Home » మన రచయితలు » శతకం రాసిన రాజు – భద్రభూపాలుడుFacebook Twitter Google
శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు

 

శతకం రాసిన రాజు – భద్రభూపాలుడు

 


తెలుగు సాహిత్యంలో శతకాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏళ్ల తరబడి లోకాన్ని తరచి చూసిన అనుభవాన్ని నాలుగంటే నాలుగు వాక్యాలలో పాఠకులకు అందించేదే శతక పద్యం. ఈ శతకాల గురించి ప్రస్తావన రాగానే ముందు వేమన శతకమే గుర్తుకువస్తుంది. కానీ వేమనకు ఓ మూడు వందల సంవత్సరాలకు పూర్వమే ప్రజలను ఉర్రూతలూగించిన శతకం సుమతీ శతకం!

నిజానికి సుమతీ శతకం ఎవరు రాశారన్న విషయం మీద ఏకాభిప్రాయం లేదు. వేమన, గువ్వల చెన్నా లాంటి శతకాలలోలాగా ఎక్కడా కూడా శతకకారుని ప్రస్తావనే కనిపించదు. కానీ చాలామంది అభిప్రాయం మేరకు ‘భద్ర భూపాలుడు’ అనే వ్యక్తి ఈ పద్యాలను రాసి ఉంటాడు. ఈయననే బద్దెన అని కూడా పిలుస్తారు. మహాభారతాన్ని అనువదించిన తిక్కన మహాకవికి ఈయన శిష్యుడని ఓ నమ్మకం.

బద్దెన 13 శతాబ్దంలో జీవించాడు. ఒకవేళ ఈయనే కనుక సుమతీ శతకాన్ని రాసి ఉంటే... తెలుగులో శతక సాహిత్యానికి నాంది పలికిన కవులలో ఈయన ఒకరై ఉంటారు. నలుగురికీ మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో బద్దెన ఈ శతకాన్ని రాసినట్లు అర్థమవుతుంది. అందుకే ఈ శతకంలోని ప్రతి పద్యంలోనూ ‘సుమతీ’ (మంచి బుద్ధి కలవాడా) అన్న మకుటం కనిపిస్తుంది.

భద్రభూపాలుని కాలం అటు రుద్రమదేవి కాలంతోనూ, ఇటు తిక్కన కాలంతోనూ సరిపోతోంది. కాబట్టి ఆయన తిక్కన శిష్యుడనీ, రుద్రమకు సామంత రాజు అనీ వినిపించే వాదనలు నిజమే కావచ్చు. 700 సంవత్సరాలకు పూర్వం ఈ శతకాన్ని రాసినా... అందులోని భాష కఠినంగా కనిపించదు. పైగా అందులోని అభిప్రాయాలు చాలా నిష్కర్షగా వెల్లడించినట్లు తోస్తుంది. కాబట్టి ఇది ఎవరో పండితుడు కాకుండా లోకరీతి తెలిసిన నాయకుడే రాసినట్లు అర్థమవుతుంది.

సుమతీ శతకం, వందల సంవత్సరాలుగా పిల్లలకు ఒక Moral Scienceలాగా ఉపయోగపడుతోంది. అసలు పద్యాలు అన్న ఊసే తెలియని వారికి కూడా తన కోపమె తన శత్రువు, ఉపకారికి నుపకారములాంటి పద్యాలు గుర్తుండే ఉంటాయి. ఇక అప్పిచ్చువాడు వైద్యుడు, కనకపు సింహాసనము లాంటి వాక్యాలైతే ఏకంగా జాతీయాలుగా మారిపోయాయి. 

అలాగని సుమతీ శతకంలో లోపాలూ లేవని కాదు. కొన్ని పద్యాలలో ఆడవాళ్ల పట్ల చాలా దురుసైన మాటలు కనిపిస్తాయి, మరికొన్ని పద్యాలలో కొన్ని కులాల పట్ల చాలా చులకన భావం వ్యక్తమవుతుంది. ఇంకొన్ని పద్యాలు పిల్లలు చదవదగ్గవిగా ఉండవు. ఇలాంటివి పక్కన పెడితే... తరతరాల పాటు తెలుగువారికి చెరిగిపోని నిధిలా సుమతీ శతకం కనిపిస్తుంది. భద్రభూపాలుడు కత్తితో ఏలిన రాజ్యం కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ ఆయన కలంతో ఏలిన సాహిత్య సామ్రాజ్యం సుస్థిరంగా నిలిచే ఉంటుంది.

 

- నిర్జర.

 


తెలుగు వాగ్గేయ కారులలో ప్రముఖులు త్యాగరాజు గారు...
Mar 20, 2019
తెలుగు భాషలో ఆది కవి నన్నయ. ఈయన 11 వ శతాబ్దానికి చెందిన వారు...
Mar 19, 2019
యుద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళా మణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు
May 21, 2018
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రచయితల గురించి లోకానికి చాటే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.
Dec 18, 2017
తెలంగాణలో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ప్రశంసలు, విమర్శలూ ఎలా ఉన్నా...
Dec 14, 2017
భక్త రామదాసు గురించీ, ఆయన కీర్తినల గురించీ తెలియని తెలుగువాడు ఉండడు.
Sep 14, 2017
తెలుగు సాహిత్యంలో అన్నమయ్య పేరు వినపడగానే ఆ శ్రీనివాసుని తన కీర్తనలతో కొలిచిన తాళ్లపాక అన్నమయ్యే గుర్తుకువస్తాడు.
Sep 12, 2017
ఈ రచయితలు ఉపాధ్యాయులు కూడా
Sep 5, 2017
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత ఉంది.
Aug 31, 2017
తెలుగు భాషలోని సాహిత్యం గురించి చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి.
Aug 26, 2017
TeluguOne For Your Business
About TeluguOne