శీతాకాలం వచ్చేసింది.. లిప్ బామ్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

 

శీతాకాలంలో చర్మ సంరక్షణ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది.  మరీ ముఖ్యంగా చర్మం సున్నితంగా ఉండే పెదవుల విషయంలో కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. చల్లని గాలి,  పొడి వాతావరణం వల్ల పెదవులు పగుళ్లు, పొడిబారడం లేదా నొప్పి కలుగుతాయి. ఈ కారణంగా చాలామంది అమ్మాయిలు లిప్ బామ్ కొనుగోలు చేస్తారు.  కానీ సరిగా గమనిస్తే అన్ని లిప్ బామ్ లు పెదవుల పగుళ్లను నయం చేయలేవు. మార్కెట్లో  చవకైన లిప్ బామ్ లు ఉంటాయి.  నాణ్యత లేకుండా ఉండే లిప్ బామ్ లు  లేదా నకిలీ లిప్ బామ్స్  ఉంటాయి.  ఇవి  పెదవులకు హాని కలిగిస్తాయి.

మార్కెట్ లో లభ్యమయ్యే చాలా లిప్ బామ్ లలో  హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి  పెదవుల తేమను కోల్పోయేలా చేసి  సున్నితమైన చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల లిప్ బామ్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. సరైన లిప్ బామ్  పెదాలను మృదువుగా, మెరుస్తూ,  ఆరోగ్యంగా ఉంచుతుంది. లిప్ బామ్ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

తయారీ పదార్థాలు..

 సరైన పదార్థాలతో తయారు చేసిన లిప్ బామ్‌ను కొనుగోలు చేయాలి.  లిప్ బామ్‌లో కొబ్బరి, బాదం,  షియా బటర్ వంటి సహజ నూనెలు ఉండటం చాలా ముఖ్యం. ఇవి లేకపోతే పెదవుల సమస్యలు వస్తాయి.   ఈ పదార్థాలు  పెదవులపై చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి.

SPF తప్పనిసరి

 లిప్ బామ్ లో SPF ఉండటం కూడా ముఖ్యం. SPF  చర్మాన్ని సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది.   సూర్యుని హానికరమైన కిరణాల నుండి  పెదాలను రక్షించే లిప్ బామ్‌ను కొనడం మంచిది. శీతాకాలంలో తేలికపాటి సూర్య కిరణాలు కూడా హానిచేసే అవకాశం ఉంటుంది.

కలర్, ఫ్లేవర్..

లిప్ బామ్ కొనుగోలు చేసేటప్పుడు తరచుగా దాని  సువాసన,  రంగును చెక్ చేస్తారు. అయితే సింథటిక్ కలర్స్, ఫ్లేవర్స్  కలిగి ఉన్న లిప్ బామ్స్  పెదవులకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి.  అటువంటి లిప్ బామ్స్ వాడకుండా ఉండాలి.

బ్రాండ్..

చవకగా ఉందని ఏది పడితే ఆ బ్రాండ్ లిప్ బామ్ ని కొనుగోలు చేసి వాడకూడదు. వీటిలోని పదార్థాలు  పెదవులపై ఉన్న సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి.  పెదవులకు హాని కలిగించకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మంచి బ్రాండ్ ను ఎంచుకోవాలి.

జాగ్రత్త..

ఎంత మంచి లిప్ బామ్ కొన్నా, దాన్ని పదే పదే వాడటం వల్ల  పెదవులు దెబ్బతింటాయి. దాన్ని అతిగా పూయడం వల్ల  పెదవులపై పొర సున్నితంగా మారి దెబ్బతింటుంది.  కాబట్టి  వాడకాన్ని పరిమితం గా ఉంచుకోవాలి.

                                    *రూపశ్రీ.