ఆడవారు ఉద్యమించేందుకు చిట్కా

 

అదేం విచిత్రమో కానీ సబ్బు బిళ్ల గురించి ప్రకటన వస్తే, అందులో ఆడవాళ్లు స్నానం చేస్తూ కనిపించాల్సిందే. పరుపు గురించి ప్రకటన చేసినా, దాని మీద ఆడవాళ్లు చాలీచాలని దుస్తులతో ఉండాల్సిందే. ఆఖరికి స్పోర్ట్స్‌ కారు, కూల్‌డ్రింకు ప్రకటనలలో కూడా ఆడవాళ్లు సదరు వస్తువుల పక్కనే బికినీ ధరించి నిలబడాల్సిందే! ఆడవాళ్లని ఇలా అంగడి బొమ్మల్లాగా చూపించి రూపాయి సంపాదించాలనుకోవడం అన్ని చోట్లా కనిపించేదే!

స్త్రీలను విలాస వస్తువులుగా చూపించడం వల్ల, సరుకులు అమ్ముడుపోవడం సంగతేమో కానీ... వాటిని గమనించే ప్రేక్షకుల మనసులో ఆడవారి పట్ల చాలా చులకనైన అభిప్రాయం ఏర్పడుతుంది. వారు ఆడవారికి ఇచ్చే గౌరవం, స్త్రీలతో ప్రవర్తించే తీరు మీద ఇలాంటి ప్రకటనలు చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరి ఇలాంటి ధోరణి పట్ల స్త్రీలను జాగృతం చేసే అవకాశం ఉందా! అంటే దానికో సులువైన మార్గం ఉందంటున్నారు పరిశోధకులు.

స్త్రీలని సెక్సు వస్తువులుగా చూపించే సంప్రదాయానికి విరుద్ధంగా చైతన్యం కలిగించేందుకు ఇటలీకి చెందిన పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు 78 మగవారినీ, 81 మంది ఆడవారినీ ఎన్నుకొన్నారు. వీరిలో కొందరికి స్త్రీలను నీచంగా చూపిస్తూ సాగే వీడియోలను చూపించారు, మరి కొందరికి అదే వీడియోను చూపిస్తూ... అందులో స్త్రీలను కించపరుస్తున్నారంటూ నేపథ్యంలో ఓ విశ్లేషణను వినిపించారు. ఇలా రెండురకాల వీడియోలను వీక్షించిన తరువాత తమ అభిప్రాయాన్ని చెప్పమంటూ ప్రేక్షకులని అడిగారు.

స్త్రీలను అవమానకరంగా చూపిస్తున్నారని చెబుతూ సాగిన వీడియో గమనించిన ఆడవారిలో, అలాంటి చర్యల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. సమాజం స్త్రీల పట్ల ప్రదర్శిస్తున్న చులకన భావంతో వారు కోపోద్రిక్తులైపోయారు. అలాంటి తీరుకి వ్యతిరేకంగా ఏదన్నా ఉద్యమం జరిగితే, అందులో పాల్గొనేందుకు సిద్ధపడిపోయారు. మగవారిలో మాత్రం ఎలాంటి వీడియోని చూపించినా కూడా పెద్దగా మార్పు కనిపించలేదు.

ఒకే వీడియోని రెండు విధాలా చూపించడం వల్ల ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందన్నదానికి పరిశోధకులు ఓ కారణం చెబుతున్నారు. అలవోకగా ఏదో ఒక విషయాన్ని తరచూ ప్రసార మాధ్యమాలలో చూడటం వల్ల, అదేదో సహజమేలే అన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ తాము చూస్తున్నదానిలో ఏదో లోపం ఉందని ఎవరో ఎత్తి చూపడం వల్ల, ఆలోచన చెలరేగుతుంది.

ఇటలీ పరిశోధకులు చేసిన పరిశోధన చాలా చిన్నదే అయినా ఈ తరహా పరిశోధనల్లో ఇదే ప్రథమం కావడం అభినందనీయం. పైగా స్త్రీల పట్ల సాగుతున్న వివక్షను ఎండగడుతూ వీడియోలను రూపొందించడం వల్ల, మహిళలను సులువుగా జాగృతం చేయవచ్చన్న సూచననీ అందిస్తోంది.

- నిర్జర.