లావుగా ఉన్నవారు సన్నబడాలంటే...

ఈ కాలంలో మహిళలను ఎక్కువగా వేధిస్తున్న సమస్య లావుగా హన్తాడం. దీన్నే ఊబకాయం అనికూడా అంటారు. కొందరు ఆహారం వల్ల, లైఫ్ స్టయిల్ సరిగా లేకపోవడం వల్ల లావు అవుతున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. లావు అవుతున్న కారణాలను గురించి బాగానే చెబుతారు కానీ బరువు తగ్గేందుకు పాటించే చిట్కాలను సరిగానే పాటిస్తున్నారా అనే విషయం మాత్రం సరిగా చెప్పరు. అందరికీ చిటికె వేసినంత తొందరగా పలితం రావాలని అనుకోవడమే కోరిక. ఇప్పట్లో అయితే కేవలం పాఠశాల దశ నుండే బాగా లావైపోతున్నారు అమ్మాయిలు. అయితే లావుగా ఉన్నవారి విషయంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుని వాటిని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆవేమిటంటే… 

పాఠశాల దశ నుండే.. అధిక బరువులోకి జారుతున్న ఈ కాలం అమ్మాయిలు 20 నుండి 25 సంవత్సరాల వయస్సు నుంచి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు తీసుకొవాలి. ఈ మార్పు ద్వారా వారి పెళ్లి, ఆ తరువాత గర్భం వంటి దశలలో ఎలాంటి సమస్యా ఎదురుకాకుండా ఉంటుంది.  ఆహార పరిమాణాన్ని కొంచెం కొంచెంగా మార్చుకోవాలి. అంటే  తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.  ముఖ్యంగా చక్కెర, బెల్లము మొదలైన వాటితో చేసే పిండివంటలు, వెన్న, నెయ్యి, నూనె మొదలైన వాటిని ఉపయోగించి చేసే ఆహార పదార్థాలను చాలా తగ్గించాలి. పిండిపదార్థాలు అంటే కార్భోహైడ్రేట్స్  అధికంగా ఉండే దుంపలు, బియ్యము, మొదలైనవాటిని తగ్గించాలి, నెయ్యి, వెన్న, మీగడ పూర్తిగా మానేయాలి.

కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇలా అన్నిటినీ మానుకున్నా  ఆహారంలో శరీరానికి కావలసిన ప్రోటీన్ల పరిమాణం తగ్గించకూడదు. ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండి, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండాలి. అలా ఉన్న  ఆహారం సన్నబడడానికి తోడ్పడుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉన్న మాంసము, చేపలు, పప్పుపదార్థాలు తీసుకోవాలి.  వేరు సెనగపప్పులో ప్రోటీనులు అధికంగా ఉన్నా వాటికి మించి కొవ్వుపదార్ధాలు ఉన్నాయి. కాబట్టి ఈ పప్పు తినడం తగ్గించాలి.

ఖనిజలవణాలు, విటమిన్లు మామూలు వ్యక్తికి ఎంత అవసరమో లావుగా ఉండేవారికి కూడా అంతే అవసరం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. మామూలు వ్యక్తి తీసుకొన్నట్టే తీసుకోవాలి, ఆపిల్, అరటి, సీతాఫలాలలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువగా తినాలి. సాధ్యమైనంతవరకు వాటిని తగ్గించి వాటి స్థానంలో నారింజ, బత్తాయి మొదలైన పండ్లను తినడం మంచిది.

కాఫీ, టీ తాగడం తగ్గించాలి. కాఫీ, టీలలో వాడే చక్కెర మోతాదు కూడా తగ్గించుకోవడం అవసరము. సాధ్యమైతే చక్కెర లేకుండా కాఫీ, టీ తాగడం మంచిది.

మధ్యమధ్యలో చిరుతిండ్లు తినడం అందరికీ అలవాటుగా ఉంటుంది. దీనివల్లనే చాలామంది లావు అవుతారు. చిరుతిండ్లు మానివేయాలి. ఒకవేళ ఆగలేక చిరుతిండ్లు తింటే.. ఆ తిన్నపూట భోజనం తగ్గించడమో లేక మానివేయడమో చేయాలి.

ఆహారాన్ని తక్కువగా తీసికోవలసివస్తే అన్నం తక్కువగాను కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు,  ఎక్కువగాను తింటే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, తృప్తి కూడా కలుగుతుంది. అన్నది. పచ్చిగా తినదగిన పచ్చికూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటే కడుపు నిండి తృప్తిగా ఉంటుంది. 

ఆహారం తగ్గించడంతోపాటు వ్యాయామం చెయ్యడం చాలా అవసరము. వ్యాయామంతో పాటు ఆహారం తినడం పెంచకూడదు. దీనివల్ల వ్యాయమం చేసిన ఫలితము ఉండదు. చేతనైనంత వరకు తమపనులను చేసుకోవడం మంచిది. లావుగా ఉన్నవారు ఎక్కువ కష్టమైన వ్యాయామం చేయడం మంచిదికాదు. శరీరానికి తగిన వ్యాయామాలను ఎంచుకుని చేయాలి. ఇవన్నీ చేస్తే లావుగా ఉన్నవారు తొందరగానే సన్నబడతారు.

                                   ◆నిశ్శబ్ద.