే మనకు దగ్గరగా ఉండే కోతుల వంటి జీవులతో పోలిస్తే మనుషులలో ప్రసవం కాస్త కష్టంగానే ఉంటుందట. దానికి తోడు షుగర్‌, ఊబకాయం వంటి కారణాలతో కూడా సిజేరియన్లు చేయవలసి వస్తోందంటున్నారు. అయితే అవసరం ఉండే సిజేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారా! దాని వల్ల ఇతరత్రా దుష్ఫలితాలు ఏమిటన్నది వేరే చర్చ!

 

- నిర్జర.