వాటర్ ప్రూఫ్ మస్కారా వాడుతున్నారా.. ఈ నిజాలు తెలుసా!


 మేకప్ ట్రెండ్స్ చాలా ఫాస్ట్ గా ఛేంజ్ అవుతున్నాయి.   అమ్మాయిలు తమ కళ్లు మరింత అందంగా కనిపించడం కోసం కాజల్,  ఐ  లైనర్,  మస్కారా,  ఐ మేకప్ ఉపయోగిస్తుంటారు.  ముఖ్యంగా వాటర్ ప్రూఫ్ మస్కారా అమ్మాయిలకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉంటుంది.  నీటిలో లేదా చెమటలో కూడా పాడవ్వకుండా నిలిచి ఉంటుంది. కానీ అందం కోసం  వాడే ఈ వాటర్ ప్రూఫ్ మస్కారా చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు. వాటర్ ప్రూఫ్ మస్కారా  వెంట్రుకలకు మందాన్ని,  ముదురు రంగును ఇస్తుంది. అయితే ఇది  కళ్ళు,  వెంట్రుకలకు తీవ్రమైన నష్టాన్ని కూడా కలిగిస్తుందట. ఎలాగో తెలుసుకుంటే..

కనురెప్పలు కోల్పోవడం..

వాటర్ ప్రూఫ్ మస్కారాను తొలగించడం అంత సులభం కాదు. దీనికోసం మేకప్ రిమూవర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది,  లేదా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. ఇది వెంట్రుకల మూలాలను బలహీనపరుస్తుంది.  క్రమంగా వెంట్రుకలు రాలిపోవడానికి దారితీస్తుంది. వాటర్ ప్రూఫ్ మస్కారాను ఎక్కువగా ఉపయోగిస్తే  వెంట్రుకలు మునుపటి కంటే సన్నగా,  బలహీనంగా మారతాయి.

కంటి అలెర్జీలు..

 వాటర్ ప్రూఫ్ మస్కరాల్లో కళ్ళకు హాని కలిగించే రసాయనాలు ఉంటాయి.  ఇవి చికాకు,  దురద కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.

డ్రైనెస్..

వాటర్ ప్రూఫ్ మస్కారా కనురెప్పలను ఎండిపోయేలా చేస్తుంది. ఎక్కువసేపు అలాగే ఉంచినప్పుడు అది తేమను కోల్పోయేలా చేసి కనురెప్పలను నిస్తేజంగా,  పొడిగా చేస్తుంది. దీనివల్ల కనురెప్పలు సహజ మెరుపును  కోల్పోతాయి.

మస్కారా వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ప్రతిరోజు వాటర్ ప్రూఫ్ మస్కారాను ఉపయోగించడడం మంచిది కాదు. ప్రత్యేక సందర్భాలలో లేదా ముఖ్యమైన సమయాల్లో మాత్రమే దాన్ని ఉపయోగించడం మేలు.

 మంచి నాణ్యత గల మస్కారాను మాత్రమే కొనడం మంచిది. ఇది నష్టాన్ని అరికడుతుంది.

మస్కారాను తొలగించడానికి, కనురెప్పలు ఎక్కువగా దెబ్బతినకుండా ఉండటానికి ఆయిల్ ఆధారిత మేకప్ రిమూవర్‌ను ఉపయోగించండి.

రాత్రి పడుకునే ముందు మేకప్ తొలగించడం మర్చిపోకూడదు.

కళ్ళలో ఏదైనా అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

అందం ముఖ్యమే. కానీ  కళ్ళు అంతకంటే ముఖ్యం.  కళ్ళు ఎక్కువ కాలం అందంగా కనిపించాలంటే, వాటర్ ప్రూఫ్ మస్కారాను తెలివిగా వాడాలి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే అందంగా కనిపిస్తూనే కంటి ఆరోగ్యాన్ని  కాపాడుకోవచ్చు.

                              *రూపశ్రీ.