ఈ టీవీ సీరియల్ మన దేశాన్నే మార్చేస్తోంది!

 

 

ఆడపిల్ల పుట్టబోతోందని తెలిస్తే చంపేయడం, భార్యని గొడ్డుని బాదినట్లు బాదటం, మొహం మీద యాసిడ్ పోయడం... లాంటి వార్తలు మనకి కొత్త కాదు. దేశంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లకి ఏదో ఒక సమస్యే! ప్రతి చోటా వివక్షే! కాకపోతే ఒకో చోట ఒకోలా ఉంటుంది. ఆఫీసులో పనిచేసే ఆడవాళ్లకి ఒక బాధ. మారుమూల పల్లెటూరిలో ఉండే ఆడపిల్లది మరో కష్టం. ఒక టీవీ సీరియల్ ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా నిలుస్తోందంటే నమ్మగలరా!

దూరదర్శన్! ఈ పేరు చెబితేనే ఇప్పటి ప్రేక్షకులు మొహం చిట్లించుకుంటారు. నాలుగు గోడల మధ్య నడిచే నాటకాలు, సంగీత కార్యక్రమాలు, నాణ్యత లేని దృశ్యాలు, ప్లాస్టిక్ పూలు... ఇలాంటివే గుర్తుకువస్తాయి దూరదర్శన్ను తల్చుకుంటే. కానీ ఇప్పటికీ మన దేశంలోని మారుమూల ప్రాంతవాసులకి ఇదే దిక్కు. పైసా ఖర్చు లేని వినోద సాధనం. ముఖ్యంగా బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలలో దూరదర్శన్ది కీలకపాత్ర. ఇదే విషయాన్ని సానుకూలంగా మార్చుకోవాలనుకున్నారు ‘ఫిరోజ్ అబ్బాస్ ఖాన్’ అనే బాలీవుడ్ డైరక్టర్. దూరదర్శన్ ద్వారా సామాన్య ప్రజల ఆలోచనావిధానంలో మార్పు తీసుకురావాలని అనుకున్నారు.

 

 

Population Foundation of India అనే సంస్థతో కలిసి ఫిరోజ్ ‘నేను ఏదైనా సాధించగలను’ (మై కుచ్ భీ కర్ సక్తీ హూ - MKBKSH) అనే ఒక సీరియల్ తీయాలని అనుకున్నారు. మన దేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద అవగాహన కల్పించడం, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడం... ఈ సీరియల్ వెనుక ఉన్న లక్ష్యం. ఇందుకోసం ఈ సీరియల్ బృందం ఏడాది పాటు దేశమంతా తిరిగారు. ఆడవాళ్ల ఇబ్బందులన్నింటినీ గ్రహించే ప్రయత్నం చేశారు. వాటికి పరిష్కారం చూపేలా కథని రూపొందించుకున్నారు.

2014లో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో కథానాయిక పాత్ర పేరు - డా॥ స్నేహా మాధుర్. సాటి ఆడవాళ్ల కోసం స్నేహా తన కెరీర్ను వదులకుని పల్లెబాట పడుతుంది. ఆ ప్రయాణంలో డా॥ స్నేహాతో కలిసి ప్రేక్షకులని నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏదో సాదాసీదాగా సాగిపోతుందనుకున్న సీరియల్కి ఆరంభంలోనే అద్భుతమైన ప్రతిస్పందన కనిపించింది. ఇతర దేశాల ప్రేక్షకులు కూడా దీన్ని చూడసాగారు. ఆఖరికి దీన్ని రేడియోలలో కూడా ప్రసారం చేయడం మొదలుపెట్టారు.

 

 

ఈ సీరియల్ మొదలై ఏడాది గడిచేసరికి ఎక్కడలేని ప్రచారం వచ్చింది. బాలీవుడ్ తారలు, సమాజసేవకులు.... ఈ సీరియల్ అద్భుతమనీ, దీన్ని చూసి తీరాల్సిందే అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రోత్సాహంతో నిర్మాతలు రెండో ఏడు కూడా సీరియల్ను కొనసాగించారు. మొదటి ఏడాది శిశుహత్యలు, బాల్యవివాహాలు, గృహ హింస లాంటి ప్రధాన సమస్యల గురించే ప్రస్తావించారు. కానీ ప్రేక్షకుల ఆదరణతో మరికాస్త దూకుడు పెంచి సెక్స్ ఎడ్యుకేషన్కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు.

ఒక ఏడాదిపాటు ఈ సీరియల్ ప్రసారం అయిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నారు నిర్మాతలు. అందుకోసం మూడువేలకు పైగా గ్రామాలలో ఒక సర్వేని నిర్వహించారు. ఈ సీరియల్తో గ్రామీణ భారతంలో ఎంతో మార్పు వచ్చినట్లు తేలింది. ఆడపిల్లల చదువు, బాల్య వివాహాలు, వెంట వెంటనే పిల్లల్ని కనడం... లాంటి అనేక విషయాల మీద 70 శాతానికి పైగా ప్రజలలో అవగాహన ఏర్పడింది. అంతేకాదు! భార్యని తన్నడం భర్త హక్కు, ఆడది మగవాడితో సమానం కాదు లాంటి అపోహలు నుంచి ఆడవాళ్లు బయటపడ్డారు.

 

 

ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశ టీవీ చరిత్రలో ఇంత ప్రభావవంతమైన సీరియల్ ఇప్పటివరకు రాలేదని అంటున్నారు. అంతేకాదు! ఇప్పటివరకూ ఈ కార్యక్రమాన్ని 40 కోట్ల మంది చూశారట. ప్రేక్షకుల సంఖ్యాపరంగా చూసినా ఇది ఒక రికార్డే. ఇన్నాళ్లు మన టీవీలు, సినిమాలు ఆడవాళ్లని ‘పడిపోయే’ వస్తువులుగానూ, పనికిమాలిన కుట్రలు చేసే పాత్రలుగానే చూపించాయి. దీనికి భిన్నంగా వారి బాగోగుల గురించి ఆలోచించి, పరిష్కారం చూపే కార్యక్రమం రావడం మంచిదే కదా!

- నిర్జర.