45 ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి ఫాలో కావాలి..!
ప్రతి మహిళను అడిగినా తన వయసు ఉన్నదాని కంటే 5 నుండి 10 ఏళ్లు తక్కువ గా చెప్తుంది. అయితే ఇది కొందరికి బాగా సెట్ అవుతుంది. కానీ మరికొందరికి సెట్ కాదు. ఎందుకంటే శరీరాన్ని చూసి కొందరు వయసు తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా చెప్పేస్తుంటారు. అయితే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ దానికి తగిన జీవినశైలి, ఆహారపు అలవాట్లు, యవ్వనంగా కనిపించేలా చేసే చిట్కాలు పాటించకపోవడమే తప్పు. ఈ కింద ఉన్న టిప్స్ పాటిస్తే 45 ఏళ్లు దాటినా స్కూల్లకు, కాలేజీలకు వెళ్లే పిల్లలు ఉన్నా హ్యాపీగా యూత్ లాగా కనిపించవచ్చు.
మహిళలు ఇంట్లో ఆహారాన్ని వండినప్పుడు కొన్ని ఆహారాలు మిగిలిపోతాయి. దానిని పారేసే బదులు దానిని మరుసటి రోజు తినడం చాలామంది మహిళల అలవాటు. కానీ ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటిరోజు తినడం రోగనిరోధక శక్తికి, పేగు ఆరోగ్యానికి చాలా హానికరం. యవ్వనంగా కనిపించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఉదయం నుండి రాత్రి వరకు తాజా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
రోజుకు 4 లీటర్ల నీరు త్రాగితే బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన చర్మ సంరక్షణ కోసం అనువుగా ఉంటుంది. నాలుగు లీటర్ల కంటే ఎక్కువ నీరు త్రాగవలసిన అవసరం లేదు. కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగడం ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. చర్మాన్ని మెరిచేలా, యవ్వనంగా ఉంచుకోవచ్చు.
ఆహారాన్ని తీసుకునే విధానాన్ని ఆయుర్వేదం మూడు ముక్కలలో చెప్పింది. ఉదయం భోగి లాగా, మధ్యాహ్నం యోగి లాగా, రాత్రి రోగి లాగా ఆహారం తీసుకోమని చెబుతుంది. అంటే ఉదయం బాగా తినవచ్చు. అది రోజంతా పనిచేయడానికి శక్తిని ఇస్తుంది. మధ్యాహ్నం బోజనం మితంగా తినాలి. భోజనంలో కార్బోహేడ్రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నియంత్రణలో పెట్టాలి. ఇక రాత్రి సమయంలో చాలా తేలికగా తినాలి. రాత్రి నిద్రించే సమయం కాబట్టి బరువుగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు.
రోజూ 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా యవ్వనంగా ఉండవచ్చు. కానీ చాలామంది వర్కవుట్ చేయడానికి సమయం ఉండదని చెబుతుంటారు. కానీ ఈ అలవాటు భవిష్యత్తులో అనేక వ్యాధులకు దారి తీస్తుంది. మహిళలు ఎంత బిజీగా ఉన్నా, 24 గంటలలో మీ కోసం అరగంట నుండి 45 నిమిషాల సమయం కేటాయించుకోవాలి. తేలికపాటి వ్యాయామం చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు లేదా బరువులను ఎత్తవచ్చు. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.