పిల్లలలో మలబద్దకం సమస్య తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి!

పిల్లలలో మలబద్ధకం అనేది  సాధారణ సమస్య. పెద్దలు తమ సమస్యను బయటకు చెప్పినంతగా పిల్లలు వ్యక్తం చేయలేరు. ఈ కారణంగా పిల్లలలో మలబద్దకం సమస్య వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాన్ని తల్లులే గమనించి పిల్లల సమస్య తగ్గే మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. ప్రేగు కదలికలు తక్కువ ఉండటం,  పాస్ చేయడం కష్టంగా  అనిపించినప్పుడు మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఎక్కువగా  ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.   అయితే కొన్ని సురక్షితమైన, సమర్థవంతమైన ఇంటి చిట్కాలు పిల్లలలో మలబద్దకం సమస్యకు  ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని జాగ్రత్తగా ఫాలో అయితే పిల్లలలో మలబద్దకం సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు.

ఫైబర్..

పిల్లలు మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నప్పుడు  ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి. ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. పైబర్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి సమస్య తగ్గుతుంది. యాపిల్స్, రేగు పండ్లు,బ్రోకలి, క్యారెట్, బచ్చలికూర. తోటకూర  వంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను, ఓట్స్, బ్రౌన్ రైస్,  పొట్టు తీయని గోధుమలు మొదలైనవి బాగా ఇవ్వాలి.

 ఫ్రూనే జ్యూస్..

ఎండిన ఫ్లం పండ్లను ఫ్రూనే అంటారు. ఈ ఫ్రూనే లతో జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే   ఫ్రూనే జ్యూస్ సహజంగానే భేదిమందు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొద్దిమొత్తంలో ఫ్రూనే జ్యూన్ ను నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా చాలా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. ఇది మోషన్ కావడానికి సహకరిస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఇస్తే అతిసారం సమస్యకు దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొద్దిమొత్తంలో ఇవ్వాలి.

వెచ్చని నీరు..

వెచ్చనినీరు కడుపులో ప్రేగులను, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోజూ 10 నుండి 15 నిమిషాల పాటూ వెచ్చని నీటిలో పిల్లలను కూర్చోబెట్టడం వల్ల  కడుపులో కండరాల కదలిక బాగుంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గోరువెచ్చని నీటిని పిల్లలకు తాగించాలి.

శారీరక శ్రమ..

పిల్లలలో శారీరక శ్రమ లేకపోవడం కూడా మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. అందుకే పిల్లలలో శారీరక వ్యాయామం ప్రోత్సహించాలి. ఆటలు ఆడుకోవడానికి పంపాలి. ఎప్పుడూ కూర్చొని చదువుకోవడం, గేమ్స్, టీవి వంటివే కాకుండా పిల్లలలో యోగా, ఆసనాలు వేయిస్తుండాలి. ఇవి మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికే కాదు.. పూర్తీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతాయి.

                                                  *నిశ్శబ్ద.